HYD News: నిందిత ప్రియుడిని అరెస్ట్ చేసిన పోలీసులు
తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసిన భార్యను సరూర్ నగర్ పోలీసులు (HYD News) అరెస్ట్ చేశారు. ఈ షాకింగ్ ఘటనకు సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి. నాగర్ కర్నూల్ జిల్లా మాదారం గ్రామానికి చెందిన చిట్టి, శేఖర్ భార్యాభర్తలు. కొంతకాలం క్రితం హైదరాబాద్ వలస వచ్చి సరూర్ నగర్ కోదండరాం నగర్‌లో నివాసం ఉంటున్నారు. శేఖర్ డ్రైవర్‌గా పని చేస్తుండగా, చిట్టి ఓ ప్రైవేట్ ఉద్యోగం చేస్తోంది.
పని మీద శేఖర్ తరచూ బయటకు వెళుతుండేవాడు. ఇదే సమయంలో పని చేస్తున్న చోట హరీష్ అనే వ్యక్తితో చిట్టికి పరిచయం ఏర్పడింది. ఇద్దరి మధ్య చనువు పెరిగి వివాహేతర సంబంధానికి దారితీసింది. ఈ విషయం తెలిసి భర్త శేఖర్ పలుమార్లు చిట్టిని మందలించాడు. దాంతో భర్త అడ్డుతొలగించుకోవాలని నిర్ణయించుకున్న చిట్టి గురువారం రాత్రి శేఖర్ నిద్రపోయాక దారుణానికి ఒడిగట్టింది. భర్త నిద్రపోయాక ప్రియుడు హరీష్‌ను చిట్టి ఇంటికి పిలిపించుకుంది. నిద్రపోతున్న శేఖర్ గొంతును హరీష్ గట్టిగా నులమగా.. చిట్టి డంబెల్‌తో తలపై బలంగా కొట్టింది. దాంతో శేఖర్ అక్కడికక్కడే మరణించాడు.
అయితే, పథకం ప్రకారం, శేఖర్‌ది సహజ మరణమని చిత్రీకరించటానికి చిట్టి ప్రయత్నించింది. కానీ, పొంతన లేని విధంగా ఆమె మాట్లాడడంతో పోలీసులకు అనుమానం వచ్చింది. తమదైన శైలిలో విచారించగా అసలు విషయం వెలుగు చూసింది. దీంతో, చిట్టిని పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న హరీష్‌ను శనివారం అదుపులోకి తీసుకున్నారు.
Read Also- 50 Years for Balakrishna: కత్తులతో కాదురా.. కంటి చూపుతో చంపేస్తా! ఈ డైలాగ్ రజినీకాంత్ చెబితే!
కత్తితో గొంతు కోసి భర్త హత్య
తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: కత్తితో గొంతు కోసి భర్తను హత్య చేసింది ఓ ఇల్లాలు. ఆ తర్వాత తాను కూడా గొంతుకొని ఆత్మహత్యాయత్నం చేసింది. స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించిన ఈ సంఘటన కేపీహెచ్‌బీ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం జరిగింది. హౌసింగ్ బోర్డ్ కాలనీలో నివాసముంటున్న రమ్యకృష్ణ, రామకృష్ణా రెడ్డి భార్యాభర్తలు. రెస్టారెంట్ నడపటంతోపాటు పలు వ్యాపారాలు నిర్వహించారు. దీని కోసం బంధుమిత్రుల నుంచి భారీ మొత్తాల్లో అప్పులు తీసుకున్నారు. అయితే, చేసిన అన్ని వ్యాపారాల్లో నష్టాలు వచ్చాయి. దాంతో భార్యాభర్తలు ఆర్థిక సమస్యల్లో కూరుకు పోయారు.
Read Also- Sniffer Dog Retires: పోలీసు జాగిలం రిటైర్మెంట్.. ఎన్ని కేసుల్లో నిందితులను పట్టించిందంటే?
మరోవైపు ఇచ్చిన బాకీలు తీర్చాలంటూ అప్పు ఇచ్చిన వారి నుంచి ఒత్తిడి పెరిగిపోయింది. ఈ క్రమంలో ఇద్దరూ చనిపోవాలని నిర్ణయించుకున్నారు. నిర్ణయించుకున్నట్టుగా, నాలుగు రోజులుగా ఇంట్లోనే ఉంటూ ఒకరినొకరు కత్తితో గాయపరుచుకుంటూ వచ్చారు. శనివారం రమ్యకృష్ణ కత్తితో భర్త గొంతు కోసి, ఆ తర్వాత తాను కూడా గొంతు కోసుకుంది. రక్తస్రావం అధికంగా కావటంతో రామకృష్ణారెడ్డి అక్కడికక్కడే చనిపోయాడు. రమ్యకృష్ణ స్పృహ కోల్పోయింది. ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న కేపీహెచ్‌బీ పోలీసులు చికిత్స నిమిత్తం రమ్యకృష్ణను ఆస్పత్రికి తరలించారు. పంచనామా జరిపి రామకృష్ణారెడ్డి మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. ఆర్థిక సమస్యల కారణంగానే రమ్యకృష్ణ భర్త గొంతు కోసం ఆత్మహత్యకు ప్రయత్నం చేసినట్టుగా పోలీసులు తెలిపారు.