District Reorganisation: కొన్ని జిల్లాల నుంచి సర్కార్‌కు ప్రతిపాదనలు
ప్రముఖులు, పొలిటీషియన్ల పేర్లతో జాబితా
అధ్యయనం చేస్తున్న ప్రభుత్వం
తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: జిల్లాల పునర్విభజన,పేర్ల మార్పు (District Reorganisation) అంశం ప్రస్తుతం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాల్లోనూ హాట్ టాపిక్‌గా మారింది. ప్రజల మనోభావాలు, పరిపాలనా సౌలభ్యం, రాజకీయ వ్యూహాల నేపథ్యంలో ప్రభుత్వం ఈ దిశగా అడుగులు వేస్తున్నట్టు పాలక వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. తెలంగాణలో జిల్లాల పునర్విభజన ప్రక్రియ మళ్లీ తెరపైకి వచ్చింది. గత ప్రభుత్వం చేసిన 33 జిల్లాల విభజనలో లోపాలు ఉన్నాయని, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మార్పులు చేయాలని రేవంత్ రెడ్డి ప్రభుత్వం భావిస్తోంది. ఇందుకోసం ప్రత్యేకంగా ఒక కమిషన్‌ను కూడా ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లోనూ ఇటీవల కొత్తగా మార్కాపురం, పోలవరం జిల్లాల ఏర్పాటుతో జిల్లాల సంఖ్య 28కి చేరింది. దీనితో తెలంగాణలోనూ కొత్త జిల్లాలు ఏర్పడతాయని అభిప్రాయం పబ్లిక్‌లో నెలకొన్నది. అయితే, జిల్లాలు సంఖ్య తగ్గిస్తారా?, లేదా ఉన్న జిల్లాల పేర్లలో మార్పులు తీసుకొస్తారా? అనేది సస్పెన్షన్‌గా మారింది. కానీ కొన్ని జిల్లాల పేర్లు మార్చాలని ప్రతిపాదనలు ప్రభుత్వానికి అందుతున్నాయి. ప్రముఖులు, వివిధ పార్టీలకు చెందిన రాజకీయ లీడర్ల పేర్లు తెర మీదకు రావడంతో, ప్రభుత్వం ఆ పేర్లపై స్టడీ చేస్తున్నట్లు తెలిసింది. ప్రతిపాదనల్లో ఉన్న ప్రముఖుల పేర్లు, కొన్ని జిల్లాలకు స్థానిక వీరులు, జాతీయ నాయకుల పేర్లు పెట్టాలనే డిమాండ్లు ఎప్పటి నుంచో ఉన్నాయి.
Read Also- Indigo Airlines: డిసెంబర్ గందరగోళం ఎఫెక్ట్.. ఇండిగోకి భారీ జరిమానా విధించిన కేంద్ర ప్రభుత్వం
సర్కార్ పరిశీలనలో ఉన్న కొన్ని కీలక ప్రతిపాదనలు…
తెలంగాణ సాయుధ పోరాట యోధుడు భీమిరెడ్డి నరసింహారెడ్డి పేరును సూర్యాపేట జిల్లాకు పెట్టాలని బలమైన డిమాండ్ వినిపిస్తోంది. ములుగు జిల్లాకు ఆదివాసీల ఆరాధ్య దైవం సమ్మక్క-సారలమ్మ పేరు పెట్టేందుకు ప్రభుత్వం ఇప్పటికే కసరత్తు చేస్తోంది. ఇక హైదరాబాద్ సరిహద్దులుగా ఐటీ రంగానికి ఊతమిచ్చేలా గ్రేటర్ పరిధిలో కొన్ని ప్రాంతాలకు అంతర్జాతీయ స్థాయి పేర్లు (ఉదా: టాటా, గూగుల్ స్ట్రీట్ వంటివి) పెట్టాలనే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. దీనితో పాటు గతంలోనే కొందరు కాళోజీ నారాయణరావు, చాకలి ఐలమ్మ, దాశరథి, పీవీ. నరసింహారావు వంటి వారి పేర్లను వారి సొంత ప్రాంతాల్లోని జిల్లాలకు పెట్టాలని అక్కడి ప్రజలు ప్రభుత్వాన్ని కోరారు.
కమిషన్ స్టడీ.. .. క్షేత్రస్థాయి పరిశీలన
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటన ప్రకారం, హైకోర్టు లేదా సుప్రీంకోర్టు రిటైర్డ్ జడ్జి నేతృత్వంలో ఒక కమిషన్ ఏర్పాటు కానుంది.
ఈ కమిటీ ప్రతి జిల్లాలో పర్యటించి ప్రజల అభిప్రాయాలను సేకరిస్తుంది. జనాభా, భౌగోళిక విస్తీర్ణం ఆధారంగా జిల్లాలను పునర్వ్యవస్థీకరించడం దీని ప్రధాన ఉద్దేశ్యం. మరోవైపు ఉమ్మడి జిల్లాల సెంటిమెంట్‌ను గౌరవిస్తూనే, పరిపాలనను ప్రజలకు దగ్గర చేయడంపై సర్కార్ పెద్దలుదృష్టి సారించారు.
విపక్షాల విమర్శలు – ప్రజల ఆందోళన…
ఇక జిల్లాల సంఖ్యను తగ్గిస్తారనే ప్రచారంపై ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. ఇప్పటికే ప్రజలు అలవాటు పడిన జిల్లాలను మార్చడం వల్ల గందరగోళం ఏర్పడుతుందని, అభివృద్ధి కుంటుపడుతుందని బీఆర్ఎస్ నేతలు విమర్శిస్తున్నారు. ముఖ్యంగా సిద్దిపేట, సిరిసిల్ల, జనగామ వంటి జిల్లాల ఉనికిపై స్థానిక ప్రజల్లో ఉత్కంఠ నెలకొంది. ఇదిలా ఉండగా..జిల్లా పేరు మారడం అనేది కేవలం బోర్డు మార్చడం కాదు.. అది ఆ ప్రాంత అస్తిత్వానికి, చరిత్రకు చిహ్నం. మరి ప్రజల ఆకాంక్షలను గౌరవిస్తూ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాలి.

