Naga Babu: కొణిదెల నాగేంద్రబాబు (Konidela Nagendrababu) అనే నేను.. అని మెగా బ్రదర్ మంత్రిగా (Minister) ప్రమాణ స్వీకారం ఎప్పుడెప్పుడు ఉంటుందా? అని జనసేన (Janasena) శ్రేణులు, మెగాభిమానులు ఎదురుచూసి చూసి కళ్లు కాయలు కట్టేశాయి. ఒక్క మాటలో చెప్పాలంటే కొందరు జనసేన కార్యకర్తలు ఆశలు వదులుకున్నారు కూడా. మరికొందరైతే కాస్త ఆలస్యమైనా కచ్చితంగా మెగా బ్రదర్‌ను మంత్రిగా చూడొచ్చని చెబుతున్న పరిస్థితి. అన్నీ సరే.. నాగబాబు మంత్రి అవుతారనేది నిజమే అయితే ఈ కార్యక్రమం ఎప్పుడు ఉంటుంది? ఇంకా ఎన్ని రోజులు సమయం పట్టొచ్చు? అసలు ఉంటుందా? లేదా? అనే ప్రశ్నలు, అంతకుమించి అనుమానాలు అభిమానుల్లో పెద్ద ఎత్తునే వస్తున్నాయి. జనసేన మాత్రమే కాదు బీజేపీ కూడా మరొకర్ని మంత్రిని చేయాలని గట్టిగానే పట్టినట్లుగా తెలుస్తున్నది. ఇదే జరిగితే డేంజర్ జోన్‌లో ఉండే మంత్రి ఎవరు? మంత్రివర్గ విస్తరణ ఎప్పుడు ఉండొచ్చు? అనే ఇంట్రెస్టింగ్ విషయాలు ఈ ‘స్వేచ్ఛ’ ప్రత్యేక కథనంలో తెలుసుకుందాం వచ్చేయండి..
ఎప్పుడు ఉండొచ్చు?
ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చి దాదాపు ఏడాది కావస్తోంది. ఎమ్మెల్సీ అయ్యాక మెగా బ్రదర్ నాగబాబును.. అదిగో ఇదిగో క్యాబినెట్‌లోకి తీసుకుంటామని ప్రభుత్వ పెద్దలు చెబుతున్నారే కానీ ఇంతవరకూ తీసుకున్నదే లేదు. ఆ మధ్య నాగబాబు చేష్టలతో మంత్రి పదవి లేనట్టేనని టాక్ నడిచినప్పటికీ అదంతా ఉత్తుత్తే అని తేలిపోయింది. అయితే విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు జూన్ నెలాఖరులోపు నాగబాబును మంత్రిగా చూడొచ్చని తెలుస్తున్నది. ఎందుకంటే జూలైలో ఆషాడ మాసం ఉండటంతో అంతకుముందే మార్పులు జరిపేందుకు పెద్దలు సన్నాహాలు చేస్తున్నట్లుగా సమాచారం. శనివారం నాడు రాష్ట్ర గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్‌తో సీఎం చంద్రబాబు (CM Chandrababu), డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) భేటీ అయిన సంగతి తెలిసిందే. ఈ సమావేశంలో భాగంగా ఆపరేషన్ సింధూర్‌తో పాటు తాజా పరిణామాలపై నిశితంగా చర్చించారు. మరీ ముఖ్యంగా మంత్రివర్గ విస్తరణపై కూడా చర్చించినట్లుగా తెలియవచ్చింది. అన్నీ అనుకున్నట్లు జరిగితే అతి త్వరలోనే విస్తరణపై అధికారిక ప్రకటన రానున్నట్లుగా సమాచారం.
డేంజర్ జోన్‌లో ఎవరో?
వాస్తవానికి కేబినెట్‌లో కొందరు మంత్రులపై సీఎం చంద్రబాబు తీవ్ర అసంతృప్తిగా ఉన్న విషయం జగమెరిగిన సత్యమే. మంత్రుల పనితీరు మార్చుకోవాలని పదే పదే చెప్పినా, వ్యక్తిగతంగా క్లాస్ తీసుకున్న ఫలితం లేకపోయింది. స్వయంగా చంద్రబాబే రంగంలోకి దిగినా ఎలాంటి ఫలితం లేదట. అధికారంలోకి వచ్చి ఏడాది కాలం గడుస్తున్నా ఆ మంత్రులు తమ విధానాన్ని మార్చుకోలేదని.. కనీసం శాఖలపై 10 శాతం కూడా పట్టు పెంచుకోలేకపోయారని, దీంతో వారిపై త్వరలోనే చర్యలు తీసుకునే అవకాశముందని చర్చ సాగుతోంది. ఈ క్రమంలోనే ఇద్దరు మంత్రులు డేంజర్ జోన్‌లో ఉన్నట్లుగా లీకులు వస్తున్నాయి. ఇందులో ఒకరు రాయలసీమకు చెందిన మంత్రి కాగా.. మరొకరు గోదావరి జిల్లాలకు చెందిన వారని తెలిసింది. ఆ ఇద్దరినీ కూడా మంత్రివర్గం నుంచి తప్పించి ఆ ఇద్దరి స్థానంలో సీనియర్లను తీసుకునేందుకు పెద్దలు సన్నాహాలు చేస్తున్నట్లుగా తెలిసింది. ఈ క్రమంలోనే బీజేపీ కూడా ఒక మంత్రి పదవి కోరుతున్నట్లుగా తెలిసింది. మరోవైపు టీడీపీ నుంచి మంత్రి అయ్యేందుకు చాలా మందికే అర్హతలు ఉన్నాయి. అవకాశం కోసం సీనియర్లు, జూనియర్లు సైతం పెద్ద ఎత్తునే ఎదురుచూపుల్లోనే ఉన్నారు. ఇందులో నిజానిజాలెంత అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.
Read Also- Amaravati: వైఎస్ జగన్ మళ్లీ గెలిస్తే అమరావతి పరిస్థితేంటి? ఉంటుందా?