Tourist police: పర్యాటకుల భద్రతకు పెద్దపీట
80 మందిని నియమించిన ప్రభుత్వం
సోమవారం నుంచి అందుబాటులోకి రానున్న పర్యాటక పోలీసులు
తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: రాష్ట్ర ప్రభుత్వం పర్యాటకుల భద్రతకు పెద్దపీట వేస్తున్నది. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ప్రముఖ ప్రదేశాల్లో విధులు నిర్వహించేలా 80 మంది టూరిస్ట్ పోలీసులను (Tourist police) నియమించనున్నది. రాష్ట్రంలో తొలిసారిగా పర్యాటక ప్రాంతాల్లో టూరిస్ట్ పోలీసులను అందుబాటులోకి తీసుకొస్తుండగా.. ఈ నెల 13 నుంచి (సోమవారం) వీరు తమకు కేటాయించిన ప్రదేశాల్లో విధుల్లో చేరనున్నారు. ఇప్పటికే వీరికి మాదాపూర్‌లోని నిథమ్ ఇనిస్టిట్యూట్‌లో మూడు రోజులపాటు ‘ఓరియంటేషన్ సెన్సిటైజేషన్’ శిక్షణ ఇచ్చారు. అదేవిధంగా శుక్ర, శనివారాలు యాదగిరి గుట్ట, భువనగిరి కోట, గోల్కొండ కోట, కుతుబ్ షాహీ సమాధులు, లుంబినీ పార్క్ వంటి సందర్శక ప్రాంతాల్లోనూ ఫీల్డ్ విజిట్లు నిర్వహించారు. మన రాష్ట్రానికి వచ్చే పర్యాటకులకు రక్షణ కల్పించేలా పలు అంశాలపై ట్రైనింగ్ఇచ్చారు. సాఫ్ట్ స్కిల్స్, పర్యాటకుల సౌకర్యాలు, పబ్లిక్ గైడెన్స్, క్రౌడ్ మేనేజ్‌మెంట్, ఎమర్జెన్సీ ప్రిపేర్డ్‌నెస్, కమ్యూనికేషన్, ఎథిక్స్, సైబర్ అవేర్‌నెస్ వంటి అంశాలపై వివరించారు.
Read Also- Viral news: అమ్మకు యాక్సిడెంట్ అయ్యి.. వర్క్‌ఫ్రమ్ హోం కోరిన ఉద్యోగి.. తర్వాత జరిగిందిదీ
80 మంది టూరిస్ట్ పోలీసులకు విధులు కేటాయింపు
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ప్రముఖ పర్యాటక ప్రదేశాల్లో 80 టూరిస్ట్ పోలీసులు విధులు నిర్వర్తించనున్నారు. ఎవరెవరు ఎక్కడ విధులు నిర్వహించాలనే వివరాలను వారికి తెలియజేశారు. రాష్ట్రంలోని ప్రముఖ ప్రదేశాలైన యాదాద్రి లక్ష్మీనరసింహ స్వామి దేవస్థానం, పోచంపల్లి రూరల్ టూరిజం డెస్టినేషన్, భువనగిరి కోట, కీసరగుట్టలోని రామలింగేశ్వర స్వామి దేవాలయం (కీసర), సాలార్ జంగ్ మ్యూజియం, చార్మినార్, గోల్కొడ కోట, అనంత పద్మనాభ స్వామి దేవాలయం, వికారాబాద్ జిల్లాలోని అనంతగిరి హిల్స్, కోటపల్లి రిజర్వాయర్, భద్రాచలంలోని సీతారామచంద్ర స్వామి దేవాలయం, పర్ణశాల, కిన్నెరసాని డ్యామ్, ములుగుజిల్లాలోని రామప్ప దేవాలయం, లక్నవరం సరస్సు, మేడారం సమ్మక్క– సారక్క దేవాలయం, నల్గొండ జిల్లాలోని బుద్ధవనం, పెద్దవూరలోని నార్త్ విజయపురి ప్రాజెక్టు, పానగల్‌లోని ఛాయా సోమేశ్వర స్వామి దేవాలయం, చెరువుగట్టలోని పార్వతి జడల రామలింగేశ్వర స్వామి ఆలయం, నాగర్‌కర్నూల్ జిల్లాలోని అమ్రాబాద్, సోమశిల దేవాలయంలో టూరిస్ట్ పోలీసులు అందుబాటులో ఉంటారు.
Read Also- BC Reservation: బీసీ రిజర్వేషన్లపై సీఎం రేవంత్ రెడ్డికి నేతలు ఇచ్చిన సలహా ఇదే!
