Haryana IPS Suicide: హర్యానాలో సీనియర్ ఐపీఎస్(IPS) అధికారి పురాణ్ కుమార్(Puran Kumar) ఆత్మహత్య సంచలనంగా మారింది. ఈ కేసుకు సంబంధించి అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో రోహ్‌తక్ ఎస్పీ నరేంద్ర బిజార్ణియా(Narendra Bijarnia) పై వేటు పడింది. ఇష్యూ వివాదాస్పదం కావడంతో పోలీసులు విచారణను ముమ్మరం చేశారు.
అసలేం జరిగిందంటే?
చండీగఢ్‌లోని తన నివాసంలో మంగళవారం పురాణ్ కుమార్ ఆత్మహత్య చేసుకున్నారు. రివాల్వర్‌తో కాల్పుకున్నారు. ఆత్మహత్య సమయంలో సూసైడ్ నోట్ రాశారు. హర్యానా డీజీపీ శత్రుజీత్ కపూర్ సహా 8 మంది సీనియర్ అధికారులపై కుల ఆధారిత వివక్ష, బహిరంగ అవమానాలు, మానసిక వేధింపులు, దౌర్జన్యాల గురించి పురాణ్ ప్రస్తావించారు.
కుటుంబ సభ్యుల ఆరోపణలు
ఎఫ్ఐఆర్(FIR)లో హర్యానా డీజీపీ శత్రుజీత్ సింగ్ కపూర్(DGP Shatrujeet Singh Kapoor)తోపాటు రోహ్‌తక్ ఎస్పీ నరేంద్ర బిజార్ణియాల పేర్లను చేర్చాలంటూ పురాణ్ భార్య, సీనియర్ ఐఏఎస్ అధికారిణి అమ్నీత్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇటు, కాంగ్రెస్(Vongress) అగ్రనేత సోనియా గాంధీ(Sonia Gandhi)కి కూడా లేఖ రాశారు. ఐపీఎస్ అధికారి పురాణ్ సూసైడ్ చేసుకోవడం తనను షాక్‌కు గురిచేసిందని, ఎంతో బాధ కలిగించిందని సోనియా గాంధీ తెలిపారు. న్యాయం కోసం మీరు చేస్తున్న పోరాటానికి కోట్లాది మంది భారతీయులు అండగా ఉన్నారంటూ అమ్నీత్‌కు భరోసా కల్పించారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) స్పందిస్తూ, సమాజంలో కుల ఆధారిత ద్వేషం ఎంత పెరిగిందో చెప్పేందుకు ఇదో ఉదాహరణగా పేర్కొన్నారు. ఏడీజీపీ(ADGP) స్థాయి అధికారి కూడా వేధింపులకు గురైతే, సాధారణ ప్రజల పరిస్థితి ఏంటని ప్రశ్నించారు.
అధికారిపై వేటు
పురాణ్ కుమార్ సూసైడ్ కేసు ఇన్విస్టిగేషన్ కోసం హర్యానా ప్రభుత్వం ఆరుగురితో కూడిన స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (సిట్) ఏర్పాటు చేసింది. దర్యాప్తు కొనసాగుతున్న సమయంలోనే ఆరోపణలు ఎదుర్కొంటున్న రోహతక్ ఎస్పీ నరేంద్ర బిజార్ణియాపై వేటు వేసింది. ఆయన స్థానంలో సురీందర్ సింగ్ భోరియాను నియమించింది. డీజీపీని దీర్ఘకాలిక సెలవుపై పంపే విషయాన్ని పరిశీలిస్తున్నట్టు సమాచారం. పురాణ్ కుమార్ ఆంధ్రప్రదేశ్ వాసి.
Also Read: John Wesley: బీసీ రిజర్వేషన్లపై వెంటనే అఖిలపక్షాన్ని ఏర్పాటు చేయండి: జాన్ వెస్లీ
