Mahabubabad: అధికారులు స్పందించి నాణ్యమైన భోజనం పెట్టించాలి
డిమాండ్ చేస్తున్న ఏకలవ్య పాఠశాల విద్యార్థులు, వారి తల్లిదండ్రులు
మహబూబాబాద్, స్వేచ్ఛ: మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలోని ఏకలవ్య పాఠశాలలో విద్యార్థిని, విద్యార్థులు ఆహారం విషయంలో తీవ్ర అవస్థలు పడుతున్నారు. గత కొన్ని రోజులుగా ఉప్పు కారంతోనే భోజనం చేస్తూ కడుపు నింపుకుంటున్నామని వాపోతున్నారు. దీంతో తమకు కడుపులో మంట వచ్చి నానా ఇబ్బందులకు గురవుతున్నామని ఆ విద్యార్థులు అధికారులను వేడుకుంటున్నారు. విద్యార్థులు తెలిపిన వివరాల ప్రకారం.. గత నాలుగు రోజుల నుంచి ఏకలవ్య పాఠశాలలో ఉప్పు, కారంతో భోజనం తింటున్నారు. దీంతో, కడుపులో మంటతో పిల్లలు అవస్థలు పడుతున్నారు. పాఠశాలకు కూరగాయల పంపిణీ టెండర్ అయిపోయి 15 రోజులు గడిచింది. అప్పటినుంచి నేటి వరకు కూరగాయలు తెప్పించకుండా అందుబాటులో ఉన్న వెల్లుల్లిపాయ కారంతో భోజనం పెట్టి చేతులు దులుపుకుంటున్నారు.
Read Also- Suresh Controversy: పవన్ పేషీలో అవినీతి కార్యకలాపాలంటూ వైసీపీ ఆరోపణ.. జనసేన రియాక్షన్ ఇదే
ఈ పాఠశాల అడవి ప్రాంతంలో ఉండటంతో పిల్లలు బయటకు రాలేక, ఎవరికీ చెప్పుకోలేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. శనివారం జరిగిన పేరెంట్స్ కమిటీ సమావేశంలో విద్యార్థినీి విద్యార్థుల తల్లిదండ్రులు నిలదీసినప్పటికీ పాఠశాల యాజమాన్యం మౌనంతో ఉండడం చర్చనీయాంశంగా మారింది. చివరికి ఆదివారం పేరెంట్స్ కమిటీ సభ్యులు వస్తున్నారని తెలిసి, గుడ్డుతో కూడిన భోజనం పెట్టారు. కానీ, ఆ భోజనంలో కూడా పురుగులు రావడంతో పేరెంట్స్ వాళ్లు కూడా భోజనాన్ని బయటపడేసి ఉపాధ్యాయులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read Also- Delhi Blast Probe: బాంబు పేలుడుకు ముందు ఉమర్ ఎక్కడ నివసించాడో కనిపెట్టిన ఇన్వెస్టిగేషన్ అధికారులు
ఇదిలావుంచితే, ఏకలవ్య స్కూలు ఇంగ్లీష్ మీడియం అయినప్పటికీ ఉత్తర భారతదేశం నుంచి వచ్చిన ఉపాధ్యాయులు పూర్తిగా హిందీలోనే బోధిస్తున్నారని, ఈ భాష ఈ ప్రాంత విద్యార్థులకు అర్థం కాకపోవడంతో విద్యార్థులు నానా ఇబ్బందులకు గురవుతున్నట్టు తెలుస్తోంది. గతంలో చదువులు కంటే ప్రస్తుతం బోధిస్తున్న విద్యా బోధన అర్థం కాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
