నల్లగొండ బ్యూరో స్వేచ్ఛ: Fake RMP doctors: అర్హత లేకున్నా కొంతమంది ఆర్ఎంపీల పేరుతో పట్టణాలు, గ్రామాల్లోని వైద్యులు క్లినిక్‌లు తెరిచి తమకు వైద్యం చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. కాసుల కోసం కక్కుర్తి పడి వచ్చిరాని వైద్యం చేస్తున్నారు. కేవలం ప్రథమ చికిత్సకు పరిమితం కావాల్సిన ఆర్ఎంపీలు వైద్య నిపుణుల్లా చలామణి అవుతూ అందినకాడికి దండుకుంటున్నారు. పట్టణాలు, గ్రామీణ, మారుమూల ప్రాంతాల ప్రజలు అర్ధరాత్రి వేళ అనారోగ్యానికి గురైతే అందుబాటులో ఉండేది ఆర్ఎంపీలే. ఇదే వారికి కలిసొస్తుండడంతో అమాయకుల ప్రాణాలతో ఆడుకుంటున్నారు.
వీరు చేసే వచ్చిరాని వైద్యంతో కొందరు ప్రాణాలు వదులుతున్నారు. జిల్లాలో చాలాచోట్ల అనధికారిక క్లినిక్‌లు తెరిచి అర్హత లేని వైద్యం చేయడంతో పాటు అనుమతి లేకుండా మందులు విక్రయిస్తూ మరింత దోపిడీకి పాల్పడుతున్నారు. ముఖ్యంగా కరోనా తర్వాత వైద్యం పూర్తి వ్యాపారంగా మారిపోగా, క్లీనిక్‌లు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయి. ఒక రెండు ఎండ్లు ప్రైవేటు ఆస్పత్రుల్లో పనిచేసిన అనుభవంతో క్లినిక్‌లు ఏర్పాటు చేస్తుండడం గమనార్హం.
కనీస అర్హత లేకున్నా ఎంబీబీఎస్ తరహాలో బిల్డప్..
ఆర్ఎంపీలకు కనీసం ఇంజెక్షన్ ఇచ్చే అర్హత కూడా ఉండదు. కానీ ఏకంగా క్లినిక్‌లు తెరిచి పేషంట్ల కోసం బెడ్స్ సైతం ఏర్పాటు చేస్తున్నారు. ఎలాంటి జబ్బు చేసినా నయం చేస్తామని నమ్మబలికిచ్చి తోచిన చికిత్స అందిస్తున్నారు. కొందరైతే యూట్యూబ్‌లో చూసి వైద్యం చేస్తున్నారనే ఆరోపణలు కూడా వస్తున్నాయి. ఇక రోగి ప్రాణాలకు అపాయం రాగానే తమకు తెలిసినా ప్రైవేటు, కార్పొరేట్ ఆస్పత్రులకు పంపిస్తున్నారు. జిల్లాలో ఔషధ తనిఖీ, నియంత్రణ అధికారుల దాడులు ఎప్పుడో ఒక్కసారి తూతూ మంత్రంగా చేస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
Also Read: Infants Trafficking Case: మరీ ఇంత దారుణమా.. పసిబిడ్డలా.. అంగట్లో సరుకులా?
ఇప్పటికే జిల్లాలో అనుమతి లేకుండా మందుల షాపులు నిర్వహిస్తున్నారని, వారి వైపు సబంధిత అధికారులు తొంగి కూడా చూడటం లేదని తెలుస్తోంది. జిల్లాలో కొంతమంది మెడికల్ షాపు నిర్వాహకులు పలు ప్రాంతాల్లో ఎక్కువ ధరలకు మందులు అమ్ముతున్నారు. అలాగే కాలం చెల్లిన, అనుమతి లేని మందులు సైతం విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. పేషంట్లకు నాసిరకం మెడిసిన్ అంటగడుతూ ప్రజల ప్రాణాల మీదకు తీసుకువస్తున్నారు.
మెడికల్ షాపుల్లోనూ నిబంధనలకు నీళ్లు..
సరైన పర్యవేక్షణ లేకపోవడంతో కొన్ని హోల్‌సేల్, రిటైల్ ఔషధ దుకాణాల్లోనూ నిబంధనలు విరుద్ధంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. కొన్ని దుకాణాల్లో కేవలం లైసెన్స్ మెడికల్ షాపులకు మాత్రమే విక్రయించాల్సి ఉండగా, నిర్వాహకులు నిబంధనలకు నీళ్లు వదులుతున్నారు. జిల్లాలో దాదాపు రిటైల్ దుకాణాలు 780, హోల్ సేల్ 150 మందుల దుకాణాలు నిబంధనల ప్రకారం లైసెన్స్ కలిగిన మెడికల్ షాపులు, గుర్తింపు పొందిన వైద్యుల ప్రిస్కిప్షన్ ప్రకారమే మందులు విక్రయించాలి. కానీ కొందరు హోల్‌సేల్, రిటైల్ షాపుల యజమానులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. అర్హత లేని ఆర్ఎంపీలకు విచ్చలవిడిగా మందులు విక్రయిస్తుండడం గమనార్హం.
Also Read: Viral News: తెలంగాణలో వింత పరిస్థితి.. అసలు విషయం తెలిస్తే.. ఔరా ఔరా అనాల్సిందే..