Maoist Surrender: మావోయిస్టు పార్టీకి మరో ఎదురు దెబ్బ తగిలింది. ఇటీవల ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన హిడ్మా సమకాలీకుడు, పీపుల్స్ వార్ గెరిల్లా ఆర్మీ (పీఎల్జీఏ) బెటాలియన్ కమాండర్ బడ్సే సుక్కా ఎలియాస్ దేవా శనివారం తెలంగాణ పోలీసుల ఎదుట లొంగిపోయారు. ఆయనతోపాటు తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యునిగా ఉన్న కంకణాల రాజిరెడ్డి, మరో 18మంది మావోయిస్టులు కూడా సరెండర్ అయ్యారు. ఈ క్రమంలో పోలీసులకు మొత్తం 48 ఆయుధాలను అప్పగించారు. దేవా లొంగుబాటుతో పీఎల్జీఏ పూర్తిగా బలహీన పడినట్టే అని డీజీపీ శివధర్ రెడ్డి అన్నారు. ఇక, రాజిరెడ్డి సరెండర్‌తో తెలంగాణ రాష్ట్ర కమిటీ దాదాపుగా అంతం అయినట్టే అని చెప్పారు. ప్రస్తుతం ఈ కమిటీలో ఒక్కరు మాత్రమే ఉన్నట్టు తెలిపారు. జనజీవన స్రవంతిలో కలిసి రాష్ట్రాభివృద్ధిలో భాగస్వాములు కావాలంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన పిలుపు సత్ఫలితాలనిస్తోందని చెప్పారు.
రెండో కీలక నేత
ఛత్తీస్ఘడ్రాష్ట్రం సుక్మా జిల్లా పువ్వర్తి గ్రామానికి చెందిన బడ్సే సుక్కా ఎలియాస్ దేవా మావోయిస్టు పార్టీలో రెండో కీలక గిరిజన నాయకుడని డీజీపీ శివధర్ రెడ్డి చెప్పారు. పువ్వర్తి గ్రామానికే చెందిన స్నేహితుడు హిడ్మా ప్రభావంతో దేవా 2003లో మావోయిస్టు పార్టీలో చేరాడని తెలిపారు. ఆయుధాల తయారీ, పేలుడు పదార్థాల సేకరణ, ఐఈడీ బాంబుల తయారీలో దేవా ఎక్స్‌పర్ట్ అని చెప్పారు. దాంతోపాటు మిలటరీ వ్యూహాలు రూపొందించటంలో కూడా ఆరితేరాడన్నారు. జెరాం ఘాటీలో పక్కా వ్యూహం ప్రకారం పేలుళ్లు జరిపి ఛత్తీస్‌ఘడ్ రాష్ట్ర మంత్రి మహేంద్ర కర్మతోపాటు మరికొందరు కాంగ్రెస్ నాయకులను హతమార్చటంలో దేవాది కీలక పాత్ర అని తెలిపారు. ఈ క్రమంలో పీఎల్జీఏ బెటాలియన్‌కు తన తరువాత దేవానే నేతృత్వం వహిస్తాడని హిడ్మా ప్రకటించినట్టు చెప్పారు.
75 లక్షల రివార్డు..
పదుల సంఖ్యలో దాడులు, హత్యల కేసుల్లో నిందితునిగా ఉన్న దేవాపై తెలంగాణ, ఛత్తీస్‌ఘడ్, మహారాష్ట్రతోపాటు ఎన్ఐఏ ప్రకటించిన రివార్డు మొత్తం రూ.75 లక్షలుగా ఉందని డీజీపీ తెలిపారు. ఇక, లొంగిపోయిన మరో మావోయిస్టు రాజిరెడ్డి అలియాస్ వెంకటేశ్ తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడని చెప్పారు. కర్రెగుట్టల్లో గెరిల్లా బేస్‌ను ఏర్పాటు చేయటంలో రాజిరెడ్డి ప్రధాన పాత్ర పోషించినట్టు తెలిపారు. రాజిరెడ్డి లొంగుబాటుతో మావోయిస్టు పార్టీ తెలంగాణ రాష్ట్ర కమిటీ దాదాపుగా తుడుచుకు పోయినట్టే అని చెప్పారు. ప్రస్తుతం దీంట్లో ఒక్క దామోదర్ (తెలంగాణ స్టేట్ కమిటీ సెక్రటరీ) మాత్రమే ఉన్నట్టు తెలియచేశారు. కాగా రాజిరెడ్డి భార్య అడ్లూరి ఈశ్వరీ అలియాస్ రామ్ కో కూడా లొంగిపోయినట్టు డీజీపీ పేర్కొన్నారు.
కగార్‌తో ఉక్కిరిబిక్కిరి
మావోయిస్టు పార్టీని పూర్తిగా తుద ముట్టించే లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం జరుపుతున్న ఆపరేషన్కగార్తో ఆ పార్టీ ఉక్కిరిబిక్కిరవుతోందని డీజీపీ చెప్పారు. వేర్వేరు ఎన్‌కౌంటర్లలో ఇప్పటికే పలువురు అగ్రనేతలతోపాటు క్యాడర్ కూడా చనిపోయినట్టు తెలిపారు. దాంతో ఆ పార్టీ అగ్రనాయకత్వం ప్రాణాలు రక్షించుకోవటానికి ఇతర ప్రాంతాలకు తరలి వెళ్లాలని సూచిస్తున్నట్టు చెప్పారు. ఆయా ప్రాంతాల భౌగోళిక పరిస్థితులపై అవగాహన లేకపోవటం, దానికి తోడు ఆరోగ్య సమస్యలు వెంటాడుతుండటంతో మావోయిస్టులు లొంగిపోవటానికి సిద్ధపడుతున్నారని డీజీపీ వివరించారు. ఇటువంటి పరిస్థితుల్లో జనజీవన స్రవంతిలో కలిస్తే పునరావాస పథకాలను అందిస్తామంటూ రేవంత్ రెడ్డి చేసిన ప్రకటనతో వరుసగా మావోయిస్టులు లొంగిపోతున్నారన్నారు.
దేశంలోనే తొలిసారిగా..
లొంగిపోయిన మావోయిస్టులు మొత్తం 48 ఆయుధాలను పోలీసులకు అప్పగించారు. దీంట్లో 2 లైట్ మిషన్‌గన్లు, యూఎస్లోతయారైన కోల్ట్ రైఫిల్, ఇజ్రాయిల్లోతయారైన టవర్ రైఫిల్, 8 ఏకే47 రైఫిళ్లు, 10 ఇన్సాస్రైఫిళ్లు, 8 ఎస్ఎల్ఆర్ రైఫిళ్లు, 4 బీజీఎల్, 11 సింగిల్ షాట్వెపన్స్, 2 గ్రనేడ్లు, ఒక ఎయిర్ గన్ ఉన్నాయి. వీటితోపాటు 2,206 బుల్లెట్లను కూడా అప్పగించారు. ఇటీవలి కాలంలో మావోయిస్టులు ఇన్ని ఆయుధాలను అప్పగించటం దేశంలోనే ఇదే మొదటిసారని శివధర్ రెడ్డి చెప్పారు. ఇక, మావోయిస్టుల నుంచి రూ. 20 లక్షల నగదును కూడా స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. ఆయుధాలు అప్పగించినందుకుగాను లొంగిపోయిన మావోయిస్టులకు కోటీ 81 లక్షల 90 వేల రూపాయల నగదును పంచి ఇవ్వనున్నట్టు డీజీపీ చెప్పారు. మావోయిస్టులపై ఇప్పటికే రివార్డులుగా ప్రకటించిన మొత్తాన్ని కూడా వారికే ఇవ్వనున్నామన్నారు. మావోయిస్టుల లొంగుబాటు కోసం వ్యూహాత్మకంగా వ్యవహరించిన ఎస్ఐబీ అధికారులు, సిబ్బందిని ఈ సందర్భంగా అభినందించారు. మావోయిస్టు పార్టీలో మిగిలి ఉన్నవారు కూడా లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలవాలని, ప్రభుత్వం అన్ని సహాయ సహకారాలు అందిస్తుందని డీజీపీ పేర్కొన్నారు. ‘పోరు వద్దు.. ఊరు ముద్దు’ అన్న పిలుపును డీజీపీ ఈ సందర్భంగా గుర్తు చేశారు.
దేవ్ జీ ఎక్కడున్నారో తెలియదు
మావోయిస్టు అగ్రనేత తిప్పిరి తిరుపతి ఆచూకీపై ఆ పార్టీ మాజీ నేత కంకణాల రాజిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తిప్పిరి తిరుపతి అలియాస్ దేవ్ జీ ప్రస్తుతం ఎక్కడున్నారన్న సమాచారం తమ వద్ద లేదని శనివారం పోలీసుల ఎదుట లొంగిపోయిన సందర్భంగా ఆయన పేర్కొన్నారు. తాను పార్టీని వీడి రావడానికి ప్రధానంగా ఆరోగ్య సమస్యలే కారణమని రాజిరెడ్డి తెలిపారు. దీనికి తోడు తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి ఇచ్చిన పిలుపు తమను ఆలోచింపజేసిందని, అందుకే జనజీవన స్రవంతిలో కలిసేందుకు మొగ్గు చూపామని ఆయన వెల్లడించారు.
Also Read: Jetlee Glimpse Out: ‘జెట్లీ’ గ్లింప్స్ వచ్చేశాయ్.. సత్య వేమన పద్యం ఇరగదీశాడుగా..

