Jaishankar Bhupalpally: జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో కురుస్తున్న వర్షాల కారణంగా మండలంలోని గొల్ల బుద్ధారం ప్రభుత్వ పాఠశాలలోకి భారీగా వరద నీరు చేరింది. దీనివల్ల విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పాఠశాల ప్రాంగణంలోకి నీరు చేరడంతో తరగతి గదులు, ఆవరణ బురదమయంగా మారాయి. పాఠశాల ఎదురుగా ఉన్న కల్వర్టులో పేరుకుపోయిన చెత్త, చెదారం, మొక్కలను గ్రామ పంచాయతీ సిబ్బంది తొలగించకపోవడం వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని స్థానికులు ఆరోపిస్తున్నారు.
Also Read: Gadwal District Collector: ఉపాధ్యాయుడిగా మారిన కలెక్టర్.. విద్యార్థులకు పాఠాలు ఉపాధ్యాయులకు సూచనలు
దీనివల్ల పాఠశాల ముందున్న కుంట నుంచి వరద నీరు నేరుగా పాఠశాలలోకి వస్తుందని, ఈ సమస్య ప్రతి సంవత్సరం పునరావృతమవుతుందని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ సమస్యపై జిల్లా కలెక్టర్ తక్షణమే స్పందించి, పాఠశాలలోకి నీరు రాకుండా శాశ్వత చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. వర్షాల వల్ల విద్యార్థుల చదువులకు ఆటంకం కలగకుండా చూడాలని, త్వరగా ఈ సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.