Ponguleti Srinivas Reddy: కుప్పకూలిన రెవెన్యూ వ్యవస్థను రెండేళ్లలో పునర్నిర్మించామని, భూ హక్కుల నుంచి రిజిస్ట్రేషన్ల వరకు తమ ప్రభుత్వం సమూల మార్పులు తీసుకువచ్చిందని రెవెన్యూ, రిజిస్ట్రేషన్ల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Ponguleti Srinivas Reddy) తెలిపారు. సచివాలయంలో మీడియాతో మాట్లాడిన ఆయన, ధరణి పోర్టల్‌ను పూర్తిగా తొలగించి, దాని స్థానంలో సరికొత్త, సురక్షితమైన వ్యవస్థను జనవరి నెలాఖరుకల్లా అందుబాటులోకి తీసుకువస్తామని ప్రకటించారు.
ధరణి పోర్టల్ ద్వారా వచ్చిన యాప్‌ను పూర్తిగా తొలగిస్తాం
రెవెన్యూ, సర్వే, రిజిస్ట్రేషన్ శాఖల సమాచారంతో కూడిన సింగిల్ పేజీ డిజిటలైజేషన్ యాప్‌ను జనవరి నెలాఖరుకల్లా తీసుకువస్తామని పొంగులేటి తెలిపారు. ధరణి పోర్టల్ ద్వారా వచ్చిన యాప్‌ను పూర్తిగా తొలగిస్తామని, దీనికి సంబంధించి ఎన్ఐసి కసరత్తు చేస్తోందని వివరించారు. ఎన్నికల హామీ మేరకు ధరణి పోర్టల్ నిర్వహణను టెరాసిస్ అనే విదేశీ సంస్థ నుంచి కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎన్ఐసికి అప్పగించడం జరిగిందని, ఈ నిర్ణయం వల్ల తెలంగాణ రైతుల కోటి 56 లక్షల ఎకరాల భూమి వివరాలు సురక్షితమైన స్వదేశీ సంస్థ పరిధిలోకి వచ్చాయని ఆయన వెల్లడించారు. రాష్ట్రంలో ఇప్పటికే 2.29 కోట్ల సర్వే నంబర్లకు భూధార్ నంబర్లు కేటాయించామని మంత్రి తెలిపారు.
పెండింగ్ దరఖాస్తులు, రీ సర్వే
రాష్ట్రంలో నక్షాలు (మ్యాప్స్) లేని 413 గ్రామాలకు గాను, పట్టణ ప్రాంతాలు మినహా 373 నక్షా గ్రామాల్లో రెండవ విడత కింద రీ సర్వే నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. ప్రయోగాత్మకంగా ఐదు గ్రామాలకు భూధార్ కార్డులు సిద్ధంగా ఉన్నాయని, మిగిలిన జిల్లాల్లో మూడవ విడత కింద జిల్లాకు 70 గ్రామాలను ఎంపిక చేసి భూధార్ కార్డులు అందిస్తామని వివరించారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటికి పెండింగ్‌లో ఉన్న 2.45 లక్షల ధరణి దరఖాస్తులతో పాటు, ఆ తర్వాత వచ్చిన మరో నాలుగు లక్షల దరఖాస్తులను పరిష్కరించి ప్రజల సంతృప్తికి తొలి అడుగు వేశామన్నారు. భూ సమస్యలకు సంబంధించిన అర్హత కలిగిన దరఖాస్తులను జనవరి నెలాఖరుకల్లా పరిష్కరించి, ఆ తర్వాత ట్రిబ్యునల్స్‌ను ఏర్పాటు చేస్తామని మంత్రి ప్రకటించారు. ఈ ఏడాది ఏప్రిల్ 17వ తేదీ నుంచి జూన్ 20వ తేదీ వరకు మూడు విడతలుగా నిర్వహించిన రెవెన్యూ సదస్సులకు దాదాపు 9 లక్షలకు పైగా దరఖాస్తులు వచ్చాయని, వీటన్నింటినీ పరిష్కరించామని ఆయన తెలిపారు.
కేటీఆర్ ముడుపులు!
గత ప్రభుత్వ హయాంలో చోటుచేసుకున్న అక్రమాలను వెలికితీసేందుకు గాను ఇంతవరకు రెండు జిల్లాల్లో ఫోరెన్సిక్ ఆడిట్ జరుగుతోందని మంత్రి పొంగులేటి తెలిపారు. వాటి ఫలితాలను గమనించి రాష్ట్ర వ్యాప్తంగా అక్రమార్కుల భరతం పడతామన్నారు. అంతేకాకుండా, గత ప్రభుత్వంలో మున్సిపల్ మంత్రిగా ఉన్న కేటీఆర్ ముడుపులు తీసుకొని నచ్చిన వారికి ల్యాండ్ కన్వర్షన్ చేశారని ఆయన సంచలన ఆరోపణ చేశారు.
4వేల మందికి శిక్షణ ఇచ్చి లైసెన్స్‌లు జారీ
త్వరలోనే ఆ ల్యాండ్ వివరాల చిట్టాను విప్పుతామన్నారు. రెవెన్యూ వ్యవస్థను పునరుద్ధరించడంలో భాగంగా 10,954 రెవెన్యూ గ్రామాలను క్లస్టర్ల వారీగా విభజించి జీపీఓలను నియమించామన్నారు. ఖాళీగా ఉన్న సర్వేయర్ పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టడంతో పాటు, లైసెన్స్‌డ్ సర్వేయర్ల సేవలను కూడా అందుబాటులోకి తీసుకువచ్చామని తెలిపారు. ఇప్పటికే దాదాపు 4వేల మందికి శిక్షణ ఇచ్చి లైసెన్స్‌లు జారీ చేశామని, డిసెంబర్ నుంచి మరో 3వేల మంది లైసెన్స్‌డ్ సర్వేయర్ల సేవలు అందుబాటులోకి రానున్నాయని మంత్రి వివరించారు. ఆస్తుల రిజిస్ట్రేషన్ కోసం సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల వద్ద నిరీక్షించే పరిస్థితికి స్లాట్ బుకింగ్ ద్వారా తెరదించామని ఆయన తెలిపారు.
