Indian Railway: తెలంగాణలో కుండపోతగా కురుస్తున్న వర్షాలకు పలు ప్రాంతాల్లో వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ముఖ్యంగా మెదక్, కామారెడ్డి జిల్లాల్లో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. ఆయా జిల్లాల్లోని చాలా వరకు ప్రాంతాలను వరద నీరు ముంచెత్తింది. రైళ్ల పట్టాల మీదకు సైతం వరద నీరు వచ్చి చేరింది. కామారెడ్డి జిల్లా తాళ్లమండ్ల సెక్షన్ లో భారీ వరద ప్రవాహం కారణంగా ట్రాక్ కింద నీరు నిలిచిపోయింది. దీంతో అటుగా వెళ్లే పలు రైళ్లను దక్షిణ మధ్య రైల్వే మళ్లించింది. ఓ రెండు రైళ్లను పాక్షికంగా రద్దు చేసింది.
ఆ రైళ్లు మళ్లింపు
అక్కన్నపేట, మెదక్ సెక్షన్ పరిధిలోని పలు రైళ్లను మళ్లించినట్లు దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) తాజాగా ప్రకటించింది. ముంబయి-లింగంపల్లి, లింగంపల్లి-ముంబయి, ఓఖా-రామేశ్వరం, భగత్ కి కోఠి – కాచిగూడ రైళ్లను డైవర్షన్ చేసినట్లు తెలిపింది. నిజామాబాద్, ఆర్మూర్, కరీంనగర్, కాజీపేట, సికింద్రాబాద్ మీదుగా అవి నడవనున్నట్లు స్పష్టం చేసింది. అలాగే ఇవాళ వెళ్లాల్సిన నిజామాబాద్ – తిరుపతి రాయలసీమ ఎక్స్ ప్రెస్ ను రద్దు చేసినట్లు సౌత్ సెంట్రల్ రైల్వే ప్రకటించింది. కాచిగూడ – మెదక్ రైలును సైతం పాక్షికంగా రద్దు చేసినట్లు రైల్వే అధికారులు వివరించారు.
Also Read: Ganesh idol: సీఎం రేవంత్ గెటప్‌లో వినాయకుడు.. తెలంగాణ రైజింగ్ పేరుతో స్పెషల్ మండపం
50 సెం.మీ వర్షపాతం
కామారెడ్డిలో అత్యధికంగా 50 సెం.మీ వర్షపాతం కురిసినట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో పలు ప్రాంతాల్లోని రోడ్లు చెరువులను తలపిస్తున్నాయి. బీపేట నుంచి కామారెడ్డి వైపు వెళ్లే రహదారిపై భారీగా వరద నీరు చేరడంతో రాకపోకలు నిలిచిపోయాయి. హౌసింగ్ బోర్డు కాలనీలో ఇళ్లలోకి నీరు చేరడంతో స్థానికులు ఇబ్బందులకు గురయ్యారు.
Also Read: Trump Tariffs Impact: భారత్‌పై 50 శాతం సుంకాల బాంబ్.. రంగాల వారీగా ప్రభావమెంత?
మెదక్ ను ముంచెత్తిన వర్షం
మరోవైపు మెదక్ జిల్లాలోను కుండపోత వర్షం కురిసింది. ఈ భారీ వర్షాల కారణంగా ఏకంగా ఓ తండానే నీట మునిగింది. వర్షాల కారణంగా రామాయంపేట పట్టణ జలదిగ్భందంలో చిక్కుకుపోయింది. పలు కాలనీలు నీట మునిగాయి. మెదక్ టౌన్ లోని సాయి నగర్, బృందావన్ కాలనీ, తారకరామ నగర్ కాలనీలోని ఇళ్లల్లోకి వరద నీరు వచ్చి చేరింది. మెదక్ జిల్లాలో కురిసిన భారీ వర్షాలపై సీఎం రేవంత్ రెడ్డి సైతం ఆరా తీశారు. కలెక్టర్ రాహుల్ రాజ్, ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావుతో ఫోన్లో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.