Telangana News: సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర మంత్రివర్గం పలు కీలక, చారిత్రక నిర్ణయాలు తీసుకున్నది. రాష్ట్రవ్యాప్తంగా బీసీలకు పార్టీ పరంగా 42 శాతం రిజర్వేషన్లు ఇస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకున్నది. అలాగే, గ్రామాల్లో పాలన వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యం అవుతున్న నేపథ్యంలో, డిసెంబరులోనే పంచాయతీ ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయించింది. మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, అడ్లూరి లక్ష్మణ్, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ మీడియాకు వివరాలు వెల్లడించారు. వచ్చే నెల 1 నుంచి 9 వరకు నిర్వహించనున్న ప్రజా పాలన వారోత్సవాలు పూర్తయిన వెంటనే సర్పంచ్ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది. 15వ ఆర్థిక సంఘం నిధులు (దాదాపు రూ.3 వేల కోట్లు) కోల్పోకుండా ఉండేందుకు, ఈ ఏడాది డిసెంబరులోనే పంచాయతీ ఎన్నికలు పూర్తి చేసేందుకు కసరత్తు ప్రారంభించాలని మంత్రివర్గం అధికారులను ఆదేశించింది.
తీర్పులు కొలిక్కి వచ్చాక..
ఇప్పటికే హైకోర్టు, సుప్రీంకోర్టు సూచనల ప్రకారం 50 శాతం రిజర్వేషన్ల పరిమితికి మించకుండా ఎన్నికలకు వెళ్లాల్సి ఉన్నందున, డెడికేటెడ్ కమిషన్ ఇచ్చిన బీసీల 42 శాతం రిజర్వేషన్ల జాబితా ఆధారంగానే ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైందని, కానీ కోర్టు కేసులతో నిలిచిపోయిందని వారు వివరించారు. ఇప్పుడు ఎన్నికలకు వెళ్లాలంటే 50 శాతం మించకుండా రిజర్వేషన్ల జాబితాను మరోసారి డెడికేటెడ్ కమిషన్ నుంచి తెప్పించుకోవాలని కేబినెట్ తీర్మానం చేసిందని, వారం రోజుల్లో ఈ ప్రక్రియ పూర్తి చేసి కేబినెట్ ఆమోదం పొందాలని సూచించిందని తెలిపారు. అయితే, బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల అంశంపై కోర్టు తీర్పులు కొలిక్కి వచ్చాకనే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలపై తదుపరి నిర్ణయం తీసుకోవాలని కేబినెట్ నిర్ణయించింది.
గిగ్ వర్కర్ల సంక్షేమానికి..
మంత్రి వివేక్ మాట్లాడుతూ, రాష్ట్రంలోని దాదాపు 4 లక్షల మంది గిగ్, ప్లాట్‌ఫామ్ కార్మికుల సంక్షేమం, భద్రత కోసం తెలంగాణ ప్లాట్‌ఫారమ్ బేస్డ్ గిగ్ వర్కర్స్ (రిజిస్ట్రేషన్, సోషల్ సెక్యూరిటీ అండ్ వెల్ఫేర్ యాక్ట్ 2025) బిల్లుకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందని ప్రకటించారు. ఈ బిల్లు ద్వారా గిగ్ వర్కర్లకు చట్టబద్ధమైన గుర్తింపు, సామాజిక భద్రత లభిస్తాయని, వీరి సంక్షేమానికి ప్రత్యేకంగా బోర్డు ఏర్పాటు చేసి హక్కులకు రక్షణ కల్పిస్తారని వివరించారు. ఈ చట్టం గిగ్ వర్కర్ల సంక్షేమం విషయంలో జాతీయ స్థాయిలో ప్రత్యేకంగా నిలుస్తుందన్నారు.
Also Read: Miryalaguda: మిర్యాలగూడ అభివృద్ధిపై ఫోకస్.. మంత్రులు ఉత్తమ్, కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు
రాంరెడ్డి పేరు, అందెశ్రీకి గౌరవం
ఎస్ఆర్ఎస్ పీ స్టేజ్ 2 మెయిన్ కెనాల్‌కు మాజీ మంత్రి దివంగత రాంరెడ్డి దామోదర్ రెడ్డి పేరు పెట్టేందుకు కేబినెట్ ఆమోదం తెలిపిందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర గీత రచయిత అందెశ్రీ మరణంతో ఆయన కుమారుడు ఎ. దత్త సాయికి డిగ్రీ కాలేజీ అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా ఉద్యోగం కల్పించేందుకు కేబినెట్ ఆమోదం తెలిపింది. తెలంగాణ ఉద్యమంలో అందెశ్రీ పాత్రను భావితరాలకు తెలియజేసేలా రాష్ట్రంలో అందెశ్రీ స్మృతి వనం ఏర్పాటు చేయాలని, ఆయన రచించిన ‘జయ జయ హే తెలంగాణ’ గీతాన్ని పాఠశాల పాఠ్యపుస్తకాల్లో చేర్చాలని నిర్ణయించారు. ఔటర్ రింగ్ రోడ్ లోపల ఉన్న ఇండస్ట్రియల్ ల్యాండ్‌ను మల్టీ యూజ్ జోన్స్‌గా మార్చేందుకు రూపొందించిన హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్‌ఫర్మేషన్ పాలసీకి కేబినెట్ ఆమోదించింది. ప్రజా ప్రభుత్వం రెండేళ్లు పూర్తవుతున్న సందర్భంగా డిసెంబర్ 8, 9 తేదీల్లో ఫ్యూచర్ సిటీలో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025 నిర్వహణకు ఆమోదం తెలిపారు. రెండేళ్లలో ప్రజా ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలు, సాధించిన విజయాలను గ్లోబల్ సమ్మిట్ వేదికగా 8న ప్రజలకు వివరించే కార్యక్రమాలు ఉంటాయని మంత్రి తెలిపారు. డిసెంబర్ 9న తెలంగాణ రైజింగ్-2047 విజన్ డాక్యుమెంట్‌ను ఆవిష్కరించాలని నిర్ణయించారు.
5 లక్షల పరిహారం..
సౌదీ అరేబియాలో బస్సు ప్రమాదంలో మరణించిన బాధిత కుటుంబాలకు రూ.5 లక్షల పరిహారం అందించాలని కేబినెట్ నిర్ణయించింది. మంత్రి అజారుద్దీన్, ఎంఐఎం ఎమ్మెల్యేలు, మైనారిటీ విభాగానికి చెందిన ఒక అధికారితో కూడిన ప్రభుత్వ ప్రతినిధి బృందాన్ని వెంటనే సౌదీకి పంపించామన్నారు. చనిపోయినవారి మృతదేహాలను మత సంప్రదాయం ప్రకారం అక్కడే అంత్యక్రియలు చేయాలని, బాధితకుటుంబ సభ్యులను ఒక్కో కుటుంబానికి ఇద్దరిని తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు చేయాలని నిర్ణయం తీసుకున్నామని మంత్రులు మీడియాకు వెల్లడించారు.
Also Read: Gold Price Today: గుడ్ న్యూస్.. ఈ రోజు భారీగా పడిపోయిన గోల్డ్ రేట్స్?
