TGSRTC: రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ) గడిచిన రెండేళ్లలో సాధించిన విజయాలను తెలపడంతోపాటు విజన్ 2047లో రవాణా ఆధారిత అభివృద్ధి ప్రణాళికలు, ప్రయాణికులకు మెరుగుపర్చే సేవలను వివరించింది. 8 చోట్ల ఇంటర్ సిటీ బస్ టెర్మినల్స్, బస్సుల రాకపోకలకు 12 మార్గాల్లో ప్రత్యేక కారిడార్లు, కోటి మందికి పైగా ప్రయాణికులను నిత్యం గమ్య స్థానాలకు చేర్చడం, కొత్తగా 134 బస్ డిపోలు, బస్టాండ్ల నిర్మాణం, 60 వేల ఉద్యోగాల సృష్టి వంటి లక్ష్యాలతో రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ) తెలంగాణ రైజింగ్ విజన్- 2047లో తమ వంతు భాగస్వామ్యాన్ని అందించేందుకు ప్రణాళికను సిద్ధం చేసింది. రాష్ట్ర ప్రగతిలో రవాణా ఆధారిత అభివృద్ధి కీలకమైన అంశం కావడంతో భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ప్రజా రవాణా సంస్థను విస్తరించనున్నట్లు విజన్ ప్రణాళికలో పేర్కొంది.
భవిష్యత్ అవసరాల కోసం
బస్ స్టేషన్లపై ఒత్తిడి తగ్గించడం, భవిష్యత్తు అవసరాల దృష్ట్యా 8 భారీ ఇంటర్ సిటీ బస్ టెర్మినళ్లు నిర్మిస్తారు. ఇవి బాట సింగారం, ఇబ్రహీంపట్నం, శంషాబాద్, మొయినాబాద్, మేడ్చల్, శామీర్‌పేట, ఘట్‌కేసర్, ప్యూచర్ సిటీలో వస్తాయి. ఇందులో ఐదు 2030 నాటికి, మిగతా మూడు 2030 వరకు అందుబాటులోకి వస్తాయి. రాష్ట్రంలో ప్రస్తుతం 9878 బస్సులున్నాయి. 2030 నాటికి మరో 2,132 సమకూర్చుకోవడం. 2047కి మరో 13,522 పెంచడం లక్ష్యం. ప్రస్తుతం రోజు 60 లక్షల మంది ప్రయాణిస్తున్నారు. 2039కి కోటి మందికి ప్రయాణికుల సంఖ్య పెరుగుతుందని అంచనా. పెరిగే బస్సులకు 2047 నాటికి మరో 134 బస్ డిపోలు, బస్టాండ్లు వస్తాయి. ఫలితంగా 60 వేల కొత్త ఉద్యోగాలు వస్తాయి.
డెడికేటెడ్ బస్ కారిడార్లు
ట్రాఫిక్ సమస్యలు లేకుండా వేగంగా ప్రయాణించేలా 12 డెడికేటెడ్ బస్ కారిడార్లను ఆర్టీసీ ప్రతిపాదించింది. శ్రీశైలం జాతీయ రహదారి-కడ్తాల్/ ఆమనగల్లు, నాగార్జు నసాగర్ జాతీయ రహదారి- ఇబ్రహీంపట్నం/ మాల్, విజయవాడ హైవే- చౌటుప్పల్, ఘట్కేసర్-భువనగిరి, కీసర-తుర్కపల్లి, కరీంనగర్ హైవే- గజ్వేల్/ప్రజ్ఞాపూర్, మేడ్చల్ తూప్రాన్, దుండిగల్/ నిజామాబాద్ హైవే-నర్సా పూర్, ముంబయి హైవే-సంగారెడ్డి, కోకాపేట-శంకర్ పల్లి, అప్పా జంక్షన్- చేవెళ్ల, బెంగళూరు హైవే- షాద్ నగర్, ఇందులో నాలుగింటిని 2030కి, మిగిలిన ఎనిమి దింటిని 2039కి అందుబాటులోకి తేవాలన్నది లక్ష్యం. కాలుష్యాన్ని తగ్గించడం, పర్యావరణ అనుకూలంగా ఉండేలా డీజిల్ బస్సుల స్థానంలో 2030 నాటికి 30 శాతం విద్యుత్తు బస్సులు తేవాలన్నది లక్ష్యం. 2030 నాటికి ఆర్టీ సీలో 100 శాతం బస్సులు ఎలక్ట్రిక్వే తిరుగుతాయి.
Also Read: India vs South Africa: బాదుడే బాదుడు.. వైజాగ్ వన్డేలో దక్షిణాఫ్రికాను చిత్తుగా ఓడించిన భారత్
ఉచిత బస్సు ప్రయాణం
మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణం 2023 డిసెంబర్ 9న ప్రారంభమైంది. మహిళలు 243.35 కోట్ల ఉచిత ప్రయాణాలు చేశారు. తద్వారా వారికి రూ.8,235 కోట్ల ఆర్థిక ప్రయోజనం కలిగింది. మహిళ స్వయం సంఘాలు అందించిన నిధులతో 2025 మార్చి 3 నుంచి 152 బస్సులు రోడ్డెక్కాయి. హైదరాబాద్ ఓఆర్ఆర్ పరిధిలో 2,800 ఎలక్ట్రిక్ బస్సులు నడపాలని నిర్ణయించారు. 2 ఎకరాలకు పైగా విస్తీర్ణం ఉన్న ఖాళీ భూముల్లో 50 శాతం భూములను సౌర విద్యుత్ ఉత్పత్తి కోసం ఉపయోగంలోకి తేవాలన్నది లక్ష్యం.
2039 నాటికి..
2030 నాటికి ఏఐ ఆధారిత ప్రయాణికుల సహాయక వ్యవస్థ అమలు చేస్తారు. తద్వారా సేవలు స్మార్ట్, మరింత వేగంగా, కచ్చితత్వంతో ఆటోమేటెడ్ పద్ధతిలో అందుతాయి. బస్సుల రాక పోకలు, ఆలస్యం, గమ్య స్థానం సమాచారం వంటి వివరాలు చూపించేలా 2039 నాటికి 335 బస్ స్టేషన్లలో డిస్‌ప్లే బోర్డులను ఏర్పాటు చేస్తారు. ఏఐ ఆధారంగా ప్రయాణికుల డిమాండ్‌ను అంచనా వేస్తూ రూట్లు, బస్సులు నడిపే విధానం అమలు చేసేందుకు ప్రణాళిక రూపొందించారు. బస్సు డ్రైవర్ అప్రమత్తంగా ఉన్నారా? అలసి పోయారా? అని గమనించేందుకు 2030 నాటికి 200 దూర ప్రాంత బస్సుల్లో మానిటరింగ్, సేఫ్టీ సిస్టమ్ ఏర్పాటుకు నిర్ణయించారు. 2047 నాటికి అన్ని బస్సులో అందుబాటులోకి తీసుకురానున్నారు.

