Congress party: కాంగ్రెస్ పార్టీలో పదవుల పంచాయితీ తేలడం లేదు. కనీసం పీసీసీ కార్యవర్గం ఏర్పాటు కూడా ఇప్పటి వరకు పూర్తి చేయలేదు. కాంగ్రెస్ లో గత కొంత కాలంగా కార్యవర్గ రూప కల్పన జరుగుతున్నట్లు లీడర్లు ప్రచారం చేశారు. లిస్టు ఢిల్లీకి వెళ్లిందని చెప్పుకొచ్చారు. పలుమార్లు సీఎం, పీసీసీ చీఫ్‌లు కూడా ఢిల్లీకి వెళ్లి కార్యవర్గం ఏర్పాటుపై తమ వివరణ ఇచ్చారు. కానీ కార్యవర్గ ప్రకటన లో జాప్యం జరుగుతూనే ఉన్నది. కొత్త పీసీసీ బాధ్యతలు తీసుకొని దాదాపు 9 నెలలు కావొస్తుంది. కానీ కనీసం కమిటీలను కూడా ఏర్పాటు చేసుకోకపోవడం విస్మయానికి గురి చేస్తున్నది. హైకమాండ్ ఆదేశాల మేరకు పీసీసీ అండ్ టీమ్ గతంలోనే కొన్ని పేర్లను ఎంపిక చేశారు.
జిల్లాల వారీగా ఫీడ్ బ్యాక్ తీసుకొని మరీ హైకమాండ్‌కు పంపించారు. కానీ ఎలాంటి ఫలితం లేదని ఆశావహులు అంసతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. వాయిదాలు వేస్తున్నారే తప్పా, కొత్త కమిటీల ప్రకటన ఊసే లేదు. దీంతో గాంధీభవన్‌కు వస్తున్న నేతలు నిరాశకు గురవుతున్నారు. పార్టీ కోసం ఎంత పనిచేసినా, తమకు గుర్తింపు లేదని మండిపడుతున్నారు. క్యాబినెట్ విస్తరణతో పాటు పీసీసీ కార్యవర్గాన్ని కూడా పెండింగ్ పెడితే ఎలా? అంటూ సీరియస్ అవుతున్నారు. పీసీసీ కార్యవర్గ ప్రకటన ఇంత డీలే ఎప్పుడూ జరగలేదని కాంగ్రెస్ పార్టీకి చెందిన ఓ సీనియర్ నాయకుడు తెలిపారు.
సర్కార్, పార్టీ మధ్య కో ఆర్డినేషన్ మిస్
ప్రస్తుతం పాత కార్యవర్గంతోనే పీసీసీ కార్యక్రమాలు చేయాల్సి వస్తోన్నది. పైగా టీమ్ కూడా పూర్తి స్థాయిలో లేదు. చాలా మంది వేర్వేరు పార్టీ పోస్టులలో బాధ్యతలు తీసుకున్నారు. దీంతో పార్టీ చేపట్టిన కార్యక్రమాలేవీ పూర్తి స్థాయిలో అమలు కావడం లేదు. క్షేత్రస్థాయిలోకి చేరవేయడంలో అట్టర్ ఫ్లాప్ అవుతున్నారు. పైగా ప్రభుత్వానికి, పార్టీకి మధ్య కో ఆర్డినేషన్ లేదు.
Also Read: Ponnam Prabhakar: పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. భారత్ సైన్యం దీటైన సమాధానం.. మంత్రి పొన్నం!
దీంతో ప్రభుత్వ పథకాలు కూడా ప్రజల్లోకి ఆశించిన స్థాయిలో చేరడం లేదు. తద్వారా ప్రభుత్వంపై నెగెటివ్ ఫీడ్ బ్యాక్ పెరుగుతూనే ఉన్నది. ఇక స్పోక్స్ పర్సన్లు, పాత కార్యవర్గంలోని సభ్యులెవ్వరూ సీరియస్‌గా పనిచేయడం లేదు. ప్రతిపక్షాలు తప్పుడు ప్రచారాలను కూడా తిప్పికొట్టలేకపోతున్నారు. ఇవన్నీ కాంగ్రెస్ పార్టీని డ్యామేజ్ అయ్యేందుకు కారణాలవుతున్నాయి.
రెండు వందల మంది పోటీ?
కొత్త పీసీసీ కార్యవర్గంలో స్టేట్ ఆఫీస్ గాంధీ భవన్ నుంచి జిల్లా స్థాయిలో కమిటీల వరకు పుల్ కాంపిటేషన్ నెలకొన్నది. దాదాపు రెండు వందల మంది నేతలు పార్టీ పదవుల కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఇందులో వైస్ ప్రెసిడెంట్లు, వర్కింగ్ ప్రెసిడెంట్లు, సెక్రటరీలు, జనరల్ సెక్రటరీలు, జాయింట్ సెక్రటరీలు, ఆఫీస్ బేరర్లు, ఆర్గనైజేషన్ మెంబర్లు, పార్టీ ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్ మెంబర్లు, వంటి వాటికి ఇప్పటికే దరఖాస్తులు చేసుకున్నారు.
ఇక జిల్లా అధ్యక్షులకూ ప్రత్యేకంగా అప్లికేషన్లు స్వీకరించినట్లు పీసీసీ తెలిపింది. వివిధ సామాజిక వర్గాలకు చోటు కల్పిస్తూ ఈ కమిటీలన్నీ ఏర్పడనున్నాయి. అయితే నేతల మధ్య అభిప్రాయ భేదాలు, సమన్వయ లోపం లేకుండా కొత్త పీసీసీ కమిటీలు ప్రకటిస్తామని ముఖ్య లీడర్లు చెప్తున్నారు. పదవుల ఎంపికలో పార్టీ, ప్రభుత్వం పెద్దల నుంచి సహజంగానే ప్రెజర్ ఎక్కువగా ఉన్నది. తమ అనుచరులకు పదవులు ఇప్పించే విషయంలో పీసీసీపై తీవ్రమైన ఒత్తిడి తెస్తున్నట్లు తెలిసింది.
Also Read: Naa Anveshana: ఉగ్రవాదానికి లింక్ చేస్తూ.. మరో ఇద్దరు బెట్టింగ్ రాయుళ్లను అన్వేష్ ఉతికారేశాడు!