Child Protection Wing: తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరోకు చెందిన చైల్డ్ ప్రొటెక్షన్ వింగ్ అధికారులు ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించి, చైల్డ్ పోర్నోగ్రఫీ వీడియోలను వివిధ ప్లాట్‌ఫారమ్‌లలో అప్‌లోడ్ చేస్తున్న 15 మందిని అరెస్ట్ చేశారు. నిందితుల్లో 19 నుంచి 50 ఏళ్ల వయస్సుల వారు ఉన్నారు. ఈ వివరాలను తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖా గోయల్ (ShikhaGoel) మీడియా సమావేశంలో వెల్లడించారు. వాట్సాప్ గ్రూపులతో పాటు వివిధ ప్లాట్‌ఫారమ్‌లలో చైల్డ్ పోర్నోగ్రఫీకి సంబంధించిన వీడియోల సర్క్యులేషన్ ఇటీవలి కాలంలో పెరిగింది. దీనిని అరికట్టేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Revanth Reddy) ఫిబ్రవరిలో(Child Protection Unit) చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్‌ను ప్రారంభించారు.
ప్రత్యేక దృష్టి
అప్పటి నుంచి ఈ యూనిట్ సిబ్బంది చైల్డ్ పోర్నోగ్రఫీ డిజిటల్ సర్క్యులేషన్‌పై ప్రత్యేక దృష్టి సారించారు. సైబర్ టిప్‌లైన్స్ నుంచి సమాచారాన్ని సేకరించడంతో పాటు, అత్యాచారం, సామూహిక అఘాయిత్యం వంటి నేరాలకు సంబంధించిన వివరాలను ఎన్‌సీఆర్‌పీ పోర్టల్, నేషనల్ సెంటర్ ఫర్ మిస్సింగ్ అండ్ ఎక్స్‌ప్లాయిటెడ్ చిల్డ్రన్ పోర్టల్ నుంచి సేకరించారు. చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ అధికారులు వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లతో పాటు డార్క్, డీప్ వెబ్ ద్వారా సైబర్ పెట్రోలింగ్ నిర్వహించారు.
Also Read: UK Ex PM Tony Blair Praises: రేవంత్ రెడ్డి విజన్ భేష్.. యూకే మాజీ పీఎం ప్రశంసలు!
15 మందిని అరెస్ట్
ఈ క్రమంలో, నాలుగు నెలల్లో మొత్తం 294 కేసులు నమోదు చేసి 110 మందిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన వారిలో కొందరు తిరిగి అవే నేరాలకు పాల్పడుతుండటంతో, హైదరాబాద్, (Hyderabad) యాదగిరిగుట్ట, కరీంనగర్, వరంగల్, జగిత్యాల, జగద్గిరిగుట్ట ప్రాంతాల్లో ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించారు. ఈ ఆపరేషన్‌లో మొత్తం 15 మందిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన నిందితులు 6 నుంచి 14 సంవత్సరాల మధ్య వయస్సున్న బాలబాలికల అశ్లీల వీడియోలను వివిధ ప్లాట్‌ఫారమ్‌లలో షేర్ చేస్తున్నట్లు వెల్లడైంది. అరెస్ట్ చేసిన నిందితులందరినీ కోర్టులో హాజరుపరిచి జైలుకు రిమాండ్ చేశారు. ఆయా కేసుల్లో విచారణ కొనసాగుతుందని తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో డైరెక్టర్ శిఖా గోయల్ (ShikhaGoel) తెలిపారు. స్పెషల్ ఆపరేషన్ నిర్వహించిన ఎస్పీ హర్షవర్ధన్, డీఎస్పీలు ఎన్ వాసు, కేవీ సూర్యప్రకాశ్, కేవీఎం ప్రసాద్, వై వెంకటేశ్వర్లు, (Narasimha Reddy) నర్సింహా రెడ్డిలను డైరెక్టర్ అభినందించారు.
ప్రజలకు విజ్ఞప్తి..
చైల్డ్ పోర్నోగ్రఫీకి సంబంధించి ఎలాంటి సమాచారం ఉన్నా www.cybercrime.gov.in వెబ్‌సైట్ లేదా 1930 నంబర్‌కు ఫోన్ చేసి తెలియజేయాలని పోలీసులు కోరారు. ఉద్దేశ్యపూర్వకంగా లేదా యథాలాపంగా ఇలాంటి వీడియోలను ఏదైనా ప్లాట్‌ఫారమ్‌లలో అప్‌లోడ్ చేస్తే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. తల్లిదండ్రులు తమ పిల్లలు ఇంటర్నెట్‌ను ఎలా వినియోగిస్తున్నారనే దానిపై నిఘా ఉంచాలని సూచించారు. పోర్న్ వెబ్‌సైట్లు చూడకుండా ప్రైవసీ సెట్టింగ్‌లను యాక్టివేట్ చేయాలని, పేరెంటల్ టూల్స్‌ను ఉపయోగించుకోవాలని తెలిపారు.
Also Read: CM Revanth Reddy: హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2 మంజూరు చేయండి!