Montha Effects TG: ఆంధ్రప్రదేశ్‌లో మంగళవారం రాత్రి తీరం దాటిన ‘తుపాను మొంథా’ తెలంగాణపై తీవ్ర ప్రభావాన్ని (Montha Effects TG) చూపుతోంది. రాష్ట్రంలోని పలుప్రాంతాల్లో కుంభవృష్టి వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట జిల్లాల్లో బీభత్సమైన వానలు పడుతున్నాయి. ఈ ప్రాంతాల్లో ఉదయం మొదలుకొని సాయంత్రం 6 గంటల తర్వాత కూడా వర్షం కురుస్తూనే ఉంది. తుపాను వర్షపాత మేఘాలు ఈ ప్రాంతంలోనే ఆవరించి ఉండడంతో, రికార్డుస్థాయి వర్షపాతం నమోదయింది. వరంగల్ జిల్లాలోని పర్వతగిరిలో ఏకంగా 34 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయిందంటే పరిస్థితి ఎంత తీవ్రంగా ఉందో అర్థం చేసుకోవచ్చు. మొంథా ప్రభావంతో చాలా ప్రాంతాల్లో ఎడతెరిపిలేని భారీ వర్షాలు కురుస్తున్నాయి.
ఉమ్మడి వరంగల్, చుట్టుపక్కల ప్రాంతాలలో లోతట్టు ఏరియాలు ముంపునకు గురయ్యాయి. ఒకపక్క పంటలు తీవ్రంగా దెబ్బతినగా, మరోపక్క రవాణా వ్యవస్థ అస్తవ్యస్తమైంది. రోడ్లు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. కొన్నిచోట్ల రైల్వే సేవలు కూడా నిలిచిపోయాయి. డోర్నకల్ వద్ద రైల్వే ట్రాక్ మొత్తం నీటిలో మునిగిపోయింది. ఈ కల్లోల పరిస్థితిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇతర మంత్రులు అధికారులను అప్రమత్తం చేశారు. వర్షప్రభావిత ప్రాంతాలలో సహాయక చర్యలు వేగంగా చేపట్టాలంటూ అధికారులను సమీక్షా సమావేశంలో ఆదేశించారు. జిల్లా కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని సూచనలు చేశారు. బుధవారం రాత్రి కూడా వర్షాలు కురిస్తే మరింత ఇబ్బందికరమైన పరిస్థితులు నెలకొనే అవకాశం ఉండడంతో, రెస్క్యూ బృందాలు కూడా ప్రభావిత ప్రాంతాలకు చేరుకున్నాయి.
Read Also- Murmu in Rafale: రాష్ట్రపతి ముర్ము బిగ్ సర్‌ప్రైజ్.. ఈ ఫొటోలోని శివంగిని చూస్తే పాకిస్థాన్ అవాక్కే!
ఎప్పుడూ చూడనంత వర్షపాతం
వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, యాదాద్రి జిల్లాల్లో కనీవినీ ఎరుగని రీతిలో. చరిత్రలో ఎప్పుడూ లేనంతగా భారీ వర్షాలు కురిశాయి. వరంగల్ జిల్లాలోని పర్వతగిరిలో ఏకంగా 34 సెం.మీ వర్షపాతం నమోదయింది. చాలా ప్రాంతాల్లో 200-300 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. దీనిని బట్టి వర్షాలు ఎంత భయంకరంగా కురిశాయో అర్థం చేసుకోవచ్చు. మేఘాలు ఈ ప్రాంతం నుంచి కదలకపోవడంతో 400 మిల్లీమీటర్ల వరకు కూడా వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి, ప్రభావిత జిల్లాల్లో జనాలు ఇళ్ల నుంచి బయటకు రావొద్దని అధికారులు సూచిస్తున్నారు. బుధవారం అర్ధరాత్రి వరకు భారీ వర్షాలు కొనసాగుతాయని అప్రమత్తం చేశారు. వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, మరికొన్ని జిల్లాలకు భారత వాతావరణ విభాగం రెడ్ అలర్ట్ జారీ చేసింది. అత్యంత భారీ వర్షాలు కొనసాగే అవకాశం ఉందని ఒక ప్రకటనలో హెచ్చరించింది.
హైదరాబాద్‌లోనూ జోరువాన
తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో కూడా బుధవారం భారీ వర్షం కురిసింది. ఉదయం మొదలైన వర్షం పొద్దుపోయాక కూడా ఎడతెరిపిలేకుండా కురుస్తూనే ఉంది. ఇక, గురువారం వాతావరణం విషయానికి వస్తే, అక్కడక్కడా చెదురుమదురు జల్లులు మినహా వాతావరణం దాదాపు పొడిగానే ఉంటుందని ‘తెలంగాణ వెధర్‌మ్యాన్’ (ట్విటర్ పేజీ) తెలిపింది. అయితే, ఉత్తర తెలంగాణలో మాత్రం భారీ వర్షాలు ఉంటాయని అప్రమత్తం చేసింది.
