Telangana global summit: పునరుత్పాదక రంగంలో రూ.1,08,850 కోట్ల పెట్టుబడులకు ఎంవోయూలు
2030 నాటికి హైదరాబాద్‌లో దేశంలోనే అతిపెద్ద ఎలక్ట్రిక్ బస్సుల వ్యవస్థ
అదనంగా మరో 20 గిగావాట్ల పునరుత్పాదక ఇంధనం అవసరం
2047 నాటికి 1.39 లక్షల మెగావాట్ల విద్యుత్ కావాలి
ప్రత్యక్షంగా, పరోక్షంగా దాదాపు 1,52,350 మందికి ఉపాధి
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌లో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ : విద్యుత్‌కు సంబంధించిన పరిణామ క్రమం, పర్యావరణ హిత ఇంధనం అన్న విషయాలకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. ఆ దిశగా ఇప్పటికే తాము కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నామని పేర్కొన్నారు. పర్యావరణ హిత వాహనాల(స్వచ్ఛమైన రవాణా) వైపు వంద శాతం మారుతున్నట్లు భట్టి స్పష్టంచేశారు. 2030 నాటికి హైదరాబాద్‌లో భారతదేశంలోనే అతిపెద్ద ‘ఎలక్ట్రిక్ బస్సుల’ వ్యవస్థను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు వివరించారు. హైదరాబాద్ లో సోమవారం నిర్వహించిన గ్లోబల్ సమ్మిట్‌లో (Telangana global summit) ఉప ముఖ్యమంత్రి భట్టి పాల్గొని మాట్లాడారు. ఇప్పటికే ఉన్న 11.4 గిగావాట్ల పునరుత్పాదక ఇంధనానికి అదనంగా మరో 20 గిగావాట్ల ఇంధన శక్తిని తయారుచేయాలని ప్రణాళికలు రచించినట్లు వివరించారు. దీంతో పాటు నగరాల్లో పచ్చదనం నింపి ఆహ్లాదకర వాతావరణం సృష్టించడం, అడవులు పెంచడం, కాలుష్యం లేని పరిశ్రమలు పెట్టడం తమ ముఖ్యమైన ప్రణాళికగా పేర్కొన్నారు. తెలంగాణ భవిష్యత్ ఇంధనం.. గ్రీన్ ఎనర్జీయేనని వివరించారు. 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక శక్తిగా ఎదగడం తమ లక్ష్యంగా చెప్పుకొచ్చారు. భారత స్థూల జాతీయ ఉత్పత్తిలో(జీడీపీ) 10 శాతం వాటా తెలంగాణా నుంచే రావాలన్నది తమ ఆశయంగా భట్టి స్పష్టంచేశారు. విద్యుత్.. తమ దార్శనైక్యతలో ఓ అవిభాజ్యం భాగమని, తమ సంకల్పానికి ఇది గుండెకాయ వంటిదని కొనియాడారు. పరిశ్రమలు రావాలన్నా, ఉద్యోగాలు పెరగాలన్నా, వ్యవసాయాభివృద్ధి జరగాలన్నా విద్యుత్ చాలా ముఖ్యమని వివరించారు.
Read Also- Suryapet Police: సూర్యాపేటలో నకిలీ బంగారం ముఠా అరెస్ట్.. 12 లక్షల మోసం బట్టబయలు!
విద్యుత్ రంగంలో ఇప్పటికే చాలా సాధించామని, ఇంకా చేయాల్సింది చాలా ఉందన్నారు. తెలంగాణ ఇప్పుడు 24 గంటలు కరెంట్ ఇస్తోందని, విద్యుత్ వినియోగానికి సంబంధించి తలసరి వాడకంలో దేశంలోని అగ్ర స్థానాల్లో ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ కూడా ఒకటని వివరించాఉ. తాము నిర్దేశించుకున్న అభివృద్ధి లక్ష్యాలు చేరుకోవాలంటే.., 2047 నాటికి చాలా ఎక్కువ విద్యుత్ కావాల్సి వస్తుందని, 2047 నాటికి 1.39 లక్షల మెగావాట్ల విద్ద్యుత్ అవసరమవుతుందని ఉప ముఖ్యమంత్రి భట్టి వివరించారు. ఇంత కరెంట్‌ను సాధారణ పద్ధతుల్లో ఇవ్వడం కుదరదని, మరింత సౌర విద్యుత్, బ్యాటరీ నిల్వ వ్యవస్థలు, అవసరాన్ని బట్టి మారే థర్మల్ ప్లాంట్లు, బలమైన కరెంట్ గ్రిడ్లు, ఆధునిక డిజిటల్ పంపిణీ వ్యవస్థలు కావాలన్నారు. వీటన్నిటికీ సరిపడా డబ్బు కూడా కావాలని డిప్యూటీ సీఎం భట్టి తెలిపారు. ప్రభుత్వం స్వయంగా డబ్బు సమకూర్చడం తో పాటు, గ్రీన్ బాండ్లు, ప్రత్యేక లోన్లు, ఇతర ప్రపంచ సంస్థల నుంచి నిధులు సమీకరించే అవకాశాలను పరిశీలిస్తామని భట్టి స్పష్టంచేశారు. తెలంగాణ ప్రధానంగా బొగ్గు ఉత్పత్తి చేసే రాష్ట్రమని, దేశంలో జరుగుతున్న బొగ్గు ఉత్పత్తిలో 7 శాతం తెలంగాణ నుంచే వస్తోందన్నారు. గోదావరి నదికి ఆనుకుని ఉన్న జిల్లాల్లో బొగ్గుప్లాంట్లు, ఫ్లై యాష్ పరిశ్రమలు, బొగ్గు ఆధారిత ఎంఎస్ఎంఈలు ఉన్నాయని, పర్యావరణ హిత ఇంధన పరిణామ క్రమంలో ఈ ప్రాంత భౌగోళికత, అవసరాలను దృష్టిలో ఉంచుకోవాలని పేర్కొన్నారు. తెలంగాణ విద్యుత్ వ్యవస్థను సమూలంగా మార్చే ఆలోచనల విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని భట్టి వ్యాఖ్యానించారు. ధైర్యం, ప్రణాళిక, పెట్టుబడి, సమన్వయం మేళవించి తాము సరికొత్త చరిత్ర లిఖించడానికి సిద్ధంగా ఉన్నట్లు ఉప ముఖ్యమంత్రి భట్టి చెప్పారు.
పునరుత్పాదక రంగంలో రూ.1,08,850 కోట్ల పెట్టుబడులకు ఎంవోయూ
గ్లోబల్ సమ్మిట్ లో భాగంగా తెలంగాణలో పెట్టుబడుల ప్రవాహం కొనసాగింది. 14 కంపెనీలు పునరుత్పాదక ఇంధన ఉత్పత్తి రంగంలో పెట్టుబడులకు ముందుకు వచ్చాయి. కాగా ప్రభుత్వంతో ఎంవోయూ సైతం కుదిరింది. దాదాపు రూ.1,08,850 కోట్ల పెట్టుబడులకు ఒప్పందం కుదిరింది. ఈ పరిశ్రమలు అందుబాటులోకి వస్తే ప్రత్యక్షంగా, పరోక్షంగా దాదాపు 1,52,350 మందికి ఉపాధి దొరికే అవకాశాలున్నాయి.
ప్రైవేట్ డెవలపర్స్ ఎస్టాబ్లిషింగ్ పీఎస్పీల వివరాలు
రాష్ట్రంలో పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్ట్స్ లో భాగంగా విద్యుత్ ఉత్పత్తికి ప్రైవేట్ డెవలపర్స్ సైతం ఆసక్తికనబరుస్తున్నారు. గ్లోబల్ సమ్మిట్ లో భాగంగా పెట్టుబడులు పెట్టేందుకు 5 కంపెనీలు ముందుకు వచ్చాయి. తెలంగాణలోని 5 ప్రాంతాల్లో 7460 మెగావాట్ల ఉత్పత్తికి ఏకాభిప్రాయం కుదిరింది. కాగా ఇందుకు రూ.45,650 కోట్ల వ్యయం కానుంది.

