Polavaram Project: పోలవరం.. నల్లమల సాగర ప్రాజెక్ట్ సమస్యను మధ్యవర్తిత్వం ద్వారా ఎందుకు పరిష్కరించుకోకూడదంటూ సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. ఈ దిశగా ప్రయత్నాలు చేయండి అంటూ ఇటు తెలంగాణ అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. నిబంధనలకు విరుద్ధంగా చేపట్టిన పోలవరం నల్లమల సాగర్ ప్రాజెక్ట్ పై స్టే ఇవ్వాలని అభ్యర్థిస్తూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై సోమవారం సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్(Justice Suryakant) నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపింది. ఈ సందర్భంగా ప్రాజెక్టుకు సంబంధించి మూడు పరిష్కార మార్గాలను అత్యున్నత న్యాయస్థానం సూచించింది. ప్రాజెక్టుపై సమగ్ర విచారణ కోసం సివిల్ సూట్ ఫైల్ చేయాలని పేర్కొంది. తెలంగాణ ప్రభుత్వ అభ్యర్థనలను పరిశీలించి అవసరమనుకున్న పక్షంలో ప్రాజెక్టును ఆపే నిర్ణయాధికారాన్ని కేంద్ర ప్రభుత్వ కమిటీకి ఇస్తామని వ్యాఖ్యానించింది. మధ్యవర్తిత్వం ద్వారా సమస్య పరిష్కారానికి కృషి చేయాలని సూచించింది.
కీలక వ్యాఖ్యలు..
కేసు విచారణ సందర్భంగా సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ ప్లానింగ్ దశలోనే ఉంది కదా అని అన్నారు. ఇప్పటికే దీనిపై కేంద్ర ప్రభుత్వం ఓ కమిటీని ఏర్పాటు చేసింది అంటూ తెలంగాణ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ విచారణార్హతను పరిశీలిస్తున్నామన్నారు. సివిల్ సూట్ దాఖలు చేస్తే సమగ్ర విచారణ జరపవచ్చని చెప్పారు.
Also Read: Sangareddy News: కరెన్సీపై గాంధీ బొమ్మను తొలగించే కుట్రలను తిప్పి కొట్టాలి: ఎంపీ సురేష్ శెట్కర్
ఏకపక్షంగా..
తెలంగాణ ప్రభుత్వం తరపున సీనియర్ న్యాయవాది అభిషేక్ సింఘ్వీ వాదనలు వినిపించారు. వరద జలాల పేరుతో తెలంగాణకు కేటాయించిన నీటి వాటాను సైతం తరలించుకున ప్రయత్నాన్ని ఆంధ్రప్రదేశ్ చేస్తోందని చెప్పారు. నిబంధనలకు తిలోదకాలు వదులుతూ ఈ ప్రాజెక్టును ఏకపక్షంగా నిర్మిస్తున్నారని తెలిపారు. గోదావరి జలాల్లో తెలంగాణకు 968 టీఎంసీల నీటి వాటా ఉన్నట్టు చెప్పారు. పోలవరం…నల్లమల సాగర్ ప్రాజెక్ట్ నిర్మిస్తే ఈ వాటా తగ్గిపోతుందని తెలిపారు. ఈ ప్రాజెక్టును ఆపాలని కేంద్ర జల సంఘం ఆదేశాలు ఇచ్చినా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పట్టించుకోవటం లేదన్నారు. సీడబ్ల్యుసీ ఛైర్మన్ నేతృత్వంలో ఓ కమిటీ వేశారని, అయితే…ప్రాజెక్టును ఆపే అధికారం దనికి లేదన్నారు. అందుకే ఈ అంశంలో సుప్రీం కోర్టు వెంటనే జోక్యం చేసుకుని ప్రాజెక్టుపై స్టే ఇవ్వాలని కోరారు.
ఇది రాష్ట్ర ప్రాజెక్ట్..
ఇక, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరపున న్యాయవాది ముకుల్ రోహిత్గి వాదనలు వినిపించారు. పోలవరం..నల్లమల సాగర్ ప్రాజెక్టులో ఎలాంటి నిబంధనల ఉల్లంఘన జరగటం లేదని చెప్పారు. ప్రస్తుతం ప్రాజెక్ట్ ప్లాన్ రెడీ చేసుకుంటున్నట్టు తెలిపారు. సముద్రంలో వృధాగా కలిసిపోతున్న నీళ్లను రాయలసీమకు అందించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భావిస్తున్నట్టు చెప్పారు. ఇది రాష్ట్ర ప్రాజెక్ట్ మాత్రమే అన్నారు. తప్పితే జాతీయ ప్రాజెక్ట్ కాదన్నారు. రాష్ట్ర అవసరాలపై ప్లానింగ్ చేసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుందన్నారు. కాగా, పోలవరం..నల్లమల సాగర్ ప్రాజెక్ట్ సమస్య పరిష్కారానికి సుప్రీం కోర్టు సూచించిన పరిష్కార మార్గాలపై తెలంగాణ ప్రభుత్వ నిర్ణయం తెలుసుకునేందుకు సమయం ఇవ్వాలని అభిషేక్ సింఘ్వీ కోరారు. దీనిపై స్పందించిన సుప్రీం కోర్టు విచారణను వచ్చే సోమవారానికి వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది.
Also Read: Uttam Kumar Reddy: హరీశ్ రావు చూపించిన లేఖను సీడబ్ల్యూసీ ఆమోదించలేదు : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి!

