Telangana Handloom Crisis (Image Source: X)
తెలంగాణ

Telangana Handloom Crisis: 12 ఏళ్లుగా నేతన్నల నెత్తిన పాలకవర్గాల పిడుగు! పుష్కర కాలంగా ఇన్‌‌ఛార్జ్‌ల అరాచకం!

Telangana Handloom Crisis: తెలంగాణ నేతన్నల బతుకులు జీవచ్ఛవంలా మారుతున్నాయి. చేతి నిండా పని లేక, అప్పుల కుప్పలా కార్మికుల జీవితాలు నలిగిపోతున్నా, ప్రభుత్వాలు దగా చేయడం తప్ప నేత కార్మికులను ఉద్దరించింది ఏమి లేకుండా పోయింది. పాలన కాలం పూర్తి అయినా ఎన్నికలు నిర్వహించకపోవడంతో గత బీఆర్ఎస్ ప్రభుత్వ నిర్లక్ష్యంతో పుష్కర కాలంగా తిష్ట వేసుకుని ఉన్న పాలక వర్గాలు కొన్ని ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి పోయి నిస్సిగ్గుగా నేత కార్మికులపై దగా కత్తి వేటు వేస్తున్నాయి. తమ సమస్యలకు పరిష్కారం చూపాల్సిన చేనేత సహకార సంఘాలు నేడు ప్రజాస్వామ్యం లేక కునారిల్లుతున్నాయి. పుష్కర కాలంగా ఎన్నికల ఊసే లేకుండా సంఘాలను తాకట్టు పెట్టిన పాలకవర్గాల అరాచకంపై ‘స్వేచ్ఛ’ సంధించిన అక్షర పిడుగు ఇది..

ఎన్నికలు లేవు, ప్రజాస్వామ్యం లేదు! ప్రైవేట్ వ్యక్తులకు నేతన్నల సంఘాలు బలి!

ప్రజాస్వామ్యం అంటేనే ఎన్నికలు. కానీ, చేనేత సహకార సంఘాలకు చివరిసారిగా 2013 ఫిబ్రవరిలో ఎన్నికలు జరిగాయి! ఈ పుష్కర కాలంగా సంఘాలను ఎవరు నడుపుతున్నారు? ప్రభుత్వాలు నియమించిన పర్సన్-ఇన్‌ఛార్జీలు (Person-in-Charge)! ఆరు నెలలకొకసారి వారి పదవీకాలాన్ని నిస్సిగ్గుగా పొడిగిస్తూ, నేతన్నల గొంతు నొక్కేస్తున్నారు. పాలకవర్గాలు లేకపోవడంతో సహకార సంఘాలు సరైన నాయకత్వం లేకుండా దిక్కుతోచని స్థితిలో పడిపోయాయి. పర్యవసానంగా, ఈ సంఘాలు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్లాయనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. నేతన్నల స్వయంప్రతిపత్తిని కాలరాస్తూ, ప్రభుత్వాలు ఇన్‌ఛార్జుల పాలనతో తమ చేతుల్లో అధికారాన్ని ఉంచుకోవడం ఏ రకమైన న్యాయం?

Also Read- Trains Cancelled: మెుంథా తుపాను ఎఫెక్ట్.. విశాఖ మీదగా వెళ్లే 43 రైళ్లు రద్దు.. పూర్తి లిస్ట్ ఇదే!

రూ.25 కోట్ల బకాయిలు… నేతన్న బతుకుపై ‘టెస్కో’ పిడుగు!

తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 420 చేనేత సహకార సంఘాలలోని సుమారు 60 వేల మంది చేనేత కార్మికులు ఉన్న చేనేత రంగాన్ని చుట్టుముట్టిన ఆర్థిక సంక్షోభం అసాధారణమైనది. రాష్ట్రవ్యాప్తంగా మాస్టర్ వీవర్లు, సహకార సంఘాల వద్ద కోట్లలో చేనేత వస్త్ర నిల్వలు పేరుకుపోయాయి. వీటిని అమ్ముకునే దిక్కులేక నిధులు స్తంభించిపోయాయి. కార్మికులకు అండగా ఉండాల్సిన టెస్కో (TESCO) సంస్థ కూడా రూ.25 కోట్లకు పైగా బకాయిలు చెల్లించకుండా మొండికేస్తోంది. ప్రభుత్వ సంస్థలే కార్మికుల పొట్టకొడితే, వారు ఎవరిని నమ్ముకోవాలి? బకాయిలు అందక, అమ్ముడుపోని వస్త్ర నిల్వలతో అప్పుల భారంతో కుంగిపోతున్న నేతన్నలు కన్నీరు పెడుతున్నారు. గత ప్రభుత్వాల కళ్యాణ లక్ష్మి, బతుకమ్మ చీరల పథకాలు కేవలం తాత్కాలిక ఉపశమనమే ఇచ్చాయి తప్ప, శాశ్వత పరిష్కారం చూపలేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

‘తుమ్మల’ హామీలు ‘ఉత్త’ మాటలేనా? 2025లోనూ ఎన్నికల ఊసే లేదు…!

కొత్త ప్రభుత్వం వస్తే తమ కష్టాలు తీరుతాయని ఆశించిన నేతన్నలకు మళ్లీ నిరాశే మిగిలింది. వ్యవసాయ, చేనేత శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు (Tummala Nageswara Rao) 2024 జూన్‌లో.. త్వరలో ఎన్నికలు నిర్వహిస్తామని, పూర్తిస్థాయి ఉపాధి కల్పిస్తామని గొప్ప హామీలు ఇచ్చారు. ప్రభుత్వ శాఖల వస్త్రాలను టెస్కో ద్వారా మాత్రమే కొనుగోలు చేయాలని ఆదేశాలిచ్చామని కూడా చెప్పారు. కానీ, 2025 ఆగస్టు నివేదిక ప్రకారం.. మంత్రి గారి హామీలు గాలిలో దీపాలుగా మిగిలిపోయాయి! ఎన్నికల ప్రస్తావన లేదు. రుణమాఫీ, జీఎస్టీ మినహాయింపు వంటి ప్రయోజనాలు కల్పించడానికి ప్రభుత్వం కేవలం ‘కృషి’ చేస్తోందే తప్ప, పూర్తి స్థాయిలో అమలు కాలేదు. చేనేత మిత్ర వంటి పథకాల ప్రయోజనాలు కూడా పూర్తిస్థాయిలో కార్మికులకు అందకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి పరాకాష్ట!

Also Read- Karimnagar Crime: రాష్ట్రంలో షాకింగ్ ఘటన.. పక్కింటి వారితో కిటికీ లొల్లి.. ప్రాణం తీసుకున్న మహిళ

లోపించిన అధికారుల పర్యవేక్షణ

పాలక వర్గాలు లేకపోవడంతో చేనేత జౌళి శాఖ అధికారుల పర్యవేక్షణ లోపించడం వలన చేనేత సహకార సంఘాలు ప్రైవేట్ వ్యక్తుల చేతులకు వెళుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. చేనేత సహకార సంఘాలు నూలు (యారా)ను పద్ధతి ప్రకారం ఎన్.హెచ్.డి.సి (నేషనల్ హ్యాండ్‌లూమ్ డెవలప్మెంట్ కార్పొరేషన్) నుంచి కొనుగోలు చేయాల్సి ఉంటుంది. దీనికి 40 శాతం సబ్సిడీ ఎన్‌హెచ్‌డిసి ఇస్తుంది. ఇలా కొనుగోలు చేసిన నూలతో నేసిన వస్త్రాలను టెస్కోకు విక్రయించాలి. కానీ అధికారుల పర్యవేక్షణ లోపించడం పలు సంఘాల పాలకవర్గాలు ప్రైవేట్ వ్యక్తులకు కొమ్ము కాయడంతో ప్రైవేట్ వ్యక్తులే నూలు సప్లై చేసి వారే వస్త్రాలను కొనుగోలు చేస్తున్నారు. దీంతో చేనేత కార్మికులకు రావలసిన బోనస్ సబ్సిడీ రాకుండా పోతుంది. దీంతో కార్మికులు నష్టపోయి ప్రైవేట్ వ్యక్తులు లాభపడుతున్నారు.

కార్మికుల కష్టం కాజేస్తున్నారు

పాలనాకాలం పొడిగించడంతో ఇష్టారాజ్యంగా కొంతమంది ఇన్చార్జి పాలకులు విస్తరిస్తున్నారు. ప్రైవేట్ వ్యక్తులతో కుమ్మక్కై ప్రభుత్వం నుంచి రావలసిన బోనస్ రాకుండా చేసి కార్మికుల కష్టం కాజేస్తున్నారని ఆరోపణలు తీవ్ర స్థాయిలో వినిపిస్తున్నాయి. చేనేత కార్మికులు మరో పని రాక, ఉన్న పనిలో కష్టపడుతూ సరిపడా వేతనం రాక అనేక ఇబ్బందులు పడుతున్నారు. పాలనాకాలం పొడిగించడంతో తిష్ట వేసుకొని ఉన్న పాలకవర్గాలు కనీసం సర్వసభ్య సమావేశాలు నిర్వహించకుండా ఇష్టారాజ్యాంగ వ్యవహరిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. కనీసం కార్మికుల సమస్యలను గుర్తించి ప్రభుత్వం దృష్టికి తీసుకు వెళ్లే ప్రయత్నాలు కూడా చేయడం లేదనేలా వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సరిపడా ఉపాధి లేకపోవడంతో గతంలో మాదిరిగా చేనేత కార్మికుడు తిరిగి బతుకుదెరువు కోసం బొంబాయి సూరత్ వలస బాట పడుతున్నారు.

వృత్తిని వీడుతున్న నేతన్నలు… మరణశాసనం రాస్తున్న ప్రభుత్వాలు!

ఉపాధి లేక, అప్పుల ఊబిలో కూరుకుపోయిన వేలాది చేనేత కార్మికులు తమ వారసత్వ వృత్తిని వదిలిపెట్టి వలస పోతున్నారు. ఇది కేవలం కార్మికుడి కష్టం కాదు.. తెలంగాణ సాంస్కృతిక కళకు మరణశాసనం! చేనేత రంగానికి పూర్వవైభవం తీసుకురావాలంటే.. ప్రభుత్వం తక్షణమే ఈ అరాచక ఇన్‌ఛార్జుల పాలనకు తెరదించాలి. యుద్ధ ప్రాతిపదికన సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించి, ప్రజాస్వామ్య పాలకవర్గాలను ఏర్పాటు చేయాలి. మంత్రి హామీలను వెంటనే అమలు చేసి, రూ.25 కోట్ల బకాయిలను తక్షణమే చెల్లించి, పేరుకుపోయిన వస్త్ర నిల్వలను కొనుగోలు చేయాలని నేతన్నలు ‘స్వేచ్ఛ’ ద్వారా నిర్భయంగా డిమాండ్ చేస్తున్నారు.

స్వేచ్ఛ ఈ – పేపర్ కోసం https://epaper.swetchadaily.com/ ఈ లింక్ క్లిక్ చేయగలరు

Just In

01

Kurnool Bus Accident: కర్నూలు జిల్లా‌ బస్ యాక్సిడెంట్ మృతులైన తల్లికూతుర్లకు కన్నీటి వీడ్కోలు

Medak: ప్రభుత్వ పాఠశాలకు నీటి శుద్ధి యంత్రాన్ని అందజేసిన హెడ్ మాస్టర్.. ఎక్కడంటే?

Ramchander Rao: రాష్ట్రంలో గన్ కల్చర్ పెరిగిపోయింది.. రౌడీ షీటర్లపై కేసుల ఎత్తేసి ఫించన్లు కూడా ఇస్తారు

Mass Jathara Trailer: మాస్ విందుకు రెడీ అయిపోండమ్మా.. ఇక వార్ జోనే!

Bad Boy Karthik: అందమైన ఫిగరు నువ్వా.. హీరోయిన్‌ని నాగశౌర్య అలా అడిగేశాడేంటి?