Vote-for-Note Case: ఓటుకు నోటు కేసులో (Vote-for-Note Case) సుప్రీం కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది. ఈ కేసుపై అత్యున్నత న్యాయస్థానం విచారణ జరిపింది. ఈ సందర్భంగా కేసులో ముఖ్యమంత్రి ఉన్నా ఓ నిందితునిపై ఎఫ్ఐఆర్ కొట్టి వేయటాన్ని సవాల్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టుకు రావటం అభినందనీయమని వ్యాఖ్యానించింది. రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసులో నాలుగో నిందితునిగా ఉన్న జెరూసలెం మత్తయ్యపై నమోదైన ఎఫ్ఐఆర్ ను కొట్టివేస్తూ కొన్ని రోజుల క్రితం హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే. దీనిని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో సవాల్ చేసింది. ఎఫ్ఐఆర్ లో…ఛార్జిషీట్ లో నాలుగో నిందితునిగా ఉన్న జెరూసలెం మత్తయ్యపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని హైకోర్టు ఆదేశాలు ఇచ్చిందని రాష్ట్ర ప్రభుత్వ తరపు న్యాయవాది మేనకా గురుస్వామి కోర్టుకు తెలిపారు.
Also Read: Mahabubabad District: ప్రభుత్వ అధికారుల బహిరంగ వాగ్వాదం.. బతుకమ్మ వేడుకల్లో ఉద్రిక్తత
దర్యాప్తు కొనసాగించేలా ఉత్తర్వులు ఇవ్వాలి
కేసు ప్రాథమిక దశలోనే నిందితునిపై నమోదైన ఎఫ్ఐఆర్ ను కొట్టివేసిందని చెప్పారు. కేసులో కీలక నిందితునిగా ఉన్న జెరూసలెం మత్తయ్యపై ఎఫ్ఐఆర్ కొట్టి వేయటం మొత్తం దర్యాప్తుపై ప్రభావం చూపుతుందన్నారు. హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను రద్దు చేసి దర్యాప్తు కొనసాగించేలా ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. కాగా, జెరూసలెం మత్తయ్య తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ హైకోర్టు అన్ని అంశాలను పరిశీలించిన తరువాతే ఉత్తర్వులు ఇచ్చిందని తెలిపారు. ఇరుపక్షాల వాదనలు విన్న సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బీ.ఆర్.గవాయ్ నేతృత్వంలోని ధర్మాసనం దీనిపై తీర్పును రిజర్వ్ చేసింది. ఈ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేసులో సీఎం ఉన్నా నిందితునిపై నమోదైన ఎఫ్ఐఆర్ కొట్టి వేయటాన్ని రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో సవాల్ చేయటం అభినందనీయమన్నారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వ తరపు న్యాయవాది మేనకా గురుస్వామి స్పందిస్తూ అది రాష్ట్ర ప్రభుత్వనికి ఉన్న నిబంద్ధత అని చెప్పారు.
Also Read: Crime News: విశాఖపట్నం జిల్లాలో దారుణం.. ఐఫోన్ కొనివ్వలేదని యువకుడు ఆత్మహత్య!