Telangana Nursing: నర్సింగ్ అభ్యర్థులకు తెలంగాణ రాష్ట్ర నర్సింగ్ కౌన్సిల్ షాకింగ్ న్యూస్ చెప్పింది. ఇకపై నర్సింగ్ రిజిస్ట్రేషన్ రెన్యువల్ కావాలంటే కేవలం ఫీజు కడితే సరిపోదని, కచ్చితంగా సెమినార్లు, వర్క్‌షాప్‌లకు హాజరై ‘క్రెడిట్ అవర్స్’ సంపాదించాల్సిందేనంటూ పేర్కొన్నది. ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ మార్గదర్శకాల మేరకు కొత్త రూల్‌ను అమల్లోకి తీసుకురానున్నట్లు స్టేట్ నర్సింగ్ కౌన్సిల్ ప్రత్యేక ఉత్తర్వులు ఇచ్చింది. వైద్య రంగంలో వస్తున్న సాంకేతిక మార్పులు, కొత్త రకమైన చికిత్సలపై నర్సులు ఎప్పటికప్పుడు అవగాహన పెంచుకోవాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కౌన్సిల్ తెలిపింది. ‘అప్‌డేట్ అవ్వకపోతే అవుట్‌డేట్ అవుతారు’ అనే నినాదంతో నర్సుల నైపుణ్యాన్ని మెరుగుపరచడమే ఈ నిబంధన ముఖ్య ఉద్దేశమని వివరించింది. కానీ, ఈ నిర్ణయంతో నర్సింగ్ ఆఫీసర్లు షాక్‌లో ఉన్నారు. ముఖ్యంగా సర్కారీ దవాఖానల్లో పనిచేసే వారికి ఈ రూల్ చిక్కుగా మారే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నిబంధనను సవరించాల్సిందేనని నర్సింగ్ ఆఫీసర్ల అసోసియేషన్లు పట్టుబడుతున్నాయి. ఈ మేరకు వైద్యారోగ్య శాఖ మంత్రి, సెక్రటరీ, ఉన్నతాధికారులకు విన్నవించేందుకు యూనియన్ ప్రతినిధులు సిద్ధమయ్యారు.
150 గంటల శిక్షణ తప్పనిసరి
ఇప్పటి వరకు ఉన్న నిబంధనల ప్రకారం ఐదేళ్లకు ఒకసారి నర్సింగ్ రిజిస్ట్రేషన్ రెన్యువల్ చేసుకోవాల్సి ఉండేది. అయితే, 20 జనవరి 2026 నుంచి అమల్లోకి వచ్చిన కొత్త ఉత్తర్వుల ప్రకారం 150 గంటల శిక్షణ తప్పనిసరి అంటూ పేర్కొన్నారు. ప్రతి నర్సింగ్ ఆఫీసర్ ఐదేళ్ల కాలంలో కనీసం 150 గంటల కంటిన్యూయింగ్ నర్సింగ్ ఎడ్యుకేషన్ క్రెడిట్ అవర్స్ పూర్తి చేయాలి. ఈ క్రెడిట్ మార్కులు ఉంటేనే రిజిస్ట్రేషన్ రెన్యువల్ అవుతుంది. ఇక ఎవరైతే కొత్తగా ఎన్ యూఐడీ కార్డ్ పొందుతారో, వారికి మొదటిసారిగా 30 గంటల క్రెడిట్ అవర్స్ ఇన్సెంటివ్‌గా లభిస్తాయి. కౌన్సిల్ నిబంధనల ప్రకారం వర్క్‌షాప్‌లు, కాన్ఫరెన్స్‌లు, సెమినార్లలో పాల్గొనడం ద్వారా ఈ క్రెడిట్ పాయింట్లు లభిస్తాయి. అంతేగాక నర్సింగ్ జర్నల్స్‌లో వ్యాసాలు రాయడం లేదా పుస్తకాలు ప్రచురించడం ద్వారా కూడా క్రెడిట్స్ పొందవచ్చు. మరోవైపు నేరుగా రోగుల సేవలో ఉన్నవారికి లేదా బోధన రంగంలో ఉన్నవారికి ఏడాదికి 7 క్రెడిట్లు కేటాయించడం జరుగుతుంది. మిగిలిన 40 క్రెడిట్లను ఆన్‌లైన్ మాడ్యూల్స్ లేదా ఇతర ప్రోగ్రామ్స్ ద్వారా పొందాలని కౌన్సిల్ స్పష్టం చేసింది. మొత్తం మీద 5 ఏళ్లలో 75 క్రెడిట్ పాయింట్లు సంపాదించాల్సి ఉంటుంది.
Also Read: Nursing Students: నర్సింగ్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఇప్లూతో సర్కార్ ఒప్పందం..?
అభ్యర్థుల్లో తీవ్ర ఆందోళన
కౌన్సిల్ తీసుకున్న ఈ కొత్త నిర్ణయంపై నర్సింగ్ ఆఫీసర్లు, అభ్యర్థుల్లో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రధానంగా ప్రభుత్వాసుపత్రుల్లోని నర్సింగ్ అభ్యర్థులు ఈ కొత్త నిబంధనపై టెన్షన్ పడుతున్నారు. సర్కారీ ఆస్పత్రుల్లో పని ఒత్తిడి ఎక్కువగా ఉన్నందున, వర్క్‌షాప్‌లకు వెళ్లడానికి యాజమాన్యాలు సెలవులు ఇచ్చే అవకాశం ఉండదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రోగులకు సేవ చేసేందుకే తమ సమయం సరిపోతుందని, ఇలాంటి పరిస్థితుల్లో కౌన్సిల్ విధించిన క్రెడిట్ పాయింట్లను ఎలా సాధించాలి? అని ప్రశ్నిస్తున్నారు. అంతేకాకుండా, కాన్ఫరెన్స్‌లకు వెళ్లాలంటే భారీగా రిజిస్ట్రేషన్ ఫీజులు చెల్లించాల్సి వస్తోందని, ఇది తమపై అదనపు ఆర్థిక భారమేనని వివరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే రెన్యువల్ గడువు దగ్గర పడుతున్న వారు, ఇన్ని గంటల క్రెడిట్ మార్కులు ఎలా సంపాదించాలి? అని తలలు పట్టుకుంటున్నారు.
Also Read: Telangana Jobs: ప్రభుత్వ హాస్పిటల్స్‌లో ఖాళీల భర్తీ . ఆ తేది నుంచే సర్టిఫికెట్ల వెరిఫికేషన్!

