Mahalakshmi Scheme: రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు మహాలక్ష్మి పథకం అమలు చేస్తుంది. ఈ పథకంలో కీలక మార్పులు చేస్తుంది. ఆధార్ కార్డుతో కాకుండా చిప్ తో కూడిన స్మార్టు అందజేసేందుకు సన్నాహాలు చేస్తుంది. సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్, ఆర్టీసీ సంయుక్తంగా కార్డు రూపకల్పన చేస్తున్నట్లు సమాచారం. త్వరలోనే సీఎం ఆమోదంతో మహిళలకు పంపిణీ చేయనున్నట్లు సమాచారం. దీంతో మహిళలు ఎక్కడి నుంచి ఎక్కడివరకు ప్రయాణం చేశారు. ఏ రూట్లలో ప్రయాణికుల రద్దీ ఉంది అనే వివరాలను సైతం తెలుసుకోనున్నారు. అందుకు అనుగుణంగా బస్సు సర్వీసులు కూడా నడుపనున్నట్లు తెలిసింది.
సులభతరం చేసేందుకు చిప్ స్మార్టుకార్డులు!
తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలులోకి వచ్చిన తర్వాత ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలలో ఒకటి మహాలక్ష్మి పథకం. ఈ పథకంతో మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తుంది. దీనిని మరింత పాదర్శకంగా సులభతరం చేసేందుకు చిప్ తో కూడిన స్మార్టుకార్డులు అందజేసేందుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ప్రస్తుతం బస్సుల్లో ఆధార్ కార్డు ఉన్నవారిని జీరో టికెట్ ఇస్తూ ఉచిత ప్రయాణం కల్పిస్తుంది. అయితే ఆధార్ కార్డుతో కాకుండా ఈ స్మార్టు కార్డుతో సులభం అవుతుందని రవాణాశాఖ భావిస్తోంది. టికెట్ మిషన్ లో ఈ కార్డును పెడితే వారి వివరాలు సైతం డిసప్లే కానున్నట్లు సమాచారం. దీని ఆధారంగా సంబంధిత కండక్టర్ టికెట్ ఇవ్వడం కూడా సులభతరం అవుతుందని అధికారులు పేర్కొంటున్నారు.
Also Read:Indira Mahila Shakti: మహిళా శక్తిని గుర్తించింది కాంగ్రేస్ ప్రభుత్వమే
ఆధార్ లో లింకు
ఆర్టీసీ సంస్థ సీజీజీ(సెంటర్ ఫర్ గుడ్ గవర్నెస్)తో సంయుక్తంగా ఈ చిప్ కార్డుతో కూడిన స్మార్టు కార్డు రూపకల్పన చేస్తుంది. సాంకేతిక రంగంలో సీజీజీ పెద్దది కావడంతో ఆర్టీసీఈ కార్డు తయారీ బాధ్యత అప్పగించినట్లు అధికారులు తెలిపారు. ఈ కార్డును ఆధార్ కార్డుతో నమోదు చేయబోతున్నారు. దీంతో ఆ చిప్ కార్డును టికెట్ మిషన్ లో పెట్టగానే సంబంధిత మహిళ పేరు తోపాటు ఫొటో, గ్రామం, మండలం, జిల్లా, పిన్ కోడ్ వివరాలు అన్ని డిస్ ప్లే కానున్నాయి. కానీ కార్డుకు మాత్రం కేవలం నెంబర్ తో కూడిన చిప్ మాత్రమే ఉంటుంది. ఆ కార్డుపై ఫొటో ఉండదని సమాచారం.
క్యూ ఆర్ కోడ్ తో కూడిన కార్డుసైతం పరిశీలన
మహాలక్ష్మి పథకం మహిళలకు స్మార్టు కార్డును ఇవ్వాలని భావించిన ఆర్టీసీ, తొలుత క్యూర్ ఆర్ కోడ్ తో కూడిన కార్డు ఇస్తే ఎలా ఉంటుందని పరిశీలించింది. అయితే బస్సుల్లో రాత్రి వెళ్లల్లో, సాయంత్రం వెళల్లో క్యూఆర్ కోడ్ సరిగ్గా పనిచేయకపోతే ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని.. కండాక్టర్ కు మహిళలకు మధ్య పంచాయతీ వచ్చే అవకాశం ఉందని భావించిన అధికారులు క్యూఆర్ కోడ్ స్థానంలో చిప్ తోనే స్మార్టు కార్డు ఇస్తే బాగుంటుందని నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.
ఇక సీఎం గ్రీన్ సిగ్నలే తరువాయి
ఇప్పటికే చిప్ తో కూడిన స్మార్టు కార్డు కొలిక్కి వచ్చినట్లు సమాచారం. కార్డు నమూనా తయారు చేశారు. త్వరలోనే సీఎంరేవంత్ రెడ్డికి కార్డును చూపించి ఆమోదం పొందిన తర్వాత పంపిణీకి శ్రీకారం చుట్టనున్నట్లు సమాచారం. ఈ స్మార్ట్ కార్డులు రాష్ట్రంలో మహిళలందరికీ అందజేయనున్నారు. కార్డు వెనుక భాగంలో నిబంధనలు ఉంటాయి. లోపల ఉండే చిప్ ద్వారా కండక్టర్ వద్ద ఉండే యంత్రంతో స్కాన్ చేయగానే ప్రయాణ వివరాలు నమోదవుతాయి. ఈ కార్డుల తయారీ, పంపిణీ కోసం సుమారు 100 కోట్ల నిధులు అవసరం అవుతాయని అధికారులు అంచనా వేసినట్లు సమాచారం. లబ్ధిదారుల గుర్తింపు కోసం ఇటీవల ప్రభుత్వం చేపట్టిన ‘సమగ్ర కుటుంబ సర్వే’ వివరాలను ప్రామాణికంగా తీసుకుంటారని సమాచారం.
రద్దీ మార్గాల గుర్తింపు సులభం
ఈ చిప్ కార్డులతో మహిళలు ఎక్కడి నుంచి ఎక్కడికి ఎక్కువగా ప్రయాణాలు చేస్తున్నారనేది కంప్యూటర్ ద్వారా ప్రతి రోజూలు వివరాలు నమోదు అవుతున్నాయి. ఏయే ప్రాంతాలకు ప్రయాణికుల రద్దీ ఉంటుందనేది కూడా స్పష్టమవుతుంది. మహిళల ప్రయాణ వివరాలు సైతం తెలుసుకోవచ్చు. అంతేకాదు రద్దీ రూట్లను గుర్తించి బస్సుల సంఖ్య పెంచే అవకాశం ఉంటుందని అధికారులు తెలిపారు. రద్దీ లేని రూట్లలో మాత్రం బస్సు సర్వీసుల్లో కోతపెట్టే అవకాశం ఉంది. ఏది ఏమైనప్పటికీ చిప్ తో కూడిన స్మార్టుకార్డులు మహిళల ప్రయాణాన్ని మాత్రం సులభతరం చేయనున్నాయి.
Also Read:Auto Drivers: ఆటో డ్రైవర్లపై మొసలి కన్నీరు?.. గతంలో తప్పులు చేసి విమర్శలా అంటూ కాంగ్రెస్ మండిపాటు!

