Phone Tapping Case: సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ అధికారులు లాజికల్ కంక్లూజన్ తో అదనపు ఛార్జీషీట్ ను రూపొందించనున్నట్టు తెలిసింది. దీని కోసమే ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో అరెస్టయిన దక్కన్ కిచెన్ హోటల్ యజమాని నందకుమార్, రాజకీయ విశ్లేషకుడు ఆరా మస్తాన్ ల నుంచి తాజాగా వాంగ్మూలాలు తీసుకున్నట్టుగా సమాచారం. అయితే, అదనపు ఛార్జీషీట్ ను కోర్టుకు సమర్పించటానికి ముందు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీశ్ రావులను కూడా విచారించాలని సిట్ అధికారులు భావిస్తున్నట్టుగా తెలిసింది.
క్రితంసారి అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పరిచిన కొన్నిరోజులకే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం వెలుగు చూసిన విషయం తెలిసిందే. ఎలాగైనా సరే ఎలక్షన్లలో విజయం దక్కించుకుని హ్యాట్రిక్ సాధించాలని బీఆర్ఎస్ లోని కొందరు కీలక నేతలే అప్పట్లో ఎస్ఐబీ ఛీఫ్ గా ఉన్న ప్రభాకర్ రావు ద్వారా ఈ బాగోతాన్ని నడిపించినట్టుగా బలమైన ఆరోపణలు వచ్చాయి. ఈ క్రమంలో ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ పై విచారణకు సిట్ ను ఏర్పాటు చేసింది. ఈ మేరకు కేసులు నమోదు చేసిన సిట్ ఎస్ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు, అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న, టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావులను అరెస్ట్ చేశారు.
అందరి నోటా
ఈ నలుగురితోపాటు ఇదే కేసులో నిందితునిగా ఉన్న ఓ ఛానల్ ఎండీ శ్రవణ్ రావును సిట్ అధికారులు గతంలో క్షుణ్నంగా విచారణ జరిపారు. దీంట్లో ప్రణీత్ రావు, భుజంగరావు, తిరుపతన్న, శ్రవణ్ రావులు అప్పట్లో ఎస్ఐబీ ఛీఫ్ గా ఉన్న ప్రభాకర్ రావు ఆదేశాలతోనే అంతా చేసినట్టు వెల్లడించారు. అయితే, ఫోన్ ట్యాపింగ్ పై కేసులు నమోదు కాగానే ప్రభాకర్ రావు అమెరికా పారిపోయాడు. అతని పాస్ పోర్టును రద్దు చేయించి..రెడ్ కార్నర్ నోటీస్ జారీకి రంగం సిద్ధం చేయటంతో ప్రభాకర్ రావు తప్పనిసరై తిరిగొచ్చారు. అయితే, రావటానికి ముందు సుప్రీం కోర్టు నుంచి మధ్యంతర రక్షణ పొందారు.
ఎన్నిమార్లు ప్రశ్నించినా
సుప్రీం కోర్టు కల్పించిన రక్షణతో వచ్చిన ప్రభాకర్ రావును సిట్ అధికారులు పలుమార్లు నోటీసులు ఇచ్చి పిలిపించి ప్రశ్నించారు. ఎన్నిరకాలుగా విచారణ జరిపినా ప్రభాకర్ రావు ఈ వ్యవహారంలో అసలు సూత్రధారులు ఎవరన్నది వెల్లడించ లేదు. నేనేం చేశానో అంతా నా పై అధికారులకు తెలుసని మాత్రమే సమాధానమిస్తూ వచ్చారు. స్వాధీనం చేసుకున్న పెన్ డ్రైవ్ లోని సమాచారాన్ని ముందు పెట్టి ప్రశ్నించినా అదే జవాబు చెప్పారు. సుప్రీం కోర్టు నుంచి పధ్నాలుగు రోజులపాటు కస్టోడియల్ విచారణకు అనుమతి తీసుకుని సిట్ కార్యాలయంలోనే ఉంచి విచారించినా ప్రభాకర్ రావు పెదవి విప్పలేదు.
లాజికల్ కంక్లూజన్
ఈ నేపథ్యంలోనే కేసుకు లాజికల్ కంక్లూజన్ ఇవ్వాలని సిట్ నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో అరెస్టయిన నందకుమార్ తోపాటు సెఫాలజిస్ట్ ఆరా మస్తాన్ నుంచి తాజాగా స్టేట్ మెంట్లు తీసుకున్నట్టుగా సమాచారం. దీనిపై ఓ అధికారితో మాట్లాడగా ఫోన్ ట్యాపింగ్ కేసులో ఈ ఇద్దరి వాంగ్మూలం కీలకమని వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ మీడియా సమావేశంలోనే నందకుమార్ మాట్లాడిన ఆడియో టేపులు వినిపించిన విషయాన్ని గుర్తు చేశారు. ఇది అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వానికి అనుకూలంగానే నందకుమార్ ఫోన్లను ట్యాప్ చేసిన విషయాన్ని స్పష్టం చేస్తోందన్నారు.
ఈ ఉదంతంలో నందకుమార్ అప్పట్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్న కెప్టెన్ రోహిత్ రెడ్డి, సింహయాజీ స్వామితో మాట్లాడిన సంభాషణల టేపులు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఎలా చేరాయన్న ప్రశ్నకు సమాధానం దొరకాల్సి ఉందన్నారు. ఇక, రాజకీయ విశ్లేషకునిగా ఉన్న ఆరా మస్తాన్ ఫోన్లను కూడా ట్యాప్ చేసినట్టు ఇప్పటికే విచారణలో నిర్ధారణ అయ్యిందన్నారు. ఎన్నికలకు ముందు ఏ పార్టీ ఎన్ని సీట్లు గెలుచుకోనుందన్న దానిపై అంచనాలు వెల్లడించిన ఆరా మస్తాన్ వేర్వేరు పార్టీలకు చెందిన నాయకులతో మాట్లాడిన సంభాషణలను ఫోన్ ట్యాపింగ్ ద్వారా రికార్డు చేసినట్టు స్పష్టమైందని చెప్పారు. ఈ ఇద్దరి ఉదంతాలను విశ్లేషిస్తే బీఆర్ఎస్ ప్రభుత్వం కోసమే ఫోన్ ట్యాపింగులు జరిగాయన్న విషయం స్పష్టమవుతోందని విశ్లేషించారు. లేనిపక్షంలో నందకుమార్, ఆరా మస్తాన్ లు మావోయిస్టులు కారని, కనీసం వారి సానుభూతిపరులు కూడా కాదంటూ వారి ఫోన్లను ఎందుకు ట్యాప్ చేయాల్సి వచ్చిందన్నారు.
ప్రస్తుత సీఎం ఫోన్ తో సహా
అప్పట్లో ప్రతిపక్ష నేతగా ఉన్న ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డితోపాటు కేంద్ర మంత్రి బండి సంజయ్, ఎంపీలు ఈటెల రాజేందర్, రఘునందన్ రావు తదితరుల ఫోన్లను కూడా ట్యాప్ చేసినట్టుగా సిట్ విచారణలో వెల్లడైందన్నారు. వీరి ఫోన్లను ట్యాప్ చేయాల్సిన అవసరం ప్రభాకర్ రావుకుగానీ…దీంట్లో కీలకంగా వ్యవహరించిన ప్రణీత్ రావుకుగానీ ఏముంటుందని ప్రశ్నించారు. దీనినిబట్టే అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వంలోని కీలక నేతల ఆదేశాల మేరకే వందల సంఖ్యలో ఫోన్ల ట్యాపింగ్ జరిగిందన్నది స్పష్టమవుతుందని వ్యాఖ్యానించారు. ఈ వివరాలతోనే అదనపు ఛార్జీషీట్ ను రూపొందించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పారు.
బీఆర్ఎస్ సుప్రీం ఆదేశాలతోనే అంతా చేశాం
కేసీఆర్ అయితే, లాజికల్ కంక్లూజన్ తో అదనపు ఛార్జీషీట్ రూపొందించటానికి ముందు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీశ్ రావులను ప్రశ్నించాలని సిట్ అధికారులు భావిస్తున్నట్టుగా సమాచారం. టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావును జరిపిన విచారణలో ఆయన నాలుగైదుసార్లు బీఆర్ఎస్ సుప్రీం ఆదేశాలతోనే అంతా చేశాం అని చెప్పినట్టుగా వార్తలొచ్చిన విషయం తెలిసిందే. ఇక, హరీశ్ రావుతో ఎందుకు మాట్లాడారని ప్రభాకర్ రావును ప్రశ్నించినపుడు మావోయిస్టుల నుంచి ఆయనకు ప్రమాదం ఉందన్న సమాచారంతోనే మాట్లాడినట్టుగా ఆయన వెల్లడించినట్టుగా తెలిసింది. ఈ నేపథ్యంలోనే కేసీఆర్, హరీశ్ రావులకు నోటీసులు ఇచ్చి వారి నుంచి వాంగ్మూలాలు సేకరించిన తరువాతే అదనపు ఛార్జీషీట్ ను తయారు చేయాలని సిట్ అధికారులు నిర్ణయించినట్టుగా తెలిసింది.
Also Read: Phone Tapping Case: నేడు సాయంత్రం సీపీతో సమావేశం కానున్న సిట్ బృందం!

