AP TG Water Dispute: తెలుగు రాష్ట్రాల మధ్య జలజగడాలు (AP TG Water Dispute) కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా, సోమవారం నాడు సుప్రీంకోర్టులో కీలక వాదనలు జరిగాయి. పోలవరం ప్రాజెక్టు నుంచి ఏపీ ప్రభుత్వం సుమారు 200 టీఎంసీల నీటిని బనకచర్ల లేదా నల్లమలసాగర్‌కు మళ్లించేందుకు ప్రయత్నిస్తోందని, న్యాయస్థానం వెంటనే జోక్యం చేసుకొని అడ్డుకోవాలని విజ్ఞప్తి చేసింది. గోదావరి నదికి వచ్చే అదనపు వరద జలాలను తరలిస్తున్నామనే నెపంతో ఏపీ నీళ్ల మళ్లింపునకు పాల్పడుతోందని అభ్యంతరం వ్యక్తం చేసింది. . ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ పిటిషన్ దాఖలు చేశారు.
కేంద్ర జలశక్తి శాఖ సలహా కమిటీ ఆమోదం, గోదావరి ట్రిబ్యునల్ అవార్డు (1979-80) నిబంధనల ప్రకారం, ఏపీకి 484.5 టీఎంసీల నీళ్లు మాత్రమే దక్కుతాయని, అంతకు మించి నీటిని ఉపయోగించుకోవడానికి వీల్లేదని సింఘ్వీ వాదించారు. కేటాయించిన దానికంటే ఎక్కువ పరిమాణంలో నీటిని మళ్లిస్తే నిబంధనల ఉల్లంఘన కిందకు వస్తుందని పేర్కొంది. ఏ అథారిటీ, ట్రిబ్యునల్ నుంచి ఎలాంటి ఉత్తర్వులు లేకుండా, అలాగే ఎగువ రాష్ట్రాలైన మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కర్ణాటక, ఒడిశా, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల అనుమతి పొందకుండానే ఆంధ్రప్రదేశ్ ఏకపక్షంగా నీటి మళ్లింపు చేపడుతోందని వాదించింది. ఏపీ ఏకపక్ష చర్యను సెంట్రల్ వాటర్ కమిషన్ (CWC), పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ (PPA), గోదావరి నది యాజమాన్య బోర్డు (GRMB), కృష్ణా నది యాజమాన్య బోర్డు (KRMB), కేంద్ర జలశక్తి శాఖ వంటి వివిధ చట్టబద్ధ, కేంద్ర ప్రభుత్వ సంస్థలు తీవ్రంగా వ్యతిరేకించాయంటూ అభిషేక్ సింఘ్వీ వాదించారు.
Read Also- Khammam News: ఓరినాయనా.. గ్రామ పంచాయతీనే పేకాట అడ్డాగా మార్చిన ఉపసర్పంచ్..?
ఏదైనా ఒక ప్రాజెక్ట్ నిర్వహించాలంటే సమగ్ర ప్రాజెక్ట్ నివేదిక (DPR) తప్పనిసరిగా ఉండాలని, అయితే, ఏపీ ప్రభుత్వం ఎలాంటి డీపీఆర్ లేకుండా, ఇతర భాగస్వామ్య రాష్ట్రాల ప్రమేయం లేకుండానే ఏకపక్షంగా ముందుకెళుతోందని తెలంగాణ ఆక్షేపించింది. అదనపు వరద జలాలను వాడుకుంటామని ఏపీ చెబుతున్నప్పటికీ, అదనపు వరద జలాలు ఉన్నాయని నిర్ధారించే రిపోర్టులు ఏవీ లేవని పేర్కొంది. అదనపు వరద జలాలను నిర్ణయించేందుకు ఎలాంటి యంత్రాంగం దేశంలో లేదని ప్రస్తావించింది.
మీకు అభ్యంతరం ఏంటి?
తెలంగాణ వాదనలపై ఏపీ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. భవిష్యత్తులో చేపట్టే ప్రాజెక్టు నివేదికపై అభ్యంతరం ఏమిటి అని ప్రశ్నించింది. తమ భూభాగంలో చేపట్టే ప్రాజెక్టు రిపోర్టును సిద్ధం చేసుకుంటే అభ్యంతరం ఎందుకు? అని ప్రశ్నించింది. ఈ మేరకు ఏపీ ప్రభుత్వం తరపున సీనియర్ లాయర్ ముకుల్ రోహత్గి వాదించారు. రాయల సీమలోని కరవు ప్రాంతానికి నీటిని తీసుకెళ్లే ఉద్దేశంతో ఈ ప్రాజెక్టును చేపట్టనున్నామన్నారు. ఈ ప్రాజెక్ట్ విషయంలో ఎలాంటి తీర్పులు, ఉత్తర్వులను ఉల్లంఘించలేదన్నారు.
Read Also- Vijay TVK-BJP: తమిళనాడులో బీజేపీ కొత్త స్కెచ్.. విజయ్ టీవీకే పార్టీ విషయంలో అమిత్ షా గేమ్ ప్లాన్!
విచారణ 12కు వాయిదా
ఇరు రాష్ట్రాల వాదనలు విన్న సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ సూర్యకాంత్, తదుపరి విచారణను ఈ నెల 12కు వాయిదా వేస్తున్నట్టు తెలిపారు. అయితే, తెలంగాణ వాదనపై సీజేఐ కీలక వ్యాఖ్యలు చేశారు. ఏపీ ఉల్లంఘనలకు పాల్పడేందుకు సిద్ధమైందనడం ఆరోపణ మాత్రమేనని వ్యాఖ్యానించారు. సమగ్ర అంశాలపై రిపోర్ట్ అందజేయాలంటూ తెలంగాణను ఆయన ఆదేశించారు.

