Murali Naik: పాకిస్థాన్‌తో యుద్ధంలో అగ్నివీర్ మురళీ నాయక్ (Jawan Murali Naik) వీర మరణం పొందిన సంగతి తెలిసిందే. ఆదివారం అశ్రునయనాల మధ్య అంత్యక్రియలు ముగిశాయి. జై జవాన్, భారత మాతాకీ జై నినాదాలతో వీర జవాన్‌కు జనం నివాళులర్పించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రులు, అధికారులు, ప్రజా ప్రతినిధులు కన్నీటి వీడ్కోలు పలికారు. కాగా, అంతిమ సంస్కరాల్లో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రులు నారా లోకేష్, అనగాని సత్యప్రసాద్, సవిత పాల్గొన్నారు. ఈ సందర్భంగా జవాన్ ఇంటి దగ్గర్నుంచి అంత్యక్రియలు జరిగే ప్రదేశం వరకూ.. మురళీ పాడె మోసిన లోకేష్ కడసారి కన్నీటి వీడ్కోలు పలికారు. కాగా, అమర జవాన్ మురళీ నాయక్‌కు, అధికారిక లాంఛనాలతో రాష్ట్ర ప్రభుత్వం అంత్యక్రియలు నిర్వహించింది. అంతకుముందు యుద్ధభూమిలో వీరమరణం పొందిన వీరజవాన్ మురళీ నాయక్ పార్థివ దేహానికి లోకేష్ అశ్రు నివాళులు అర్పించారు. అమరజవాన్ తల్లిదండ్రులను ఓదార్చి ధైర్యం చెప్పారు. మురళీ నాయక్ ధైర్య సాహసాలను స్మరించుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ దేశ సరిహద్దుల్లో పాకిస్థాన్‌తో పోరాడుతూ జవాన్ మురళీ నాయక్ వీరమరణం పొందారన్నారు. చిన్న వయసులో మురళీ మృతి బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. అమర జవాన్ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అదే విధంగా జిల్లాలో మురళీనాయక్ స్మారక చిహ్నం ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు మంత్రి తెలిపారు. గ్రామస్థుల విజ్ఞప్తి మేరకు కల్లితండాను మురళీ నాయక్ తండాగా మారుస్తామని లోకేష్ హామీ ఇచ్చారు.
అండగా ఉంటాం.. ఉద్యోగం ఇస్తాం..
వీర జవాన్ మురళీ నాయక్‌కు సీఎం చంద్రబాబు అంతిమ వీడ్కోలు పలికారు. ‘ ఒక్కగానొక్క కొడుకును పోగొట్టుకున్న ఆ తల్లిదండ్రుల శోకంతో నా గుండె బరువెక్కింది. దేశ రక్షణలో ప్రాణాలర్పించిన మురళీ కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుంది. అమరవీరుడు మురళీ కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం తరపున రూ.50 లక్షల పరిహారం ఇస్తాం. 5 ఎకరాల సాగుభూమితో పాటు.. 300 గజాల ఇంటి స్థలం కేటాయిస్తాం. అదే విధంగా ఆయన కుటుంబ సభ్యులకు ప్రభుత్వ ఉద్యోగం ఇస్తాం. మురళీ నేడు మన మధ్య లేకపోయినా.. ఆయన దేశం కోసం చేసిన త్యాగం ఎప్పుడూ స్ఫూర్తి రగిలిస్తునే ఉంటుందని తెలుపుతూ నివాళి ఘటిస్తున్నాను’ అని ఎక్స్ వేదికగా చంద్రబాబు పేర్కొన్నారు.
అగ్ని వీరుడికి అశ్రునివాళి
అమర జవాను మురళీ నాయక్ భౌతికకాయానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ నివాళులు అర్పించారు. పుత్ర శోకంలో ఉన్న మురళి తల్లిదండ్రులను ఓదార్చి ధైర్యం చెప్పారు. ప్రభుత్వం తరఫున అన్ని విధాలా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ప్రభుత్వం తరఫున రూ.50 లక్షల పరిహారం, ఐదు ఎకరాల పొలం, 300 గజాల స్థలంతో పాటు కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వనున్నట్టు ప్రకటించారు. వ్యక్తిగతంగా మురళీ నాయక్ కుటుంబానికి మరో రూ.25 లక్షల ఆర్థిక సాయం చేయనున్నట్టు తెలిపారు. ఇలాంటి పరిస్థితులు ఏ కుటుంబానికి రాకూడదన్నారు. కాగా, మురళీ కుటుంబానికి ఎప్పుడు ఎలాంటి సాయం కావాలన్నా కూటమి పార్టీలు సిద్ధంగా ఉంటాయని పవన్ గుర్తు చేశారు. జవాన్ కుటుంబానికి భగవంతుడు ధైర్యం ఇవ్వాలని పవన్ ఆకాంక్షించారు.
Read Also- Naga Babu: నాగబాబు మంత్రి అవుతారా.. లేదా? డేంజర్ జోన్‌లో ఉన్నదెవరు?