FRS System: రాష్ట్ర ప్రభుత్వం విద్యారంగం బలోపేతం కోసం పలు కీలక నిర్ణయాలు తీసుకున్నది. అందులో భాగంగా ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కాలేజీల్లో ఎఫ్ఆర్ఎస్(FRS) విధానాన్ని తీసుకొచ్చింది. కాగా వాటి అమలుపై సర్కార్ ఆరా తీసింది. గతానికి భిన్నంగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలు మెరుగైన పనితీరుతో ముందుకు సాగుతున్నాయి. ప్రతి పనిలో కచ్చితత్వం, పారదర్శకత, జవాబుదారీతనం ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి సూచనలకు అనుగుణంగా డైరెక్టరేట్ ఆఫ్ ఇంటర్మీడియట్(డీఐఈ) ముందుకు సాగుతున్నది. విద్యార్థుల హాజరు శాతం పెంపు, పకడ్బందీగా ప్రాక్టికల్స్(Practicals), పరీక్షల నిర్వహణ, బోధన, బోధనేతర సిబ్బందికి(టీచింగ్, నాన్ టీచింగ్) అవసరమైన పాలనా పరమైన సేవలను ఆన్‌లైన్ ద్వారా అందుబాటులోకి తీసుకొచ్చారు. మానవ వనరుల నిర్వహణ వ్యవస్థ బలోపేతంతో పాటు డీఐఈలో తీసుకొచ్చిన పలు మార్పులతో మంచి ఫలితాలు వస్తుండడంతో మిగతా శాఖలు సైతం వాటిని అందిపుచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. రాష్ట్రంలో ఉన్న 430 ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఫేషియల్ రికగ్నైజేషన్ అమలవుతున్నది. దీంతో ఇంటి నుంచి కళాశాలకు బయలుదేరిన విద్యార్థులు నేరుగా కళాశాలలకే వస్తున్నారు. ఎఫ్ఆర్ఎస్ కారణంగా తల్లిదండ్రుల మొబైల్ ఫోన్లకు హాజరు, మార్కులు, ఏదైనా రిమార్కులుంటే ఎప్పటికప్పుడు సందేశం వెళ్తున్న నేపథ్యంలో గైర్హాజరు శాతం తగ్గింది.
ఈ సారి నీళ్లలో పడినా తడిచిపోని బుక్‌లెట్
తెలంగాణ వ్యాప్తంగా 430 ప్రభుత్వ కళాశాలల్లో 1,47,465 మంది విద్యార్థులున్నారు. వీరిలో ప్రతిరోజు 90 శాతానికి మంది కళాశాలలకు హాజరవుతున్నారు. విద్యార్థుల మాదిరే అన్ని కళాశాలలు, కార్యాలయాల్లోని బోధన, బోధనేతర సిబ్బంది హాజరును కూడా ఎఫ్ఆర్ఎస్ ద్వారా తీసుకుంటున్నారు. దీంతో ఉద్యోగుల హాజరుశాతం మెరుగుపడడంతో పాటు బాధ్యతాయుతంగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలతో పాటు ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్, సహకార, కేజీబీవీ, సంక్షేమ గురుకులాల పరిధిలోని కళాశాలల్లో గతంలో ప్రాక్టికల్స్ నిర్వహణ నామమాత్రంగా సాగేది. కానీ ప్రాక్టికల్స్ కచ్చితంగా నిబంధనలకు అనుగుణంగా నిర్వహించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ప్రాక్టికల్స్‌లో పాల్గొనకపోతే విద్యార్థులకు ఆయా అంశాల్లో జ్ఞానం కొరవడి అది ఉన్నత విద్య సమయంలో ఇబ్బందికరంగా తయారవుతున్న విషయం సీఎం దృష్టికి వచ్చింది. సీఎం ఆదేశాల మేరకు అన్ని కళాశాలల్లో ప్రాక్టికల్స్ పకడ్బందీగా నిర్వహిస్తున్నారు.
ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణ
ఫైనల్ ఎగ్జామినేషన్ సమయంలోనూ ప్రాక్టికల్స్(Practicals) విషయంలో ఏమాత్రం అలసత్వం చేయకూడదని సీఎం స్పష్టం చేశారు. ప్రాక్టికల్స్ నిర్వహణలో తీసుకొచ్చిన ఈ మార్పులతో రాష్ట్రంలోని అన్ని యాజమాన్యాల పరిధిలోని 10 లక్షలకు పైగా ఇంటర్ విద్యార్థులకు థియరీతో పాటు ప్రాక్టికల్ నాలెడ్జ్ పెరిగేందుకు దోహదపడనుంది. ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణ గతంలో ఓ ప్రహసనంగా ఉండేది. పరీక్ష పేపర్ల తయారీ కేంద్రం నుంచి స్ట్రాంగ్ రూంకి, అక్కడి నుంచి జిల్లా కేంద్రాల్లోని పోలీస్ స్టేషన్లకు అక్కడి నుంచి కళాశాలలకు తరలించేవారు. ఈ క్రమంలో సరైన ఏర్పాట్లు లేక పలుమార్లు లీకేజీలు జరిగేవి. దీంతో విద్యార్థులు తీవ్రంగా నష్టపోయేవారు. కానీ ఇప్పుడు తయారీ కేంద్రం నుంచి పరీక్ష నిర్వహణ కేంద్రం వరకు ప్రతి దశలో తరలింపునకు సంబంధించి వాహనానికి జీపీఆర్ఎస్ ఏర్పాటు చేసి దానిని మానిటరింగ్ చేస్తున్నారు. అలాగే విద్యార్థులకు ఇచ్చే పరీక్ష పేపర్, బుక్‌లెట్‌పై కోడ్ ఏర్పాటు చేస్తారు. దీంతో ఏ దశలో ఎక్కడ తొలుత స్కాన్ అయింది వెంటనే తెలిసిపోతుంది. నీళ్లలో పడినా తడిచిపోని బుక్‌లెట్‌ను విద్యార్థులు ఈ దఫా అందించనున్నారు.
Also Sudharshan Reddy: ఓటర్ మ్యాపింగ్ ప్రక్రియలో వేగం పెంచండి: సుదర్శన్ రెడ్డి
సమస్యలు పరిష్కారనికి సర్కార్ చెక్
ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణకు సంబంధించి ప్రతి ఏటా పలు రకాల సమస్యలు ఎదురవుతున్నాయి. ఇందులో ప్రధానమైనది పలు కళాశాలల్లో విద్యార్థుల నుంచి ఫీజు వసూలు చేసినా సకాలంలో చెల్లించకపోవడం వల్లనో లేక అసలు ఆ ఫీజును బోర్డుకు చెల్లించని ఫలితంగానో పరీక్షలు ప్రారంభమయ్యే రోజు వరకు హాల్ టిక్కెట్ల విషయంలో గందరగోళం నెలకొంటోంది. పరీక్షలకు ముందు రోజు విషయం బయటకు తెలుస్తుండడంతో అప్పటికప్పడు బోర్డు కొత్తగా పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేయాల్సి వస్తోంది. ఇక ముందు ఆ సమస్య తలెత్తకుండా అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ఎంత మంది విద్యార్థులున్నారు.. ఎంత మంది ఫీజు చెల్లించారనేది ఎప్పటికప్పుడు దాని కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మాడ్యూల్‌లో అప్‌డేట్ అవుతోంది. నిర్దేశిత సమయంలోగా ఎక్కడైనా విద్యార్థులు ఫీజులు చెల్లించకపోతే అందుకు సరైన కారణాలను ప్రిన్సిపాల్ తెలియజేయాల్సి ఉంటుంది. వెంటనే సంబంధిత విద్యార్థుల తల్లిదండ్రులకు ఆ సమాచారం అందుతుంది. దీంతో గతంలో మాదిరి సమస్యలు తలెత్తవు.
విద్యార్థుల తల్లిదండ్రులకు..
అలాగే చాలా మంది విద్యార్థులు ఇంటర్ మొదటి సంవత్సరంలో కొన్ని సబ్జెక్టుల్లో ఫెయిల్ అవుతారు. కానీ ఆ విషయాన్ని తల్లిదండ్రులకు తెలియజేయరు. సెకండ్ ఈయర్ విద్యార్థులకు ఇచ్చే హాల్ టిక్కెట్లపై మొదటి సంవత్సరం ఏ సబ్జెక్టులో ఎన్ని మార్కులు వచ్చాయి? పాసయ్యారా? ఫెయిలయ్యారా? అనే అంశాలు ప్రింట్ చేయనున్నారు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులకు, విద్యార్థులకు ఆ అంశంపై ముందుగానే స్పష్టత ఉంటుంది. నామినల్ రోల్స్‌లోని గందరగోళం కారణంగా గతంలో పరీక్షల సమయంలో విద్యార్థులకు బ్లాంక్ ఓఎంఆర్ సీట్లు ఇచ్చేవారు. వారి ఫలితాలను విత్‌హెల్డ్‌లో ఉంచేవారు. దానిని క్లియర్ చేసేందుకు విద్యార్థులకు చాలా సమయం పట్టేది. ఇలా జరగకుండా ఉండేందుకు ముందుగానే ప్రిన్సిపల్స్ నుంచి నామినల్ రోల్స్ కరెక్షన్స్ చేస్తున్నారు. జూనియర్ కాలేజీల్లో ఇప్పటి వరకు ఎదురైన సమస్యల పరిష్కారానికి సర్కార్ చెక్ పెట్టాలని నిర్ణయించింది. అందుకే ఈ తరహా నిర్ణయాలు అమలుచేస్తున్నట్లుగా చెబుతున్నారు. భవిష్యత్ లోనూ ఈ విధానం ఇంతే పారదర్శకంగా కొనసాగుతుందా? లేదా? అనేది చూడాలి.
Also Read: CM Revanth Reddy: జనవరి 26 లోపు ఉద్యోగుల వివరాలు అందజేయాలి.. ఉన్నతాధికారులకు సీఎం ఆదేశం!

