Panchayat Elections: కాంగ్రెస్ ప్రభుత్వం పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు సిద్ధమవుతోంది. ఇందుకు అధికారులను సమాయత్తం చేస్తున్నది. అయితే గత బీఆర్ఎస్(Brs) ప్రభుత్వం అనుసరించిన పద్ధతిలోనే ఎన్నికలు నిర్వహించనున్నట్లు సమాచారం. కాంగ్రెన్(Congress) ఇచ్చిన హామీ మేరకు 42శాతం రిజర్వేషన్లను బీసీలకు పార్టీ తరుపున ఇవ్వబోతున్నట్లు విశ్వసనీయ సమాచారం. బీసీలకు ఎలాంటి నష్టం జరుగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది. గత బీఆర్ఎస్(Brs) ప్రభుత్వం ఇచ్చిన విధంగానే రిజర్వేషన్లు అధికారికంగా ప్రకటించినా, కామారెడ్డి డిక్లరేషన్‌లో పేర్కొన్న విధంగా బీసీలకు న్యాయం చేసేందుకు సిద్ధమవుతోంది. రెండ్రోజుల్లో పంచాయతీరాజ్ అధికారులతో సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) భేటీ అవుతున్నట్లు తెలుస్తోంది. ఎన్నికలకు సిద్ధంగా ఉండాలని పంచాయతీరాజ్(Panchayat Raj) అధికారులకు ఆదేశాలు సైతం జారీ చేసినట్లు తెలిసింది.
Also Read: Mee Seva New Service: మీ సేవ పరిధిలోకి కొత్త సేవలు.. నిమిషాలలో ఈ సర్టిఫికెట్ జారీ
14న ఫుల్ క్లారిటీ
స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను కోర్టు ఇచ్చిన గడువు (సెప్టెంబర్ 30)లోగా చేపట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాల ప్రారంభోత్సవం, అభివృద్ధి పనులకు శ్రీకారం, పెండింగ్ పనుల పూర్తికి చర్యలు తీసుకుంటోంది. 14న పంచాయతీ రాజ్(Panchayat Raj) అధికారులతో ముఖ్యమంత్రి సమావేశం నిర్వహించనున్నట్లు సమాచారం. అధికారులు అన్ని వివరాలతో హాజరు కావాలని అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం. ఈ సమావేశంతో పంచాయతీ ఎన్నికలపై క్లారిటీ వస్తుందని సమాచారం. ఎన్నికల సన్నాహాలు, రిజర్వేషన్ల అమలు, పోలింగ్ స్టేషన్లు, బ్యాలెట్‌పత్రాలు, బ్యాలెట్‌బాక్స్‌లు, ఓటర్ల జాబితా తయారీపై చర్చించే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పంచాయతీరాజ్ శాఖ అధికారులు ఎప్పుడు ఎన్నికలు వచ్చినా సంసిద్ధంగా ఉన్నామని చెబుతున్నారు. ఎన్నికల సన్నద్ధతపై అధికారులకు శిక్షణ తరగతులు కూడా నిర్వహించారు. ఎన్నికల సామగ్రి బ్యాలెట్ పత్రాలు, బ్యాలెట్ బాక్సులను సైతం ఆయా జిల్లా కేంద్రాలకు సరఫరా చేశారు. అవి గోదాముల్లో నిల్వ చేసి, పకడ్బందీగా ఏర్పాట్లు చేశారు.
ఏం తేలుస్తారో?
బీఆర్ఎస్(BRS) హయాంలో 23 శాతం బీసీ రిజర్వేషన్లను కొనసాగించింది. అయితే కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం 42శాతం బీసీ రిజర్వేషన్లు సాధనకోసం అసెంబ్లీ తీర్మానం చేసి కేంద్రానికి పంపిన విషయం తెలిసిందే. మరోవైపు రిజర్వేషన్లపై ఆర్డినెన్స్‌ను గవర్నర్‌కు పంపగా, దానిని కేంద్రానికి పంపారు. అయితే కేంద్రం వద్ద జాప్యం జరుగుతుండటం, ఇప్పటికే గ్రామాల్లో అభివృద్ధి కొంత కుంటుపడటంతో దానిని వేగవంతం చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. బీసీ రిజర్వేషన్ల పెంపుపై చర్చించేందుకు 17న పొలిటికల్ అఫైర్స్ కమిటీ (పీఏసీ) సమావేశం నిర్వహించబోతున్నట్లు సమాచారం. సమావేశంలో కాంగ్రెస్(Congress) సీనియర్ నేతలతో పాటు మంత్రులు, కీలక పదవుల్లో ఉన్న నేతలు పాల్గొనబోతున్నట్లు తెలిసింది. రిజర్వేషన్లపై పెంపు అభిప్రాయాల సేకరణ, బీసీ కమిషన్ నివేదిక, న్యాయనిపుణుల నుంచి తీసుకున్న అభిప్రాయాల మేరకు రిజర్వేషన్ల పెంపునకు సంబంధించిన తుది నిర్ణయం తీసుకోబోతున్నారని సమాచారం.
సెక్రటరీల ఆవేదన
గ్రామ పంచాయతీలకు పాలక వర్గం 18 నెలలుగా లేకపోవడంతో 15వ ఆర్థికసంఘం నిధులను కేంద్రం నిలిపివేసింది. ప్రతి నెలా రూ.180 కోట్లు రావల్సి ఉండగా, దాదాపు రూ.2,700 కోట్ల వరకు పెండింగ్ పడింది. స్థానిక ఎన్నికలు పూర్తయితే తప్ప ఆ నిధులు విడుదలయ్యే అవకాశం లేదని పంచాయతీరాజ్ అధికారులు చెబుతున్నారు. దీనికి తోడు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎస్‌ఎఫ్‌సీ నిధులు కూడా గత 13 నెలలుగా విడుదల కావట్లేదని, మొత్తం రూ.1550 కోట్లు వరకు పెండింగ్‌లో ఉన్నాయి. దీంతో గ్రామపంచాతీ కార్యదర్శులు, ప్రత్యేక అధికారులు తమ వేతనాలకు తోడు అప్పులు తెచ్చి గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నామని, సుమారు రూ.74 కోట్లకు పైగా పనులు చేశామని నెలల తరబడి పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. చేసిన పనులకు నిధులు మంజూరు చేయాలని ప్రభుత్వానికి విన్నవించుకున్నా విడుదల చేయడం లేదని, ఏం చేయాలో దిక్కుతోచని స్థితిలో ఆర్థికంగా చితికిపోయి ఇబ్బందులు పడుతున్నామని పలువురు పంచాయతీ సెక్రటరీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
Also Read: Auto Drivers Struggle: ఉచిత బస్సు ప్రయాణం.. మహాలక్ష్మితో ఆటో డ్రైవర్లు దివాలా