SSC Exams: వచ్చే ఏడాది మార్చిలో జరుగనున్న టెన్త్ పరీక్షల కోసం పాఠశాల విద్యాశాఖ పరీక్షల విభాగం విడుదల చేసిన టైమ్ టేబుల్ పూర్తిగా అశాస్త్రీయంగా ఉన్నదని, దానిని సవరించాలని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్(యూటీఎఫ్), ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు. కేవలం 7 పేపర్లు రాయడానికి దాదాపు 35 రోజుల పాటు పరీక్షల నిర్వహించడం అనాలోచిత నిర్ణయమని విమర్శించారు. ఇది విద్యార్థులు, ఉపాధ్యాయులు, పాఠశాలల ప్రయోజనాలు కాపాడడం కంటే అధికారుల వ్యక్తిగత అభిప్రాయాన్ని రుద్దినట్లుగా ఉన్నదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ టైమ్ టేబుల్ వల్ల పదో తరగతి విద్యార్థులకు ప్రయోజనం చేకూర్చడం కంటే మిగతా తరగతుల విద్యార్థులకు కలిగే నష్టం ఎక్కువ అని పేర్కొన్నారు.
విద్యాశాఖ డైరెక్టర్‌కు వినతి పత్రం
ప్రతి పరీక్షకు మధ్య ఒక రోజు విరామం ఇస్తే సరిపోతుందని, నాలుగు నుంచి ఆరు రోజులు ఇవ్వడం వల్ల విద్యార్థులకు ఆసక్తి తగ్గుతుందని అన్నారు. 35 రోజుల పాటు ఉపాధ్యాయులు, పాఠశాలలు పరీక్షల నిర్వహణలో ఉంటే మిగతా తరగతుల వార్షిక పరీక్షల నిర్వహణ ఎవరు చేపట్టాలని ప్రశ్నించారు. విద్యార్థులకు పరీక్షలపై భయం పోగొట్టి ఆసక్తిని పెంచేలా విధానాలు రూపొందిచాల్సిన బాధ్యత అధికారులపై ఉన్నదని తెలిపారు. మరోవైపు, టెన్త్ పరీక్ష షెడ్యూల్‌ను సవరించాలని విద్యాశాఖ డైరెక్టర్, పరీక్షల నియంత్రణ అధికారికి ఎస్ఎఫ్ఐ నాయకులు వినతిపత్రం అందజేశారు.
Also Read: Ananthapur Fraud: కారులో పోలీస్.. బయట దొంగ.. చివరికి అంతా హుళక్కే!
టెట్ సమస్య పరిష్కారానికి ఉమ్మడి పోరాటం
సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులకు ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) ఉత్తీర్ణత నుంచి మినహాయింపు ఇవ్వాలని, అందుకు అవసరమైన చర్యలను తక్షణమే తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ జాతీయ స్థాయిలో ఉమ్మడి పోరాటం నిర్వహించాలని అఖిల భారత స్థాయిలో ఉపాధ్యాయ సంఘాల రౌండ్ టేబుల్ సమావేశంలో నిర్ణయించారు. స్కూల్ టీచర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా(ఎస్టీఎఫ్ఐ) ఆధ్వర్యంలో న్యూఢిల్లీలోని హరికిషన్ సింగ్ సూర్జిత్ భవన్‌లో బుధవారం రౌండ్ టేబుల్ సమావేశాన్ని నిర్వహించారు. విద్యాహక్కు చట్టం అమల్లోకి వచ్చిన 15 సంవత్సరాల తర్వాత అంతకు ముందు నియామకమైన ఉపాధ్యాయులు కూడా రెండేళ్లలో టెట్ పాస్ కావాలని సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడం దురదృష్టకరమని పేర్కొన్నారు. సుప్రీం తీర్పు వచ్చి మూడు నెలలు గడుస్తున్నా, దేశవ్యాప్తంగా ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున ఆందోళనలు చేస్తున్నా, కొందరు ఎంపీలు పార్లమెంటులో ప్రస్తావించినా కేంద్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమని మండిపడ్డారు.
ఓయూకు రూ.1,000 కోట్ల కేటాయింపుపై హర్షం
ఉస్మానియా యూనివర్సిటీకి ఎస్ఎఫ్ఐ, విద్యార్థి సంఘాలు, అధ్యాపక సంఘాల పోరాట ఫలితంగానే రూ.1,000 కోట్ల కేటాయింపులు జరిగాయని ఎస్ఎఫ్ఐ నాయకులు తెలిపారు. ఉస్మానియాకు నిధులు కేటాయిస్తూ తీసుకున్న ప్రభుత్వ నిర్ణయంపై హర్షం వ్యక్తం చేశారు. ఉస్మానియాతో పాటు రాష్ట్రంలోని ఇతర యూనివర్సిటీల అభివృద్ధికి సైతం ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే, విద్యార్థుల ఫీజు బకాయిలు విడుదల చేయాలని, హాస్టళ్ల మెస్ బకాయిలు విడుదల చేయాలని, విద్యార్థి సంఘాల ఎన్నికలు నిర్వహించాలని అన్నారు.
Also Read: TG Inter Exams 2026: తెలంగాణ ఇంటర్ పరీక్షల షెడ్యూల్ 2026 విడుదల.. ఎగ్జామ్ డేట్స్ ఇవే!

