Medical Colleges: వైద్య, విద్యలో సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకున్నది.‘సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ’లుగా గాంధీ, ఉస్మానియా, వరంగల్ మెడికల్ కాలేజీలను ఎంపిక చేశారు. వైద్య విద్య నాణ్యతను అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్లేందుకు సర్కార్ నడుం బిగించింది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని మూడు ప్రతిష్టాత్మక మెడికల్ కాలేజీలను ‘సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ’లుగా తీర్చిదిద్దాలని నిర్ణయించింది. హైదరాబాద్‌లోని ఉస్మానియా, గాంధీ ఆస్పత్రులతో పాటు వరంగల్‌లోని కాకతీయ మెడికల్ కాలేజీ ఈ జాబితాలో ఉన్నాయి.
కీలక నిర్ణయాలు ప్రభుత్వ ఆమోదం
ఈ ప్రతిపాదనకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీనికి సంబంధించి డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్‌కు అధికారికంగా ఆదేశాలు అందాయి. ఈ కేంద్రాల్లో కేవలం భవనాలు, పరికరాలు మాత్రమే కాకుండా, నిర్వహణలో ఏఐ, లేటెస్ట్ డిజిటల్ టెక్నాలజీలను ప్రవేశపెట్టనున్నారు. వ్యాధి నిర్ధారణ, రోగుల డేటా విశ్లేషణలో ఈ టెక్నాలజీ కీలక పాత్ర పోషిస్తుంది.
Also Read: Medical College Professors: మెడికల్ కాలేజీల్లో తీరనున్న ప్రొఫెసర్ల కొరత
అన్ని కాలేజీలు లింక్
ఈ మూడు ప్రధాన కాలేజీలను రాష్ట్రంలోని మిగిలిన అన్ని ప్రభుత్వ మెడికల్ కాలేజీలతో అనుసంధానం చేస్తారు. దీనివల్ల మారుమూల ప్రాంతాల్లోని వైద్య విద్యార్థులు, డాక్టర్లు కూడా నగరాల్లోని నిపుణుల సలహాలను పొందవచ్చు. ఇక ఇవి కేవలం చికిత్సకే పరిమితం కాకుండా, కొత్తగా వచ్చే వైద్యులకు, సిబ్బందికి అత్యాధునిక వైద్య విధానాలపై ట్రైనింగ్ ఇచ్చే కేంద్రాలుగా మారుతాయి. దీని వలన బోధనా పద్ధతులు సాధారణ తరగతులకు భిన్నంగా మారనున్నాయి. ఇకపై, మెడికల్ స్టూడెంట్స్ సిమ్యులేషన్ ల్యాబ్స్, వర్చువల్ రియాలిటీ ద్వారా శస్త్రచికిత్సలు క్లిష్టమైన వైద్య ప్రక్రియలను నేర్చుకునే అవకాశం ఉంటుంది. దీనివల్ల విద్యార్థులకు ప్రాక్టికల్ నాలెడ్జ్ పెరగడమే కాకుండా, రోగులకు అందించే చికిత్సలో పొరపాట్లు జరిగే ఛాన్స్ తగ్గుతుంది.
రోగులకు చేకూరే ప్రయోజనం
ఈ మార్పుల వల్ల సామాన్య ప్రజలకు కార్పొరేట్ స్థాయి వైద్యం ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే ఉచితంగా అందుతుంది. ఆధునిక సాంకేతికత వల్ల రోగ నిర్ధారణ వేగంగా జరిగి, తక్కువ సమయంలోనే మెరుగైన చికిత్స అందించే వీలు ఉంటుంది.
Also Read: Drug Peddlers Arrested: డ్రగ్ పెడ్లర్ అరెస్ట్.. 21కిలోల పాపీ హస్క్ సీజ్

