Jupally Krishna Rao: పర్యాటకాన్ని తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయల్లో భాగం చేస్తామని, తద్వారా సుస్థిర పర్యాటక అభివృద్ధి జరుగుతుందని మంత్రి జూపల్లి కృష్ణారావు (Jupally Krishna Rao) అన్నారు. ఉస్మానియా విశ్వవిద్యాలయం ఠాగూర్ ఆడిటోరియంలో కామర్స్ డిపార్ట్మెంట్ ఆద్వర్యంలో ‘గ్లోబల్ టూరిజం సుస్థిర అభివృద్ధికి నూతన మార్గాలు’అనే అంశంపై మూడు రోజుల అంతర్జాతీయ సదస్సును మంత్రి వాకిటి శ్రీహరితో కలిసి గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా జూపల్లి సుస్థిర అభివృద్ధి కోసం పర్యాటకాన్ని సంస్కృతితో అనుసంధానం చేయాల్సిన, మౌలిక సదుపాయాలను మెరుగుపరచాల్సిన, ప్రభుత్వ-ప్రైవేట్ భాగస్వామ్యాలను ప్రోత్సహించాల్సిన ప్రాముఖ్యతను వివరించారు.
ఈ రంగాన్ని పునరుత్తేజితం చేయడమే లక్ష్యం
తెలంగాణ కొత్త పర్యాటక విధానం ఈ రంగాన్ని పునరుత్తేజితం చేయడమే లక్ష్యంగా పెట్టుకుందని, ఈ మూడు రోజుల అంతర్జాతీయ సదస్సు నుండి వెలువడే సూచనలు, సిఫార్సులను విధానాల మెరుగుదలకు ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుంటుందని పేర్కొన్నారు. ప్రపంచ పర్యాటకులను ఆకర్షించడంతో పాటు ఆ రంగంలో యువతకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించాలని లక్ష్యంగా సంకల్పించిన ప్రభుత్వం అందుకు అనుగుణంగా అడుగులు వేస్తోందన్నారు. రాష్ట్రంలో రూ. 15 వేలకు పైగా కోట్ల పెట్టుబడుల సమీకరణ, 3 లక్షల ఉద్యోగాల కల్పన, రెట్టింపు వృద్ధి, పర్యాటకుల సంఖ్య పెంపుదల, మౌలిక సదుపాయాల కల్పన, అభివృద్ధి ప్రాజెక్టుల మేళవింపుతో రూపొందించిన నూతన పర్యాటక విధానం ద్వారా పర్యాటకులను ఆకర్శించేలా ప్రత్యేక కార్యచరణతో ముందుకువెళ్లుతున్నామని చెప్పారు.
టూరిజం కాంక్లేవ్ లో రూ.15వేల కోట్లు
పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడానికి ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యం (పీపీపీ) విధానంలో ముందుకు వెళుతున్నామని, టూరిజం కాంక్లేవ్ లో రూ.15వేల కోట్లకు పైగా పీపీపీ మోడల్ లో పెట్టుబడులకు సంబంధించి అవగాహన ఒప్పందాలు చేసుకున్నామని చెప్పారు. ప్రభుత్వానికి వ్యాపారాత్మక ధోరణి లేదని, గత పాలకుల నిర్లక్ష్యం వల్ల రాష్ట్రం అప్పుల కుప్పగా మారిందని, ప్రభుత్వం పెట్టుబడులు పెట్టే పరిస్థితి లేదని అందుకు పీపీపీ మోడల్ పర్యాటక రంగ అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు.
పర్యాటక రంగాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తాం
నిరుపయోగంగాఉన్న పర్యాటక కేంద్రాలను వినియోగంలోకి తేవడానికి కృషి చేస్తున్నామని, తద్వారా వచ్చే ఆదాయంతో పర్యాటక రంగాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని పేర్కోన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు తెలంగాణలోని పర్యాటక ప్రాంతాలను సందర్శించి, టూరిజం ప్రమోషన్ లో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్, వైస్-ఛాన్సలర్ ప్రొఫెసర్ కుమార్ మొలుగారం, ప్రొఫెసర్ ఎస్. శ్రీనివాస మూర్తి పాల్గొన్నారు.
Also Read: Jupally Krishna Rao: మాదకద్రవ్యాల నివారణ అందరి బాధ్యత: మంత్రి జూపల్లి కృష్ణారావు
