తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: BRS Rajatotsava Sabha: బీఆర్ఎస్ పార్టీ ఇక రజతోత్సవ సభపైనే ఫోకస్ పెట్టింది. ఈ సభను విజయవంతం చేసి కేడర్ లో జోష్ నింపాలని భావిస్తూ అందుకోసం ప్రణాళికలు రూపొందిస్తుంది. అందులో భాగంగానే ఏప్రిల్ 2న ఎల్కతుర్తిలో సభ ప్రాంగణానికి భూమి పూజ చేయనున్నట్లు సమాచారం. పార్టీ అనుబంధ సంఘాలతో సమావేశాలు, జిల్లా ఇన్ చార్జులతో కేటీఆర్ భేటీలు నిర్వహించనున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. సభ విజయవంతానికి ఏప్రిల్ మొదటివారంలో కమిటీలు వేయనున్నట్లు తెలిసింది.
రాష్ట్రంలో గులాబీ పార్టీ కేడర్లో కొంత స్తబ్దత ఏర్పడింది. ఓటములనుంచి ఆశించిన మేర నేతలు సైతం బయటపడలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుల్లో కొంత జాప్యం జరుగుతుండటంతో ప్రజల్లో కొంత నైరాశ్యం నెలకొంది. దీనిని అనువుగా మల్చుకోవాలని గులాబీ అధిష్టానం భావిస్తుంది. బడ్జెట్ సెషన్ లో తనదైన శైలీలో ప్రభుత్వంపై విమర్శలు గుప్పించింది. వైఫల్యాలపైనా మాట్లాడింది. అయితే ఏప్రిల్ 27న పార్టీ ఆవిర్భవించి 25 ఏళ్లను పురస్కరించుకొని రజతోత్సవం(సిల్వర్ జూబ్లీ) వేడుకలకు సిద్ధమవుతుంది.
Also read: TG Power Generation Plants: తెలంగాణ సరికొత్త రికార్డ్.. ప్రకటించిన డిప్యూటీ సీఎం భట్టి
5లక్షలకు పైగా ప్రజలను సభకు తరలించి సక్సెస్ చేసి పార్టీ కేడర్ లో, నాయకుల్లోనూ జోష్ నింపాలని భావిస్తుంది. అందుకోసం పక్కా వ్యూహాలను ఫాం హౌజ్ వేదికగా పార్టీ అధినేత కేసీఆర్ రచిస్తున్నారు. సభకు ఎలాంటి వ్యూహాలు అనుసరించాలి, ఎవరికి బాధ్యతలు అప్పగించాలని, జిల్లాల వారీగా సమావేశాలు నిర్వహించి కేడర్ ను సమాయత్తం చేయాలనే అంశాలను సైతం పరిశీలిస్తున్నారు. ప్రతి జిల్లా నుంచి ఎంత మందిని తరలించాలి, గ్రేటర్ బాధ్యతలు ఎవరికి అప్పగించాలనే దానిపైనా త్వరలోనే నేతలకు కేసీఆర్ సూచనలు చేయనున్నట్లు సమాచారం.
తర్జనభర్జనలతో చివరకు ఎల్కతుర్తి ఫిక్స్
పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకలను ఎక్కడ నిర్వహించాలి? వరంగల్ లో నిర్వహించాలా? గ్రేటర్ సమీపంలో నిర్వహించాలా? ఎక్కడ నిర్వహిస్తే ప్రజలను ఎక్కువగా తరలించి విజయవంతం చేయవచ్చని పార్టీ అధిష్టానం తర్జనభర్జన పడింది. తొలుత వరంగల్ శివారులోని దేవన్నపేట, కోమటిపల్లిలో సభ నిర్వహించాలని భావించి పరిసరాలను సైతం పరిశీలించారు. వేసవి నేపథ్యంలో ప్రజల తరలింపు కష్టమని భావించి గ్రేటర్ సమీపంలోని మేడ్చల్ జిల్లా ఘట్ కేసర్ లో నిర్వహించాలని భావిస్తున్నట్లు మీడియాకు లీకులు ఇచ్చారు. ఇక్కడ అయితే గ్రేటర్ నుంచి ప్రజలను ఎక్కువగా తరలించడంతో పాటు రింగ్ రోడ్డు సైతం రవాణాకు సౌలభ్యంగా ఉంటుందని భావించారు. ఆ తర్వాత సభ స్థలిని మారిస్తే ప్రభుత్వంతో పాటు ఇతర రాజకీయ పార్టీలకు వచ్చే స్థానిక, కార్పొరేషన్ ఎన్నికల్లో అస్త్రంగా మారుతుందని భావించిన పార్టీ అధిష్టానం మళ్లీ మనసు మార్చుకుంది. హనుమకొండ జిల్లా ఎల్కతుర్తిలో సభ నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. స్థానిక జిల్లా నేతలు సైతం సభ స్థలిని పరిశీలించారు. నేతలకు పార్టీ అధినేత కేసీఆర్ సైతం పలుసూచనలు చేశారు. ఏప్రిల్ 2వ తేదీన ఎల్కతుర్తిలో సభా స్థలికి భూమి పూజచేయనున్నట్లు తెలిసింది. ఏదిఏమైనప్పటికీ సభాస్థలిపై బీఆర్ఎస్ క్లారిటీ ఇచ్చింది.
ఏప్రిల్ ఫస్ట్ వీక్ లో పార్టీ అనుబంధ సంఘాలతో భేటీలు
సభ విజయవంతానికి పక్కా ప్రణాళికలు రూపొందిస్తుంది. అందులో బాగంగానే ఏప్రిల్ మొదటి వారంలో పార్టీ అనుబంధ సంఘాలతో పాటు జిల్లా ఇన్ చార్జులతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ భేటీ కానున్నారు. తెలంగాణ భవన్ వేదికగా వారికి దిశానిర్దేశం చేయనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. ఆ తర్వాత సెకండ్ వీక్ లో తిరిగి జిల్లా పర్యటనలకు కేటీఆర్ సిద్ధమవుతున్నవారు. జిల్లాలకు వెళ్లే షెడ్యూల్ ను సైతం ప్రకటిస్తారని సమాచారం. ఇప్పటికే సూర్యాపేట, కరీంనగర్ జిల్లాల్లో పార్టీ నేతలతో భేటీ అయ్యారు. సభ విజయవంతంపై పలుసూచనలు చేశారు.
Also read: CM Revanth Reddy: హైదరాబాద్ రోడ్లకు మహర్దశ.. కీలక నిర్ణయం తీసుకున్న సీఎం రేవంత్
సభ విజయవంతానికి కమిటీలు
పార్టీ సభ విజయవంతానికి కమిటీలు వేసి నేతలకు బాధ్యతలు అప్పగించాలని అధినేత కేసీఆర్ భావిస్తున్నారు. ఇప్పటికే మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావుకు బాధ్యతలు అప్పగిస్తున్నట్లు కేసీఆర్ బీఆర్ఎస్ ఎల్పీ సమావేశంలో పేర్కొన్నప్పటికీ అధికారంగా ప్రకటించలేదు. దీంతో ఎవరికి ప్రకటిస్తారనే ఆసక్తి పార్టీ కేడర్ లో నెలకొంది. అయితే హరీష్ రావుకు అప్పగిస్తేనే సభను విజయవంతం చేయవచ్చని పార్టీ అధినేత సైతం భావిస్తున్నట్లు తెలిసింది. అదేవిధంగా మరోనాలుగైదు కమిటీలు వేయనున్నట్లు సమాచారం. సభ వేదిక బాధ్యతలు, జనం తరలింపు, వసతుల కల్పన, నేతల బాధ్యతలు ఇలా ఒక్కోక్కరికి అప్పగించబోతున్నట్లు పార్టీ నేతలు తెలిపారు. ఇప్పటికే కొందరు మాజీ మంత్రులు, నేతల పేర్లు పరిశీలించినట్లు సమాచారం.
కేసీఆర్ ప్రసంగంపైనే కేడర్ ఆసక్తి
సిల్వర్ జూబ్లీని పురస్కరించుకొని పార్టీ సభను నిర్వహిస్తున్నారు. ఈ సభలో కేసీఆర్ ఏం మాట్లాడుతారనేది ఇప్పుడు ఆసక్తి నెలకొంది. ఇప్పటికే కేసీఆర్ ను కలిసి నేతలతో రాబోయే ప్రభుత్వం బీఆర్ఎస్ దేనని, అధికారంలోకి వచ్చి కాంగ్రెస్ 15 నెలలు అయినా ఇప్పటివరకు ఇచ్చిన హామీలు అమలు చేయలేదని, ప్రభుత్వం నడపడం కాంగ్రెస్ కు చేత కావడం లేదని, ఇప్పుడు ఎన్నికలు జరిగినా మనదే అధికారం అని, కేసులు పెట్టినా దైర్యంగా ఎదుర్కోవాలని అండగా ఉంటామని భరోసా కల్పిస్తున్నారు. ప్రజలు ప్రభుత్వ పాలనలో విసిగిపోయారని మన కోసం ఎదురుచూస్తున్నారని ప్రతి సందర్భంలోనూ నేతలతో పేర్కొంటున్నారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత తొలిసారిగా ప్రజల ముందుకు వస్తున్నారు. అయితే సభలో ఏం మాట్లాడుతారు? ప్రజలకు ఏం సందేశం ఇస్తారు? కేడర్ కు ఏం భరోసా కల్పిస్తారు అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.