Eagle Delhi Operation: రాష్ట్రంలో మాదక ద్రవ్యాల (డ్రగ్స్) నిర్మూలన, గంజాయి సాగు, అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకోవడమే లక్ష్యంగా తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక విభాగం ‘ఈగల్’ టీమ్ చురుకుగా పనిచేస్తోంది. రాష్ట్రంలో కీలక ఆపరేషన్లతో దూసుకుపోతున్న ఈ టీమ్, తాజాగా దేశరాజధాని ఢిల్లీలో భారీ ఆపరేషన్ (Eagle Delhi Operation) చేపట్టింది.
ఈగల్ చీఫ్ సందీప్ శాండిల్య (Sandeep Sandilya) స్వయంగా రంగంలోకి దిగి, ఏకంగా 100 మంది టీమ్‌తో ఈ ఆపరేషన్ చేపట్టారు. 50 మంది నైజీరియన్లను అరెస్ట్ చేశారు. వీరివద్ద లభించిన కేజీకిపైగా డ్రగ్స్‌ను సీజ్ చేశారు. పట్టుబడిన నైజీరియన్లు దేశంలోని పలు రాష్టాలకు డ్రగ్ సరఫరా చేస్తున్నట్టు గుర్తించారు. అరెస్ట్ చేసినవారందరిని ట్రాన్సిట్ వారెంట్‌పై హైదరాబాద్ తరలించారు. కాగా, అరెస్టైన నైజీరియన్లతో సంబంధాలు ఉన్న ఇద్దరు నైజీరియన్ మహిళలను కూడా విశాఖపట్నంలో ఈగల్ టీమ్ అరెస్ట్ చేసింది. కాగా, ఢిల్లీ పోలీసులతో కలిసి ఈ ఆపరేషన్ చేశారు. ఇందుకోసం గత నెల నుంచి నిఘా కొనసాగించారు.
కాగా, తెలంగాణ ఈగల్’ పోలీసులు అంతర్రాష్ట్ర డ్రగ్ ముఠాల పనిపట్టడంలో నిమగ్నమయ్యారు. ఇదివరకే ఢిల్లీ, రాజస్థాన్, ముంబై, గోవా, గుజరాత్‌లో దాడులు నిర్వహించి పదుల సంఖ్యలో డ్రగ్ పెడ్లర్లను అరెస్ట్ చేశారు. పలువురు హవాలా ఏజెంట్లను కూడా అదుపులోకి తీసుకున్నారు.
ఈగల్ టీమ్ దూకుడు
కాగా, తెలంగాణను మాదక ద్రవ్యాల రహిత రాష్ట్రంగా మార్చేందుకు తెలంగాణ ఈగల్ టీమ్ కృషి చేస్తోంది. ముఖ్యంగా డ్రగ్స్ బారినపడి యువత తమ జీవితాలను నాశనం చేసుకోకుండా రక్షించేందుకు కృషి చేస్తోంది. వారి భవిష్యత్తును కాపాడే ప్రయత్నం చేస్తోంది. రాష్ట్రంలో డ్రగ్స్ అమ్మినా, కొనుగోలు చేసినా, అక్రమ వ్యాపారాలలో పాల్గొన్నవారిపై కఠిన చర్యలు తీసుకుంటోంది. మరోవైపు, విద్యార్థులు, యువత, సాధారణ ప్రజలలో మాదక ద్రవ్యాల హానికర ప్రభావాలపై విస్తృతంగా అవగాహన కల్పిస్తోంది. ఇక, ఈగల్ టీమ్ తెలంగాణ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో (TGNAB) కింద పనిచేస్తుంది. అంతర్జాతీయ మాదక ద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఈ ప్రత్యేక ఎలైట్ వ్యవస్థను ప్రకటించారు.
Read Also- Aadhaar Deactivation: 2 కోట్లకు పైగా మృతుల ఆధార్ నంబర్లు డీయాక్టివేట్.. ఇవి వేరేవారికి కేటాయిస్తారా?

