Jubilee Hills: జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఎన్నికల సందడి మొదలైంది. అధికార కాంగ్రెస్ పార్టీకి సిటీలో కేవలం ఒక్క సీటు మాత్రమే ఉండడంతో ఎలాగైనా జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే సీటును కైవసం చేసుకునేందుకు స్కెచ్ సిద్దం చేసిన అధికార పార్టీ ఈ నియోజకవర్గంలో ఒక్క రోజే రూ.5.15 కోట్ల అభివృద్ది పనులకు శంకుస్థాపన చేసింది. మంత్రులు పొన్నం ప్రభాకర్, వివేక్ వెంకటస్వామి, తుమ్మల నాగేశ్వరరావులు కలిసి శంకుస్థాపన చేశారు. షేక్‌పేట్ వార్డులో 315.90 లక్షల వ్యయంతో చేపట్టనున్న ఫ్లైఓవర్ క్రింద స్పోర్ట్స్ పార్క్, కమ్యూనిటీ డెవలప్‌మెంట్, ఫుట్‌పాత్‌తో పాటు హరిజన బస్తీ వద్ద సీసీ రోడ్ల నిర్మాణాలకు శంకుస్థాపనలు చేశారు.
ఇక వెంగళరావునగర్ వార్డులో గురుద్వార్ కమాన్ వద్ద 100.5 లక్షల వ్యయంతో చేపట్టనున్న సీసీ రోడ్ల నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. అనంతరం యూసఫ్‌గూడ వార్డులో రూ.95.75 లక్షల వ్యయంతో కమలాపురి అసోసియేషన్ కమ్యూనిటీ హాల్ పక్కన చేపట్టనున్న సీసీ రోడ్ల నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా హైదరాబాద్ జిల్లా ఇన్‌ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో ముందుంచుతామని తెలిపారు. ప్రజా పాలన ప్రభుత్వంలో సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో అన్ని సమస్యలు పరిష్కరిస్తామన్నారు. గత 10 సంవత్సరాలుగా హైదరాబాద్ నగరంలో బస్తీలు, కాలనీలు అభివృద్ధి జరగలేదని విమర్శించారు.
Also Read: Sleeping Less Effects: రోజుకి 6 గంటల కంటే తక్కువ నిద్రపోతున్నారా? మీ కళ్లు డేంజర్‌లో పడ్డట్లే!
హైదరాబాద్‌ల తాగునీరు, రోడ్లు, డ్రైనేజీ సమస్యలు లేకుండా పరిష్కారం చేస్తున్నామని, నగరంలో యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపర్చడానికి ప్రత్యేక ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. మంత్రులు వివేక్ వెంకటస్వామి, తుమ్మల నాగేశ్వరరావులు మాట్లాడుతూ, జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉన్న సమస్యలను తమ దృష్టికి తీసుకువస్తే వెంటనే పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. తాము ఎక్కడికి వెళ్లినా, ప్రజలు నాలాలు, సీసీరోడ్లు, డ్రింకింగ్ వాటర్ సమస్యలను తీర్చమని పబ్లిక్ కోరుతున్నారని, ప్రజా సమస్యలన్నింటినీ త్వరలోనే పరిష్కరించనున్నట్లు వెల్లడించారు.