Travels Bus: హైదరాబాద్ లో 75 ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై కేసులు నమోదు చేసినట్లు రవాణా శాఖ పేర్కొంది. జనవరి 7 నుంచి ఇప్పటి వరకు జరిపిన ప్రత్యేక తనిఖీల్లో సందర్భంగా నిబంధనలు ఉల్లంఘించిన బస్సులపై చర్యలు తీసుకున్నట్లు స్పష్టం చేసింది. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలలో మెుత్తం 8 తనిఖీ బృందాలు విధులు నిర్వహిస్తున్నట్టు రవాణా శాఖ కమిషనర్ ఇలంబర్తి, ఐటీ ఎన్‌ఫోర్స్‌మెంట్ జాయింట్ ట్రాన్స్‌పోర్ట్ కమిషనర్ చంద్రశేఖర్ గౌడ్ తెలిపారు.
అధిక ధరలు వసూల్ చేస్తే..
సంక్రాంతి రద్దీ నేపథ్యంలో ప్రైవేట్ బస్సుల యాజమాన్యాలు ఎట్టి పరిస్థితులలో అధిక ఛార్జీలు వసూలు చేయరాదని రవాణా శాఖ కమిషర్ సూచించారు. స్టేజ్ క్యారేజ్‌గా బస్సులు తిప్పరాదని హెచ్చరించారు. త్వరలో స్లీపర్ బస్సుల నిర్వహణపై మార్గదర్శకాలు జారీ చేస్తామని, ఇతర రాష్ట్రాలలో రిజిస్టర్ అయ్యి తెలంగాణలో తిరిగే స్లీపర్ బస్సులను తనిఖీ చేసి నిబంధనలకు విరుద్ధంగా రిజిస్ట్రేషన్ అయిన వాహనాలపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
6,431 ప్రత్యేక బస్సులు
మరోవైపు సంక్రాంతి రద్దీని దృష్టిలో ఉంచుకొని తెలంగాణ ఆర్టీసీ 6,431 ప్రత్యేక బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చింది. పండుగ హడావిడి ఎక్కువగా ఉండే ఈ నెల 9, 10, 12, 13 తేదీల్లో అవి అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపింది. రద్దీకి అనుగుణంగా ప్రత్యేక బస్సుల ఏర్పాటు ఉంటుందని స్పష్టం చేసింది. అలాగే ఈ నెల 18, 19 తేదీల్లో తిరుగు ప్రయాణం సందర్భంగానూ ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు తెలంగాణ ఆర్టీసీ ప్రకటన విడుదల చేసింది. హైదరాబాద్ లో రద్దీ ప్రాంతాలైన ఎంజీబీఎస్ (MGBS), జేబీఎస్ (JBS), ఉప్పల్ క్రాస్ రోడ్స్ (Uppal X Roads), ఆరాంఘర్, ఎల్బీ నగర్ క్రాస్ రోడ్స్ (LB Nagar X Roads), కేపీహెచ్‌బీ (KPHB), బోయిన్ పల్లి, గచ్చిబౌలి తదితర ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉండనున్నాయి.
Also Read: ONGC Gas Blowout: ఆరు రోజుల అగ్నిజ్వాలలకు బ్రేక్.. అదుపులోకి మంటలు.. ఊపిరి పీల్చుకున్న ప్రజలు
మహిళలు ఫ్రీగా వెళ్లొచ్చు..
రాష్ట్ర ప్రభుత్వ మహాలక్ష్మి పథకంలో భాగంగా సంక్రాంతికి నడిపే పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్, సిటీ ఆర్డినరి, మెట్రో ఎక్స్ ప్రెస్ బస్సుల్లో మహిళలకు ఉచిత బస్సు రవాణా సదుపాయం యథావిధిగా అమల్లో ఉంటుందని ఆర్టీసీ ప్రకటిచింది. టీజీఎస్ఆర్టీసీ బస్సుల్లో ముందస్తు రిజర్వేషన్ కోసం www.tgsrtcbus.in వెబ్ సైట్ ను సంప్రదించవచ్చని ఆర్టీసీ తెలిపింది. సంక్రాంతి ప్రత్యేక బస్సులకు సంబంధించిన పూర్తి సమాచారం కోసం ఆర్టీసీ కాల్ సెంటర్ నంబర్లు 040-69440000, 040-23450033 లకు సంప్రదించాలని సూచించింది.

