మహబూబాబాద్ స్వేచ్ఛ:District Sericulture Officer: జిల్లా ఉద్యాన మరియు పట్టు పరిశ్రమ అధికారి జినుగు మరియన్న పేర్కొన్నారు. జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమల జిల్లా అధికారి డోర్నకల్, కురవి, సీరోల్, మహబూబాబాద్ మండలాల్లోని పలు గ్రామాలలో సాగులో వున్న ఆయిల్ పామ్, మామిడి, జామ, నిమ్మ, పనస, సపోట, కూరగాయలు, పూలు, ఉద్యాన పంటల సాగును పరిశీలించి పలు మేలైన యాజమాన్య పద్ధతులను రైతులకు తెలిపారు.
వేసవిలో షెడ్ నెట్లలలో కూరగాయల సాగు, పూల సాగు వలన ఆదాయం పొందవచ్చని తెలిపారు. సేంద్రియ పద్ధతులు పాటించాలని, మామిడి, జామలో ఫ్రూట్ బ్యాగింగ్, ఆయిల్ పామ్ తోటలో నల్ల కొమ్ము పురుగు నివారణ, వేసవిలో పంటల సాగులో పలు మెళకువలను పాటించాలని సూచించారు. ఉద్యాన పంటల సాగు లాభదాయకంగా ఉంటుందని అన్నారు. పంట మార్పిడితో అధిక ఆదాయం, పండ్ల తోటలలో అంతర పంటలుగా కూరగాయల సాగు, మార్కెట్ లో డిమాండ్ ఉన్న పంటలు సాగు చేయాలని సూచించారు.
Also Read: Sunita Williams: సునీతా విలియమ్స్ సేఫ్.. ఇదే లేకుంటే.. ఎప్పటికీ అక్కడే?
నిత్యం రోగనిరోధక శక్తికి, ఆరోగ్యంగా ఉండటానికి పోషకాలు అందించే పండ్ల తోటలు జామ, నిమ్మ, అరటి, బొప్పాయి, సీతాఫలం, పనస, నేరేడు, అవకాడో, ఫ్యాషన్ ఫ్రూట్, కూరగాయలు, ఆకు కూరలు, మునగ, వెదురు సాగు చేయాలని వివరించారు. ఈ పంటల ద్వారా ఎకరానికి రూ. లక్ష నికర ఆదాయం పొందాలని రైతులకు విజ్ఞప్తి చేశారు. ప్రతి రైతు పొలం గట్ల మీద, పొలం చుట్టూ, పెరట్లో, ఆయిల్ పామ్, పండ్ల తోటలలో అంతర పంటలుగా, డాబాల మీద, ఇంటి ముంగిట రోజువారి అవసరాల నిమిత్తం అన్ని రకాల కూరగాయలను సాగు చేసుకోవాలని సూచించారు.
కూరగాయల సాగులో మేలైన యాజమాన్య పద్ధతులు, నూతన రకాల సాగు, ప్రోట్రేస్లలో నారు పెంపకం, ఎత్తు మడులు, మల్చింగ్, బిందు సేద్యం, ఫర్టిగేషన్, వేప పిండి, ఆముదం పిండి వాడకం, వేప నూనె పిచికారి చేయటం, పసుపు రంగు అట్టల వాడకం, సిఫారసు చేసిన ఎరువులు వాడటం, పందిరిపై కూరగాయల సాగు, ట్రెల్లిస్ మెథడ్ లో టమాటా సాగు మొదలైన పద్ధతులు పాటించాలన్నారు.
ఈ పంటల క్షేత్ర సందర్శనలో రైతులు పంతంగి వెంకటేశ్వర్లు, వెన్నబోయిన కొండల్‌రావు, కొప్పుల వెంకటరెడ్డి, నర్సయ్య, అంజయ్య, ఆయిల్ ఫెడ్ అధికారి బాకి నాగరాజు, బిందు సేద్య అధికారి అగస్టిన్ పాల్గొన్నారు.
Also Read: CM Revanth Reddy: తెలంగాణ బాటలో యావత్ దేశం.. సీఎం రేవంత్ ప్లాన్ అదుర్స్ కదూ