Municipal Elections: రాష్ట్రంలోని మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల ఎన్నికల ప్రక్రియలో మరో అడుగు పడింది. రాష్ట్ర వ్యాప్తంగా 117 మున్సిపాలిటీలు, మరో ఆరు మున్సిపల్ కార్పొరేషన్లలో త్వరలోనే ఎన్నికల నగారా మోగనున్నది. ఆయా స్థానిక సంస్థల్లో ఓటర్ల తుది జాబితాను ఈ నెల 12వ తేదీ కల్లా సిద్ధం చేయాలని, 16వ తేదీ కల్లా ఫోటోలతో కూడిన తుది ఓటర్ల జాబితా పోలింగ్ స్టేషన్ల వారీగా ప్రచురించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని అధికారులను ఆదేశించారు. ఎన్నికల సన్నద్ధతపై జిల్లా కలెక్టర్లు, మున్సిపల్ కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల పరిధిలో 13వ తేదీన పోలింగ్ స్టేషన్ల జాబితా ముసాయిదాను ప్రచురించాలని సూచించారు.
Also Read: Municipal Elections: మున్సిపోల్ ఎన్నికలకు రంగం సిద్ధం.. వార్డుల వారీగా ఓటర్ల జాబితా విడుదల!
మౌలిక వసతులు అందుబాటులో ఉండేలా చర్యలు
స్థానిక సంస్థల వారీగా పోలింగ్ స్టేషన్ల పరిస్థితులను కూడా గమనించి, వాటిల్లో మౌలిక వసతులు అందుబాటులో ఉండేలా చర్యలు చేపట్టాలని సూచించారు. అన్ని స్థానిక సంస్థల పరిధిలో టీ పోల్ యాప్‌ను అప్ లోడ్ చేయాలని ఆదేశించారు. ఎన్నికల నిర్వహణ కోసం బ్యాలెట్ బాక్సుల అంచనా వేయాలని, అవసరమైన సామగ్రి సిద్ధం చేయాలని ఆదేశించారు. ముఖ్యంగా ఎన్నికల నిర్వహణకు అవసరమైన కీలకమైన సిబ్మంది రిటర్నింగ్ ఆఫీసర్లు, అసిస్టెంట్ రిటర్నింగ్ ఆఫీసర్లు, జోనల్ అధికారులు, ఇతరుల నియామకం త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు.
మద్యం పంపిణీకి పూర్తి స్థాయిలో చెక్
దీనికి తోడు ఎన్నికల ప్రక్రియలో డబ్బు, మద్యం పంపిణీకి పూర్తి స్థాయిలో చెక్ పెడుతూ ఎలక్షన్ కోడ్ సక్రమంగా, పారదర్శకంగా అమలు చేసేందుకు అవసరమైన ఫ్లయింగ్ స్క్వాడ్ టీమ్స్, స్టాటిక్ సర్వైలెన్స్ టీమ్స్ నియామకాన్ని త్వరలో పూర్తి చేయాలని సూచించారు. ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు వీలుగా అవసరమైన పోలింగ్ సిబ్బంది నియామకం కోసం ఉద్యోగుల వివరాలు స్థానిక సంస్థలన్నీ టీ పోల్‌లో అప్ డేట్ చేయాలని సూచించారు. తెలంగాణ మున్సిపల్ ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
Also Read: Municipal Elections: మున్సిపల్ ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్.. ఉత్తర్వులు జారీ..!

