Raja Singh vs Kishan Reddy:
- మరోసారి టార్గెట్ చేసిన ఎమ్మెల్యే
- చెవులున్నా వినిపించవు, నోరున్నా చెప్పరంటూ కౌంటర్
ముందు నుంచే ఇద్దరి మధ్య గ్యాప్
ఇటీవల మేకప్ మెన్ అంటూ విమర్శలు
రాజాసింగ్‌కు నోటీసులంటూ కొద్దిరోజుల క్రితం ప్రచారం
ఆయనపై చర్యలు తప్పవా?
తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: కమలం పార్టీలో మరో చిచ్చు మొదలైంది. ఎమ్మెల్యే రాజాసింగ్ (MLA Raja Singh) మరోసారి తనదైన శైలిలో రచ్చలేపారు. కేంద్ర మంత్రి, పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి (Kishan Reddy) టార్గెట్‌గా పరోక్ష విమర్శలు గుప్పించారు. దీంతో, మరోసారి రాజాసింగ్ వర్సెస్ కిషన్ రెడ్డి అన్నట్లుగా పరిస్థితి మారింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఆదివారం హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయకు చెందిన ‘ప్రజల కథే నా ఆత్మకథ’ పుస్తకావిష్కరణ కార్యక్రమానికి హాజరయ్యారు.
ఈసందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సహకరిస్తే తెలంగాణ మరింత అభివృద్ధి చెందుతుందని ఆకాంక్షించారు. ఈ వ్యాఖ్యలపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తనదైన శైలిలో పరోక్షంగా కిషన్ రెడ్డికి కౌంటర్ ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డి ఎవరి హెల్ప్ అడుగుతున్నారో, వారికి చెవులు ఉన్నా వినపడవు, నోరు ఉన్నా చెప్పరంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. అట్లాంటి మహానుభావుల ఎక్కడ హెల్ప్ చేస్తారంటూ ఎద్దేవా చేశారు. ఈ కామెంట్స్ కాషాయ పార్టీలో చర్చనీయాంశంగా మారాయి.
Read this- Chandrababu: ఆపరేషన్ సిందూర్‌పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
బీజేపీలో గతంలో ఎన్నడూలేని విధంగా పరిస్థితులు మారాయి. నేతల మధ్య వ్యక్తిగత టార్గెట్ ధోరణి రోజురోజుకూ ఎక్కువవుతోంది. రాజాసింగ్ కొద్దిరోజుల నుంచి సొంత పార్టీ నేతలపైనే ఘాటుగానే విమర్శలు చేస్తున్నారు. మొన్నటికి మొన్న హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో కిషన్ రెడ్డిని మేకప్ మెన్ అంటూ పరోక్షంగా విమర్శించారు. అలాగే పార్టీలో టికెట్లు కూడా టేబుళ్లు తుడిచేవారికి ఇస్తారంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు చర్చినీయాంశంగా మారాయి.
అంతేకాకుండా, బీజేపీలో కొందరు ఫాల్తుగాళ్లు ఉన్నారని, వారి వల్లే తెలంగాణలో పార్టీ అధికారంలోకి రాలేకపోతోందని రాజాసింగ్ మండిపడ్డారు. కిషన్ రెడ్డి, రాజాసింగ్ ఇద్దరూ గ్రేటర్‌కు చెందిన కీలక నేతలే. ఇద్దరూ పక్కా హిందుత్వవాదులే. అలాంటిది అంతా కలిసి వెళ్లే ధోరణితో కాకుండా తమలో తాము విమర్శలు చేసుకుంటూ రచ్చకెక్కడంపై కమలనాథుల్లో నిరాశ అలుముకుంది.
Read this- CM Revanth Reddy: కిషన్ రెడ్డి సహకరిస్తే .. తెలంగాణను పరుగులు పెట్టిస్తా సీఎం కీలక వాఖ్యలు!
చర్యలు ఉంటాయా?
సొంత పార్టీ నేతలపై రాజాసింగ్ చేస్తున్న విమర్శల అంశం ఇప్పటికే హైకమాండ్ దృష్టికి చేరినట్లు తెలిసింది. ఆయనపై చర్యలకు రంగం సిద్ధం చేసినట్లు ప్రచారం కూడా జరిగింది. త్వరలోనే ఆయనకు నోటీసులు ఇస్తారంటూ చర్చ జరిగింది. ఈ అంశంపైనా రాజాసింగ్ తనదైన శైలిలో స్పందించారు. తనకు నోటీసులు ఇవ్వడం కాదని, దమ్ముంటే సస్పెండ్ చేయాలంటూ సవాల్ విసిరారు. తాను పార్టీ నుంచి వెళ్లే ముందు ప్రతి ఒక్కరి భవిష్యత్‌ను బయటపెట్టే వెళ్తానంటూ హెచ్చరిక చేశారు.
కిషన్ రెడ్డి, రాజాసింగ్ మధ్య కొంత కాలంగా కోల్డ్ వార్ జరుగుతున్నట్లు గట్టిగానే చర్చ నడుస్తోంది. దీనిపై కేంద్రమంత్రిని ప్రశ్నించినా అలాంటివి పార్టీలో లేవని కొట్టిపారేశారు. పార్టీలో చిన్నచిన్న సమస్యలు ఉంటే వాటిని అంతర్గతంగా చర్చించి తామే పరిష్కరించుకుంటామని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. కానీ, అందుకు అనుగుణంగా ఎలాంటి ముందడుగు పడకపోవడంతో రాజాసింగ్ రెచ్చిపోతున్నారు తప్ప ఏమాత్రం తగ్గడంలేదనే వాదన వినిపిస్తోంది. సొంత పార్టీపై విమర్శలు చేస్తూ పార్టీకి డ్యామేజ్ అయ్యేలా వ్యవహరిస్తున్న రాజాసింగ్‌పై చర్యలుంటాయా? లేదా? అనేది ఇప్పటికైతే సస్పెన్స్‌గానే ఉంది.