Duddilla Sridhar Babu: దేశంలోనే పారిశ్రామికాభివృద్ధిలో ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్‌గా నిలుస్తున్న తెలంగాణలో మరిన్ని పెట్టుబడులు పెట్టాలని ఆస్ట్రేలియా కంపెనీ ‘ఒరికా’ ప్రతినిధులను మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు (Duddilla Sridhar Babu) కోరారు. ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా బుధవారం మెల్‌బోర్న్‌లో ఆ సంస్థ సీఈఓ, ఎండీ సంజీవ్ గాంధీ, ఇతర ప్రతినిధులతో ఆయన ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, ఇన్నోవేషన్, టెక్నాలజీ హబ్‌లను ఏర్పాటు చేసేందుకు అంతర్జాతీయ దిగ్గజ సంస్థలు తెలంగాణ వైపు చూస్తున్నాయని తెలిపారు. జీసీసీలు, పరిశ్రమల ఏర్పాటుకు రాష్ట్రం అత్యంత అనుకూలం అన్నారు.
Also Read: Duddilla Sridhar Babu: లైఫ్ సైన్సెస్ రంగంలో.. రూ.54 వేల కోట్ల పెట్టుబడులు
ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలు
ప్రగతిశీల విధానాలు, ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలు, సమర్థవంతమైన నాయకత్వం ఇక్కడ అందుబాటులో ఉందని వివరించారు. ఇండస్ట్రియల్ ఇన్నోవేషన్, సస్టెయినబిలిటీ, మ్యానుఫ్యాక్చరింగ్, మైనింగ్ రంగాల్లో డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ కోసం తెలంగాణతో కలిసి పనిచేసేందుకు ముందుకు రావాలని ఆయన ఆహ్వానించారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో నిర్వహిస్తున్న జీసీసీలో 600 మంది హైస్కిల్డ్ నిపుణులకు ఉద్యోగాలు కల్పించామని, రాబోయే రోజుల్లో ఈ సంఖ్య మరింత పెరుగుతుందని, తెలంగాణలో కార్యకలాపాల విస్తరణ, వివిధ రంగాల్లో రాష్ట్ర ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నామని ఒరికా సంస్థ ఎండీ సంజీవ్ గాంధీ ఈ సందర్భంగా మంత్రికి తెలిపారు.
ఆర్ఎంఐటీతో ఒప్పందం
అంతర్జాతీయ భాగస్వామ్యాల ద్వారా తెలంగాణను ‘గ్లోబల్ ఇన్నోవేషన్ హబ్’గా మార్చాలన్నదే తమ ప్రభుత్వ సంకల్పమని మంత్రి స్పష్టం చేశారు. మెల్‌బోర్న్‌లో బుధవారం ఆస్ట్రేలియాకు చెందిన ప్రతిష్టాత్మక ‘ఆర్ఎంఐటీ’ యూనివర్సిటీతో రాష్ట్ర ప్రభుత్వం లెటర్ ఆఫ్ ఇంటెంట్ (ఎల్‌వోఐ) ను కుదుర్చుకుంది. లైఫ్ సైన్సెస్ రంగంలో ఇన్నోవేషన్, పరిశోధన, అభివృద్ధి, ఉన్నత విద్య, పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా రెడీ టూ వర్క్ ఫోర్స్ తయారీ తదితర అంశాల్లో ద్వైపాక్షిక సహకారానికి ఈ ఒప్పందం దోహదపడుతుందన్నారు.
పరిశోధక విద్యార్థులు బిట్స్ హైదరాబాద్, ఆర్ఎంఐటీ యూనివర్సిటీలలో నిపుణుల మార్గనిర్దేశంలో రీసెర్చ్ చేసే అవకాశం లభిస్తుందన్నారు. పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా ఉమ్మడి అకడమిక్ కరిక్యులంను రూపొందించి విద్యార్థులను రేపటి అవసరాలకు అనుగుణంగా స్కిల్డ్ వర్క్‌ఫోర్స్‌గా తయారు చేస్తామని మంత్రి వివరించారు. తెలంగాణ లైఫ్ సైన్సెస్ ఫౌండేషన్ సీఈఓ శక్తి నాగప్పన్, ఆర్ఎంఐటీ యూనివర్సిటీ డిప్యూటీ వైస్-ఛాన్సలర్ ప్రొఫెసర్ కేథరీన్ ఇట్సియోపౌలోస్ ఈ ఒప్పంద పత్రంపై సంతకాలు చేశారు.
Also Read: Minister Sridhar Babu: దివ్యాంగుల సంక్షేమానికి అన్ని విధాల కృషి.. మంత్రి శ్రీధర్ బాబు
