Big Academy – Yuvraj Singh: జీవితంలో విఫలం కాకుంటే విజయం ఎలా సాధించాలో తెలియదని, పరాజయు తప్పుకాదని టీమిండియా దిగ్గజ మాజీ క్రికెటర్ యువరాజ్ సింగ్ సందేశం (Big Academy – Yuvraj Singh) ఇచ్చాడు. ఫెయిల్ కావడం తప్పు కాదని, తన ప్రయాణం కూడా ఎన్నో వైఫల్యాల పునాదుల మీద సాగిందని గుర్తుచేసుకున్నాడు. అపజయాల నుంచే తన విజయగాథ వచ్చిందని, అందుకే పరాజయానికి భయపడొద్దని సూచన చేశాడు. అత్యుత్తమ ప్రయత్నం చేయాలంటూ ‘బిగ్ అకాడమీ’ ప్రారంభోత్సవ కార్యక్రమంలో విద్యార్థులకు విలువైన సూచనలు చేశారు. హైదరాబాద్ నగరంలోని నోవాటెల్ హోటల్‌లో జరిగిన ఈవెంట్‌లో ముఖ్యఅతిథిగా పాల్గొని విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించాడు. ఓటమి విషయంలో ఎప్పుడూ భయపడొద్దని, ఓడిపోతేనే గెలుపు విలువ తెలుస్తుందని సూచన చేశారు. తన ఎన్నో అపజయాల స్వరూపమే తన సక్సెస్ స్టోరీ అని యువరాజ్ అభివర్ణించాడు.
Read Also- Son after 10 Daughters: బాబోయ్.. వరుసగా 10 మంది కూతుళ్లు.. 11వ సంతానంలో నెరవేరిన ‘కొడుకు కల’
జీవితంలో ఒత్తిడి సర్వసాధారణం
పిల్లల చదువుల కోసం వారి తల్లిదండ్రులు ఎంతో కష్టపడుతున్నారని, అందుకే, ఏ పని చేసినా దాన్ని ఆస్వాదిస్తూ, మనసు పెట్టి చేయాలని సూచించారు. శ్రద్ధగా ఆ పని చేయలేనప్పుడు ఆ పనిని ఆపివేయాలంటూ సూచించాడు. జీవితంలో ఒత్తిడి సర్వసాధారణమని సూచించారు. విద్యార్థులు చదువుతున్నా, ఆడుతున్నా, లేదా జాబ్ చేస్తున్నా ఒత్తిడి కచ్చితంగా ఉంటుందని, దానిని అధిగమించాలంటే ప్రాక్టీస్ చేయడం ఒక్కటే ఏకైక మార్గమని సూచించాడు. చిత్తశుద్ధితో సాధన చేస్తే ఫలితాలు కచ్చితంగా వెతుక్కుంటూ వస్తాయని యువరాజ్ సింగ్ పేర్కొన్నాడు. బిగ్ అకాడమీ విద్యార్థులకు మంచి జరగాలని ఆకాంక్షిస్తున్నట్టు చెప్పాడు. ఎడ్యుకేషన్, టెక్నాలజీ మేళవింపుతో వచ్చిన బిగ్ అకాడమీ సంస్థ రానున్న 20 ఏళ్ల పాటు అద్భుతాలు సాధిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశాడు. కాగా, యువరాజ్ సింగ్ బిగ్ అకాడమీకి బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నాడు.
Read Also- Prithviraj Shetty: యానిమల్, దురంధర్, కెజియఫ్‌లలో హీరోగా నేను చేస్తే బాగుండేది!
మీ పిల్లల్ని పక్కింటి పిల్లలతో పోల్చొద్దు: బ్రాహ్మానందం
బిగ్ అకాడమీ లాంచింగ్ ఈవెంట్‌లో ప్రముఖ హస్య నటుడు బ్రహ్మానందం కూడా పాల్గొన్నారు. పిల్లలను పక్కింటి పిల్లలతో పోల్చడం మానుకోవాలని తల్లిదండ్రులకు ఆయన సూచన చేశారు. విద్యార్థులు మానసిక ఒత్తిడికి గురవ్వడానికి తల్లిదండ్రులే ప్రధానకారమని ఆయన వ్యాఖ్యానించారు. వాడిని చూడు ఎంత బాగా చదువుతున్నాడో అని పిల్లల్ని తిడుతుంటారని, ఇలాంటి పోలికలే పిల్లలను మానసికంగా దెబ్బతీస్తాయని హితబోధ చేశారు. పిల్లల్లో ఎవరి నైపుణ్యం వారికి ఉంటుందని అన్నారు. తాను చాలా నిరుపేద కుటుంబం నుంచి వచ్చానని, చదువుకోవడానికి, ఒక్కో మెట్టు ఎక్కడానికి ఆర్థికంగా, మానసికంగా, శారీరకంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నానని ఆయన గుర్తుచేసుకున్నారు. అయితే, సవాళ్లను స్వీకరించి, కష్టపడి ఈ స్థాయికి వచ్చానంటూ విద్యార్థుల్లో స్ఫూర్తి నింపారు. విద్యార్థులు కూడా కష్టాలను సవాలుగా స్వీకరించాలని సూచన చేశారు.

