Godavari Pushkaralu: గోదావరి పుష్కరాలను రాష్ట్ర ప్రభుత్వం కుంభమేళా తరహాలో నిర్వహించేందుకు సన్నద్ధమవుతున్నది. భక్తులకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా చర్యలు తీసుకుంటున్నది. కుంభమేళాలో ఏర్పాట్ల బాధ్యతలు నిర్వహించిన కంపెనీకి రాష్ట్ర ప్రభుత్వం సైతం పనులు అప్పగించింది. ఇప్పటికే నిజామాబాద్ (Nizamabad) నుంచి భద్రాచలం వరకు ఎక్కడెక్కడ ఘాట్లు ఏర్పాటు చేయాలి, ఉన్న వాటిని పరిశీలించి అక్కడి పరిస్థితులను అధ్యయనం చేసింది. కోట్లాది మంది భక్తులు తరలి రానుండడంతో ప్రభుత్వం అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేస్తున్నది.
కుంభమేళా తరహాలో ఏర్పాట్లు
తెలంగాణ ప్రభుత్వం గోదావరి పుష్కరాలకు (Godavari Pushkaralu) తేదీలను సైతం ఖరారు చేసినట్లు సమాచారం. 2027లో జూలై 23 నుంచి ఆగస్ట్ 3వ తేదీ వరకు పుష్కరాలను నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్టు విశ్వసనీయ సమాచారం. ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగరాజ్‌లో జరిగే కుంభమేళా తరహాలో తెలంగాణలోని గోదావరి పుష్కరాలకు ఏర్పాట్లు చేయాలని ఇప్పటికే మాస్టర్ ప్లాన్‌ను రూపొందించింది. దేవాదాయ శాఖ దీనిని రూపొందించి ప్రభుత్వానికి అందజేయగా, ఆ ప్లాన్‌ను ఎర్నెస్ట్ యంగ్(ఈవై) కన్సల్టెన్సీకి బాధ్యతలు అప్పగించింది. రాష్ట్రంలో గోదావరి పరివాహక ప్రాంతాలను అధికారులతో కలిసి కన్సల్టెన్సీ సంస్థ సిబ్బంది సైతం పరిశీలించి అక్కడి అంశాలను అధ్యయనం చేశారు. నిజామాబాద్ జిల్లాలోని కందకుర్తిలో గోదావరి తెలంగాణలో ప్రవేశిస్తుంది. అక్కడి నుంచి భద్రాచలం వరకు ప్రవహించి ఏపీలో ఎంటర్ అవుతుంది. ఈ పరివాహక ప్రాంతంలో ఘట్ల ఏర్పాటు, మౌలిక వసతుల కల్పన వంటివి చేపట్టాలని ప్రణాళిక సిద్ధం చేస్తున్నది. దీని కోసమే దాదాపు రూ.50 లక్షలు మంజూరు చేసినట్లు అధికారులు పేర్కొంటున్నారు.
Also Read: Godavari Pushkaralu: గోదావరి పుష్కరాలకు.. కేంద్రం నిధులివ్వాలి!
70 ఘట్ల ఏర్పాటుకు ప్లాన్
గోదావరి పుష్కరాలకు 70 ఘట్లను ఏర్పాటు చేయాలని నివేదిక తయారు చేశారు. పుష్కరాలకు వచ్చే భక్తులకు స్నానాలు చేసేందుకు ఘాట్లు, డ్రెస్సింగ్ రూమ్స్, మరుగు దొడ్లు, తాగునీటి వసతి, విద్యుత్ సౌకర్యం ఏర్పాటు చేయబోతున్నారు. ఈసారి భక్తుల సంఖ్య పెరిగే అవకాశం ఉండడంతో వారికి అనుగుణంగా ఘాట్ల విస్తరణ పనులు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. 2015లో తెలంగాణలో గోదావరి పుష్కరాలు జరిగాయి. వచ్చే ఏడాది రానున్న పుష్కరాలకు భక్తుల సంఖ్య పెరిగే అవకాశం ఉండడంతో అందుకు అనుగుణంగా మౌలిక వసతుల కల్పనలో ప్రభుత్వం నిమగ్నమైంది. గోదావరి పరివాహక ప్రాంతంలో బాసర, ధర్మపురి, మంథని, కాలేశ్వరం, పర్ణశాల, భద్రాచలం లాంటి ప్రముఖ ఆలయాలు ఉన్నాయి. వాటి దగ్గర కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రభుత్వం నిర్మించబోతున్న 70 ఘాట్లను ప్రభుత్వం మూడు విభాగాలుగా విభజించినట్లు అధికారులు తెలిపారు. కేటగిరీ 1 కింద పుష్కర ఘాట్ నుండి ఆలయం ఉన్న ప్రాంతాన్ని ఈ కేటగిరీ కింద చేర్చారు. కేటగిరీ 2 కింద పుష్కర ఘాట్లకు దూరంలో ఉన్న ఆలయాలను చేర్చగా, కేటగిరీ 3 కింద కేవలం పుష్కర ఘాట్లు ఉన్న వాటిని చేర్చారు. దశలవారీగా అభివృద్ధి పనులను చేపట్టబోతున్నారు. ప్రస్తుతం గుర్తించిన ఘాట్ల పరిధిలో 65 ఆలయాలు ఉన్నట్లు అధికారులు వెల్లడించారు.
ఘాట్లు పెరిగే అవకాశం?
12 ఏళ్లకు ఒకసారి గోదావరి పుష్కరాలు జరుగుతాయి. అయితే మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీ, ఎమ్మెల్సీలు తమ తమ నియోజకవర్గాల్లో ఘాట్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తులు చేస్తున్నట్లు సమాచారం. అంతేకాకుండా ఏ ప్రాంతంలో ఏర్పాటు చేయాలని అందుకు సంబంధించిన వివరాలు సైతం అందజేస్తున్నట్లు తెలిసింది. గోదావరి పరివాహక ప్రాంత నియోజకవర్గాల్లో ఘాట్లు ఏర్పాటు చేస్తే అక్కడి ప్రజలు అక్కడికే వెళ్లి పుణ్య స్నానాలు ఆచరించే అవకాశం ఉంది. అందరూ ఒకే ప్రాంతానికి వెళ్లి ఇబ్బందులు పడకుండా ఉంటుంది. అయితే ఎన్ని ఏర్పాటు చేస్తారనేది త్వరలోనే నిర్ణయం జరుగుతుందని అధికారులు చెబుతున్నారు.
ప్రముఖ ఆలయాల వద్ద దేవుళ్ల ప్రతిమలు
గోదావరి పరిహార ప్రాంతంలో ఉన్న ప్రముఖ ఆలయాల దగ్గర దేవతామూర్తుల ప్రతిమలు ఏర్పాటు చేయబోతున్నారు. కాళేశ్వరం పుష్కరాల సమయంలో ఏర్పాటు చేసిన శివుడి ప్రతిమ మాదిరిగానే, గోదావరి పుష్కరాల్లోని ప్రముఖ ఆలయాల దగ్గర మూర్తుల ప్రతిమ ఏర్పాటు చేసి భక్తులను ఆకట్టుకోనున్నారు. భక్తులకు స్వాగతం పలికేలా ముఖ ద్వారాలు, స్థల పురాణం వివరించేలా వాల్ పెయింటింగ్స్ వేయించబోతున్నట్లు అధికారులు తెలిపారు. డిపార్ట్‌మెంట్ల వారీగా ఆయా శాఖలకు ప్రభుత్వం ఈ మేరకు బాధ్యతలు అప్పగించనున్నది. మరోవైపు, పుష్కరాలకు వచ్చే భక్తులకు రవాణా ఇబ్బందులు లేకుండా రోడ్ల మరమ్మతులు సైతం చేపట్టబోతున్నారు. పంచాయతీరాజ్, ఆర్ అండ్ బీ శాఖ ఆధ్వర్యంలో మరమ్మతులు చేపట్టాలని నిర్ణయించారు. ఇరిగేషన్ శాఖ ఆధ్వర్యంలో ఘాట్ల నిర్మాణం, బారికేడ్ల నిర్మాణం బాధ్యతలు అప్పగించినట్లు తెలిసింది.
Also Read: RV Karnan: శిథిలావస్థలోనున్న భవనాలను గుర్తించాలి.. కర్ణన్ కీలక సూచనలు

