Tummala Nageswara Rao: పత్తి సేకరణకు వచ్చే నెల నుంచే ఏర్పాట్లు చేసుకోవాలని.. రైతులు ఇబ్బందులు ఎదుర్కోకుండా రాష్ట్రవ్యాప్తంగా కొనుగోలు కేంద్రాలను 110 నుంచి 122కి పెంచామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Minister Tummala Nageswara Rao) తెలిపారు. సచివాలయంలో శుక్రవారం కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ)ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. పత్తి ఉత్పత్తి, మార్కెట్ ధరలు, ఎంఎస్పీ అమలు, రైతులకు చెల్లింపులు, జిన్నింగ్ అండ్ ప్రాసెసింగ్ మిల్లుల ఏర్పాట్లు, రవాణా సమస్యలు, డిజిటలైజేషన్(Digitalization), రైతుల రిజిస్ట్రేషన్, స్థానిక కమిటీలు, ఫిర్యాదు పరిష్కారం తదితర అంశాలపై సమగ్రంగా చర్చించారు.
రైతుల ప్రయోజనాలు
పత్తి సేకరణలో రాష్ట్ర ప్రభుత్వ సహకారం ఇవ్వాలని, దేశవ్యాప్తంగా కొన్ని నూతన విధానాలు ప్రవేశపెట్టామని, దానికి తగ్గట్టుగా ప్రభుత్వసాయం అందించాలని సీసీఐ(CCI) ప్రతినిధులు కోరారు. మంత్రి స్పందించి రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్ని సహాయ సహకారాలు అందజేస్తామన్నారు. రాష్ట్రంలో పత్తికి ప్రత్యేక నాణ్యత కలిగినదన్నారు. ప్రస్తుతం మార్కెట్ ధరలు ఎంఎస్పీ కంటే క్వింటాకు రూ.1099 తక్కువగా ఉన్నాయని, ఇది రైతులకు ఆందోళన కలిగిస్తున్నదని పేర్కొన్నారు. రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు సీసీఐ సమర్థవంతంగా కొనుగోళ్లు చేపట్టాలని ఆదేశించారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో కొత్తగా కొనరావుపేట(Konaraopet) ఏఎంసీ కేంద్రాన్ని కూడా చేర్చాలని సూచించారు. రైతులు పత్తిని విక్రయించుకునేందుకు జిన్నింగ్ అండ్ ప్రాసెసింగ్ మిల్లులు, గోదాములు సమృద్ధిగా అందుబాటులో ఉండేలా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.
రైతులు స్వయంగా స్లాట్ నమోదు
రైతులకు ఎంఎస్పీ చెల్లింపులు పూర్తిగా ఆధార్ ఆధారిత ధృవీకరణ తర్వాతే నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ అయ్యే విధంగా చర్యలు చేపట్టాలని అన్నారు. దీంతో రైతులకు పారదర్శకంగా, ఆలస్యం లేకుండా చెల్లింపులు జరుగుతాయని పేర్కొన్నారు. సీసీఐ ప్రవేశ పెట్టిన ‘కపాస్ కిసాన్’ యాప్ తో రైతులు స్వయంగా స్లాట్ నమోదు చేసుకోవచ్చన్నారు. ఈ యాప్ పై ఏఈఓ లకు ప్రత్యేక శిక్షణ ఇవ్వాలని, వారి ద్వారా రైతులకు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. రైతులు L-1,L-2 స్లాట్లతో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుందని, అలాకాకుండా నూతన పద్ధతిలో సెంటర్ కు 10 నుంచి 15 కిలో మీటర్ల పరిధిలో ఉండేలా సెంటర్ ను కేటాయించాలని సూచించారు. రైతుల పత్తి కొనుగోళ్లు సక్రమంగా జరిగేందుకు ప్రతి కొనుగోలు కేంద్రంలో స్థానిక మానిటరింగ్ కమిటీలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. రైతుల ఫిర్యాదుల పరిష్కారం కోసం టోల్ ఫ్రీ 1800 599 5779, వాట్సాప్ 88972 81111 కొనసాగుతాయని తెలిపారు.
జిల్లా స్థాయి కమిటీలు ఏర్పాటు
ప్రతి కొనుగోలు కేంద్రం, జిన్నింగ్ అండ్ ప్రాసెసింగ్ మిల్లులలో సీసీ కెమెరాలు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని, రోజువారి క్రయ విక్రయాలను పరిశీలించేందుకు డైరెక్టరేట్ లో కమాండ్ కంట్రోల్ రూం సెంటర్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. గోదాముల నుంచి మిల్లులకు పత్తి రవాణాలో ఆటంకాలు కలుగుతున్నాయని, ఈ సమస్యలను తక్షణం పరిష్కరించేలా రవాణా శాఖ, జిల్లా కలెక్టర్లు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సీసీఐ టెండర్ నిబంధనలు పారదర్శకంగా ఉండాలన్నారు. రైతుల ఎంఎస్పీ రక్షణకు రాష్ట్ర స్థాయి, జిల్లా స్థాయి కమిటీలు ఏర్పాటు చేసినట్లు వివరించారు. ఈ కమిటీలు ధరల అమలును పర్యవేక్షించి, సీసీఐతో సమన్వయం చేసేలా ఉంటాయని, జిల్లా కలెక్టర్లు సీజన్ ప్రారంభానికి ముందే ఈ కమిటీల ఏర్పాటుకు ప్రణాళిక రూపొందించాలని సూచించారు. రైతులకు ఎంఎస్పీ హామీగా అందించడం ప్రభుత్వ ప్రధాన లక్ష్యం అని , పత్తి రైతులు ఎటువంటి ఇబ్బందులు పడకుండా, పారదర్శకంగా మరియు వేగంగా కొనుగోళ్లు జరిగేలా అన్ని విభాగాలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. సీసీఐ, మార్కెటింగ్ శాఖ, జిల్లా కలెక్టర్లు, రైతు సంఘాలు సమన్వయంతో పనిచేస్తే ఈ సీజన్ విజయవంతమవుతుందని మంత్రి విశ్వాసం వ్యక్తం చేశారు.
Also Read: Vijay Deverakonda: ఎవరి సలహాలు వినాల్సిన పనిలేదు.. బండ్లకు కౌంటర్! ఇదెలా మిస్సయ్యారు?