Vaccination Drive: దేశవ్యాప్తంగా ఈ నెల 12న వ్యాక్సినేషన్ డ్రైవ్ జరగనున్నది. ఈ స్పెషల్ డ్రైవ్ కోసం తెలంగాణ నుంచి ఆరు జిల్లాలను ఎంపిక చేశారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్, సంగారెడ్డి, హన్మకొండతో పాటు వరంగల్ జిల్లా పరిధిలోని పట్టణ ప్రాంతాల్లోనూ వ్యాక్సినేషన్ డ్రైవ్ నిర్వహించనున్నారు. ఈ 6 జిల్లాల పరిధిలో 0-5 సంవత్సరాల వయసు పిల్లలు దాదాపు 17,56,789 మంది ఉన్నట్టు అధికారులు అంచనా వేశారు. వీరందరికీ ఈ నెల 12న స్పెషల్ డ్రైవ్‌లో పోలియో వ్యాక్సిన్ వేయనున్నారు. అప్పుడే పుట్టిన శిశువుల దగ్గర్నుంచి 5 సంవత్సరాల వయసున్న పిల్లలందరికీ వ్యాక్సిన్లు వేయించాలని ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులు తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు.
Also Read: Navi Mumbai Airport: దేశంలో తొలి డిజిటల్ ఎయిర్ పోర్ట్.. నిర్మాణానికి రూ.19,650 కోట్లు ఖర్చు.. ప్రత్యేకతలు ఇవే!
ఇదిలా ఉండగా తెలంగాణలో చివరి పోలియో కేసు 2007లో నమోదు కాగా దేశంలో 2011లో చివరి కేసు నమోదు అయింది. అయితే సరిహద్దు దేశాలైన బంగ్లాదేశ్, పాకిస్తాన్ తదితర దేశాల్లో గత 3 సంవత్సరాలుగా పోలియో కేసులు నమోదు అవుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో.. ఆయా దేశాల నుంచి మనదేశానికి రాకపోకలు జరుగుతున్న జిల్లాల్లో పోలియో వ్యాక్సినేషన్ స్పెషల్ డ్రైవ్ నిర్వహించాలని కేంద్ర ఆరోగ్యశాఖ నిర్ణయించింది. దేశ వ్యాప్తంగా సుమారు 290 జిల్లాలను ఎంపిక చేశారు. ఇందులో భాగంగా తెలంగాణలోని ఆరు జిల్లాల్లో వ్యాక్సినేషన్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు.
