Telangana: కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో కీలక నిర్ణయాలు
మొదటి రెండు స్థానాల్లో తెలంగాణ, కర్ణాటక లు
ఐటీ, ఫార్మా, ఏఐ రంగాలు వ్యాప్తి
వ్యవసాయ రంగాల్లోనూ రికార్డు స్థాయి ధాన్యం దిగుబడి
ఆర్ధిక వ్యవస్థలకు ఊతం ఇస్తున్న పాలసీలు
కాంగ్రెస్ సర్కార్ లో కొత్త జోష్
తెలంగా బ్యూరో, స్వేచ్ఛ: తలసరి ఆదాయంలో కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు టాప్‌లో నిలిచాయి. ఎన్డీఏ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం నిధుల కేటాయింపు విషయంలో కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల పట్ల చూసీచూడనట్టుగా వ్యవహరించినప్పటికీ తెలంగాణ (Telangana), కర్ణాటక రాష్ట్రాలు 2024-25 ఆర్థిక సంవత్సరంలో తలసరి ఆదాయం దేశంలోనే మొదటి రెండు స్థానాల్లో నిలిచాయి. తెలంగాణ గత ఐదేళ్లలో మొదటిసారిగా రూ.3.87 లక్షల ఆదాయంతో దేశంలోనే అత్యధిక తలసరి ఆదాయం సాధించిన రాష్ట్రంగా అవతరించింది. కర్ణాటక రూ.3.8 లక్షల ఆదాయంతో రెండో స్థానంలో నిలవగా, రూ. 3.5 లక్షల ఆదాయంతో హర్యానా మూడో స్థానంలో ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించింది. ఇది కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ఆర్థిక వృద్ధికి సంకేతంగా నిలిచినట్టు అయింది. క్లిష్టకాలంలోనూ అగ్రస్థానంలో నిలవడం వలన దేశంలోని మిగిలిన రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తున్నట్లు కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల ప్రభుత్వాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి.
పాలసీలు, విధానాలతో సక్సెస్
అప్పులతో ఉన్న రాష్ట్రాల్లోనూ తలసరి ఆదాయం పెంచడం దేశంలో కాంగ్రెస్ పార్టీ పాలనాదక్షతకు నిదర్శనమని ఆర్థిక నిపుణులు వివరిస్తున్నారు. ఒకవైపు సంక్షేమ ఫలాలను ప్రజలకు అందిస్తూనే పారిశ్రామిక, వ్యవసాయ, సేవలు అనుబంధ రంగాల అభివృద్ధికి చేస్తున్న కృషి ఫలితంగానే ఇది సాధ్యమైందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఈ పురోగతి అన్ని రంగాల్లో సమ్మిళిత వృద్ధి సాధించడం ద్వారా సాధ్యమైందని టీపీసీసీ నేతలు చెబుతున్నారు. విద్య, ఉపాధి రంగాల్లో సంస్కరణలు, ఐటీ, ఫార్మా, ఏఐ రంగాల విస్తరణ, వ్యవసాయ రంగాల్లో రికార్డు స్థాయిలో పెరిగిన ధాన్యం దిగుబడి వంటి కారణాలతో ఈ వృద్ధి సాధ్యమైందని కాంగ్రెస్ నేతలు అంటున్నారు. తెలంగాణ, కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ అమలు చేస్తున్న గ్యారంటీలతో ఆర్థిక వ్యవస్థలు పతనావస్థకు చేరుకున్నాయని బీజేపీ, బీఆర్ఎస్ చేస్తున్న విమర్శలకు తలసరి ఆదాయం పెరుగుదల చెంపపెట్టులాంటిదని కాంగ్రెస్ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.
వ్యవసాయానికి కీలక నిర్ణయాలు
తలసరి ఆదాయంలో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచినట్టు బ్యాంకర్లతో జరిగిన సమావేశంలో డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క వెల్లడించారు. తద్వారా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి పతనావస్థకు చేరుకుందని బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలకు ఆయన తిప్పికొట్టినట్టైంది. 2024లో ధరలు తగ్గడానికి ప్రధానంగా వ్యవసాయ ఉత్పత్తి భారీగా పెరగడం కారణమని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన రైతు సంక్షేమ పథకాలు, 25 లక్షల మంది రైతులకు రూ. 2 లక్షల వరకు రుణమాఫీ, రైతు భరోసా పథకం కింద కేవలం 9 రోజుల్లో రూ.9,000 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేయడం, ఎంపిక చేసిన పంటలకు బోనస్, వ్యవసాయానికి ఉచిత విద్యుత్ సరఫరా చేయడం పంటల దిగుబడులను గణనీయంగా పెంచాయని, పెట్టుబడుల ఆకర్షణ ఆర్థిక ప్రగతికి దోహదం చేశాయని అధికార పార్టీ నేతలు చెబుతున్నారు.
Read Also- Kavitha: సామాజిక తెలంగాణ సాధనే తమ ధ్యేయం.. కవిత కీలక వ్యాఖ్యలు
కేంద్రం వివక్ష చూపినా
దిగుబడులు పెరగడం ఆహార ధరలను తగ్గించడం వలన గ్రామీణ కుటుంబాలకు ఆర్థిక ఊరటనిచ్చిందని విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు. బీఆర్ఎస్ దుష్ప్రచారం చేస్తోందని కాంగ్రెస్ నాయకులు విమర్శిస్తున్నారు. బీసీ రిజర్వేషన్లు వంటి కీలక అంశాలను కేంద్రం పట్టించుకోకపోయినా, మెట్రో విస్తరణకు అనుమతులివ్వకపోయినా, సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాల అనుమతులను ఆలస్యం చేసినా, నిధులు కేటాయించకపోయినా ఆర్థికాభివృద్ధిలో తెలంగాణ దూసుకుపోతుండడం గమనార్హం. తద్వారా కేంద్ర ప్రభుత్వ వివక్షపూరిత వైఖరిని అధిగమించి కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు అభివృద్ధి, సంక్షేమంలో ఇతర రాష్ట్రాలకు అదర్శంగా నిలుస్తుండడం గమనార్హం.