Tragedy at Godavari:
మేడిగడ్డ బ్యారేజ్ వద్ద గోదావరిలో గల్లంతైన బాలురు
ఆదివారం ఆరుగురి డెడ్‌బాడీస్ లభ్యం
పోస్టుమార్టం కోసం మహాదేవపూర్ ఆస్పత్రికి తరలింపు
మృతుల్లో ఇద్దరు అన్నదమ్ములు.. అందరూ సమీప బంధువులే
భూపాలపల్లి జిల్లాలో తీవ్ర విషాదం
వరంగల్, స్వేచ్ఛ: ఈత సరదా ఐదు కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. గోదావరిలో ఈతకు వెళ్లిన ఆరుగురు యువకులు జలసమాధయ్యారు. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం అంబట్‌పల్లి సమీపంలోని మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ ఎగువన గోదావరి నదిలో ఈత కోసం శనివారం సాయంత్రం నీటిలో దిగారు. ఏడుగురు నీటిలోకి దిగగా ఆరుగురు గల్లంతు అయ్యారు. ఒక్కరు మాత్రమే సురక్షితంగా బయటపడ్డారు. ఆరుగురి ఆచూకీ కోసం శనివారం సాయంత్రం నుంచి గాలింపు చేపట్టారు. 17 గంటలపాటు నిర్విరామంగా శ్రమించిన ఎన్డీఆర్ఎఫ్, సింగరేణి రెస్క్యూ బృందాలు ఎట్టకేలకు ఆరుగురి మృతదేహాలను వెలికితీశాయి.
Read this- Raja Singh vs Kishan Reddy: రాజాసింగ్ మరోసారి హాట్ కామెంట్స్.. ఏం జరగబోతోంది?
పాపం.. అందరూ టీనేజర్లే
మృతుల్లో నలుగురు అంబట్‌పల్లికి చెందినవారు. ఇద్దరు బాలురు కాటారం మండలం కొర్లకుంటకు చెందిన వారిగా అధికారులు గుర్తించారు. అంబటిపల్లికి చెందిన అన్నదమ్ముళ్లు పట్టి మధుసుధన్ (18), శివమనోజ్(15), అదే గ్రామానికి చెందిన కర్నాల సాగర్ (16), తొహరి రక్షిత్ (13)గా గుర్తించారు. మరో ఇద్దరు అంబట్‌పల్లిలో జరిగిన ఓ వివాహ వేడుకకు వచ్చిన కాటారం మండలం కొర్లకుంటకు చెందిన పండు(18), రాహూల్ (19) అనే యువకులుగా నిర్ధారించారు. మృతులు అందరూ సమీప బంధువులే కావడంతో వీరి కుటుంబాలు శోకసంద్రంలో మునిగాయి.

తండ్రి వారించిన వినని పిల్లలు
రెండు రోజుల క్రితం అంబటిపల్లిలో జరిగిన ఓ వివాహానికి హాజరై సరదాగా గడిపారు. శనివారం సాయంత్రం ఏడుగురు యువకులు మేడిగడ్డ బ్యారేజ్ చూడడానికి వెళ్లారు. అక్కడే ఉన్న పట్టి మధుసూదన్, శివ మనోజ్ తండ్రి వెంకటస్వామి నీటిలోకి లోతుకు వెళ్లవద్దని ఎంత వారించినా వినలేదు. సరదా కోసం ఈత రాకపోయినా లోతు గమనించకుండా గోదావరి నదిలో దిగి మునిగిపోయారు. అలా ఒకరి వెంట మరొకరు మొత్తం ఆరుగురు గల్లంతయ్యారు. ఒడ్డున ఉన్న బాలుడు పరుగున వెళ్లి దగ్గరిలో ఉన్న వారికి విషయం చెప్పాడు.
Read this-Chandrababu: ఆపరేషన్ సిందూర్‌పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
అక్కడికి చేరుకున్నవారంతా బాలురను కాపాడేందుకు ప్రయత్నం చేశారు. కానీ, ఫలితం దక్కలేదు. అప్పటికే వారంతా గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు స్థానిక గజ ఈతగాళ్ల సాయంతో గాలింపు చర్యలు మొదలుపెట్టారు. అనంతరం ఎస్డీఆర్ఎఫ్, సింగరేణి రెస్క్యూ టీమ్, అగ్నిమాపక, పోలీస్ సిబ్బంది అక్కడికి చేరుకొని గాలింపు చర్యలు చేపట్టారు. 17 గంటలపాటు శ్రమించి ఆరుగురి మృతదేహాలు బయటకు తీశారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మహదేవపూర్ ఆస్పత్రికి తరలించారు. పోస్టు మార్టం అనంతరం మృత దేహాలు కుటుంబ సభ్యులకు అప్పగించారు.