Telangana Liquor Tender: వైన్ షాపుల కోసం దరఖాస్తులు క్రమంగా జోరందుకుంటున్నాయి. నోటిఫికేషన్ జారీ చేసిన తరువాత 48రోజుల్లో కేవలం 1,581 అప్లికేషన్లు మాత్రమే రాగా గడిచిన మూడు రోజుల్లోనే 4,082 దరఖాస్తులు అందాయి. పంచాంగం ప్రకారం సోమవారం నుంచి మంచి రోజులు ఉండటంతో గడువు ముగిసేనాటికి అనుకున్న టార్గెట్ పూర్తవుతుందని ఎక్సయిజ్ అధికారులు అంచనా వేస్తున్నారు. దీని కోసం తమ వంతుగా అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. వచ్చే రెండేళ్ల కాలానికి వైన్ షాపులు కేటాయించేందుకు ప్రభుత్వం ఆగస్టు 20న నోటిఫికేషన్ ను జారీ చేసిన విషయం తెలిసిందే. ఆ వెంటనే దరఖాస్తులు భారీ సంఖ్యలో వస్తాయని అధికారులు భావించారు. అయితే, వారి అంచనాలు తల్లకిందులయ్యాయి.
జిల్లాల వారీగా సమీక్షా సమావేశాలు..
నోటిఫికేషన్ జారీ అయి నెలన్నర రోజులు గడిచినా అప్లికేషన్ల సంఖ్య 2వేలకు కూడా చేరుకోలేదు. దరఖాస్తు చేసుకోవటానికి చెల్లించే నాన్ రీ ఫండబుల్ ఫీజును 2 నుంచి 3 లక్షలకు పెంచటమే కారణమన్న చర్చ జోరుగా నడిచింది. దాంతో అలర్ట్ అయిన ఉన్నతాధికారులు జిల్లాల వారీగా సమీక్షా సమావేశాలు నిర్వహించారు. గత ఏడాది 1.32లక్షల అప్లికేషన్లు వచ్చాయని, ఈసారి వాటి సంఖ్య కనీసం 1.50లక్షలు దాటేలా చూడాలని సిబ్బందికి మౌఖిక ఆదేశాలు జారీ చేశారు. ఈ క్రమంలో రంగంలోకి దిగిన ఆయా ఎక్సయిజ్ పోలీస్ స్టేషన్ల సిబ్బంది ఇప్పటికే షాపులు నడుపుతున్న వారితోపాటు గతంలో ఇదే వ్యాపారం చేసిన వారిని, డబ్బున్న బడా బాబులతో వైన్ షాపుల కోసం అప్లికేషన్లు పెట్టుకోవాలని చెప్పారు. షాపు దక్కిందంటే జాక్ పాట్ కొట్టినట్టే అని చెప్పారు. ఈనెల 18వ తేదీ చివరి గడువు కావటం వల్ల తొందర పడాలని సూచించారు. ఎక్సయిజ్ సిబ్బంది పడ్డ ఈ శ్రమ ప్రస్తుతం ఫలితాలను ఇస్తోంది. గడిచిన మూడు రోజుల్లోనే 4,082 దరఖాస్తులు అధికారులకు అందాయి. దాంతో ఇప్పటివరకు వచ్చిన అప్లికేషన్ల సంఖ్య 5,663కు పెరిగింది.
మంచి రోజులపై ఆశ…
మద్యం వ్యాపారంలో ఉన్న చాలామంది ముహూర్తాలు చూసుకోవటం సర్వసాధారణం. ఏ పని చేసినా మంచి రోజు చూసుకుంటుంటారు. ఇక, ఒక్క 14వ తేదీని (అష్టమి) మినహాయిస్తే సోమవారం నుంచి దరఖాస్తులకు ఆఖరు గడువు అయిన 18వ తేదీ వరకు అన్నీ మంచి రోజులే ఉన్నాయి. దాంతో ఈ రోజుల్లో భారీ సంఖ్యలో దరఖాస్తులు వచ్చే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. క్రితంసారి నోటిఫికేషన్ జారీ చేసినపుడు కూడా చివరి రెండు రోజుల్లోనే 50వేల వరకు అప్లికేషన్లు వచ్చిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు.
Also Read: Haryana IPS Suicide: సంచలనంగా మారిన ఐపీఎస్ ఆత్మహత్య.. ఎస్పీపై వేటు
ఇతర రాష్ట్రాల వారు కూడా..
ఇతర రాష్ట్రాలకు చెందిన వారు కూడా పెద్ద సంఖ్యలో వైన్ షాపుల కోసం దరఖాస్తు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. క్రితంసారి నోటిఫికేషన్ జారీ చేసినపుడు ఆంధ్రప్రదేశ్(AP), కర్ణాటక(Karnataka), మహారాష్ట్ర(Maharasta)లకు చెందిన పలువురు బడా వ్యాపారులు పెద్ద సంఖ్యలో దరఖాస్తులు చేసుకున్నారు. కొందరైతే పదేసి షాపులకు అప్లికేషన్లు పెట్టుకున్నారు. ఈసారి కూడా ఇప్పటికే ఇతర రాష్ట్రాలకు చెందిన కొందరు అప్లికేషన్లు పెట్టుకున్నారని ఎక్సయిజ్ వర్గాలు చెబుతున్నాయి. ఇక, ఎస్సీ(SC), ఎస్టీ(ST)లతోపాటు గౌడ కులస్తులకు రిజర్వ్ చేసిన షాపుల కోసం వస్తున్న దరఖాస్తుల సంఖ్య కూడా క్రమంగా పెరుగుతుండటం గమనార్హం.
రంగారెడ్డి టాప్..
ఈసారి వైన్ షాపుల కోసం ఎక్కువగా దరఖాస్తులు రంగారెడ్డి(Rangareddy) జిల్లాలో రావటం గమనార్హం. 2,353 అప్లికేషన్లతో ఈ జిల్లా టాప్ ప్లేస్ లో నిలిచింది. ఇక, 746 దరఖాస్తులతో హైదరాబాద్(Hyderabada) రెండో స్థానంలో ఉంది. మిగితా జిల్లాల్లో కూడా అప్లికేషన్లు క్రమంగా పెరుగుతున్నాయని అధికారులు చెబుతున్నారు.
అదనపు కౌంటర్లు..
చివరి రోజుల్లో దరఖాస్తులు భారీగా వస్తాయని భావిస్తున్న నేపథ్యంలో ఎక్సయిజ్ అధికారులు రాష్ట్రవ్యాప్తంగా అదనంగా కౌంటర్లను ఏర్పాటు చేశారు. ఇక, అప్లికేషన్లు ఇవ్వటానికి వచ్చే వారికి ఎలాంటి సమస్యలు ఎదురు కాకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఎక్సయిజ్ కమిషనర్ హరికిరణ్ స్వయంగా దీనిని పర్యవేక్షిస్తున్నారు.
Also Read: Srikanth Iyengar: ఆ నటుడిపై ‘మా’ అధ్యక్షుడికి ఫిర్యాదు చేసిన ఎమ్మెల్సీ.. చర్యలు తప్పవా?
