Phone Tapping Case: సూత్రధారులు ఎవరో నాకు తెలియదు..నేనేం చేశానో అప్పటి డీజీపీతోపాటు నా పై అధికారులకు తెలుసు..రివ్యూ కమిటీ అనుమతుల తరువాతే ఫోన్లను ట్యాప్ చేశాం…కస్టోడియల్ విచారణ చివరి రోజైన గురువారం ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితునిగా ఉన్న ప్రభాకర్ రావు సిట్ అధికారుల ప్రశ్నలకు ఇచ్చిన సమాధానాలివి. ఇదే కేసులో నిందితులుగా ఉన్న టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ రావు, అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న, ఓ ఛానల్ ఎండీ శ్రవణ్ రావులతో కలిపి ప్రశ్నించినా ప్రభాకర్ రావు మాత్రం కీలక అంశాలపై నోరు తెరవలేదని సమాచారం. కాగా, ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నిందితునిగా ఉన్న దక్కన్ కిచెన్ హోటల్ యజమాని నందకుమార్ ను సిట్ కార్యాలయానికి పిలిపించిన అధికారులు అతని వాంగ్మూలాన్ని నమోదు చేశారు. అదే సమయంలో ప్రభాకర్ రావు కుమారుడు నిశాంత్ రావు ఆర్థిక లావాదేవీలపై ఆరా తీశారు. ఇక, బుధవారం సాయంత్రం సిట్ బృందంలోని అధికారులు బంజారాహిల్స్ లోని ఐసీసీసీలో సిట్ ఇన్ ఛార్జ్ గా ఉన్న హైదరాబాద్ కమిషనర్ వీ.సీ.సజ్జనార్ తో సమావేశమయ్యారు. కోర్టుకు సమర్పించనున్న అదనపు ఛార్జీషీట్ లో పొందు పరచాల్సిన అంశాలపై సమాలోచనలు చేశారు.
ప్రభాకర్ రావు ద్వారా..
రెండు వారాల విచారణలో వెల్లడైన అంశాలతో సుప్రీం కోర్టుకు సమర్పించనున్న నివేదికపై కూడా చర్చించినట్టు సమాచారం. నేటితో ప్రభాకర్ రావు కస్టోడియల్ విచారణ ముగుస్తుండటంతో అతన్ని విడుదల చేయనున్నారు. రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ప్రభాకర్ రావు ప్రధాన నిందితునిగా ఉన్న విషయం తెలిసిందే. నిజానికి క్రితంసారి జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైనా సరే విజయాన్ని దక్కించుకోవాలని బీఆర్ఎస్ లోని కీలక నేతలు కొందరు ప్రభాకర్ రావు ద్వారా ప్రతిపక్ష పార్టీలకు చెందిన కీలక నేతలతోపాటు పలువురి ఫోన్లను ట్యాప్ చేయించినట్టుగా బలమైన ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే ఈ వ్యవహారంలో సూత్రధారులు ఎవరన్నది నిగ్గు తేల్చటానికి కాంగ్రెస్ ప్రభుత్వం సిట్ ను ఏర్పాటు చేసింది. ఆ తరువాత హైదరాబాద్ కమిషనర్ సజ్జనార్ నేతృత్వంలో ఐపీఎస్ అధికారులతో సిట్ ను బలోపేతం చేసింది. అదే సమయంలో విచారణకు సహకరించటం లేదని సుప్రీం కోర్టుకు తెలియచేసిన ప్రభుత్వ తరపు న్యాయవాదులు ప్రభాకర్ రావు కస్టోడియల్ విచారణకు అనుమతి తీసుకున్నారు. మొదట వారం రోజులపాటు కస్టోడియల్ విచారణకు అనుమతించిన సుప్రీం కోర్టు ఆ తరువాత దానిని మరో వారం పొడిగించింది. ఈ క్రమంలో ప్రభాకర్ రావును సిట్ పని చేస్తున్న జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లోనే ఉంచి సిట్ అధికారులు రెండు వారాలపాటు ప్రశ్నించారు.
సమాచారం ముందు పెట్టి ప్రశ్నించినా..
ఈ క్రమంలో ప్రభాకర్ రావు నుంచి స్వాధీనం చేసుకున్న పెన్ డ్రైవ్ నుంచి రికవరీ చేసిన వివరాలను ముందు పెట్టి ప్రశ్నల వర్షం కురిపించారు. ఇక, బుధవారం ఇదే కేసులో నిందితులుగా ఉన్న టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు, అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నతోపాటు ఓ ఛానల్ ఎండీ శ్రవణ్ రావును ప్రభాకర్ రావుతోపాటు కూర్చోబెట్టి విచారణ చేశారు.
Also Read: Christmas Boxoffice: ఈ క్రిస్మస్ కు విడుదలైన తెలుగు సినిమాల డే వన్ కలెక్షన్స్ ఎంతో తెలుసా?..
అవే సమాధానాలు..
ఫోన్లను ట్యాప్ చేయాలని ఎవరు ఆదేశాలు ఇచ్చారు? అన్న అంశానికి సంబంధించి ప్రశ్నించారు. ఎన్నిరకాలుగా ప్రశ్నించినా ప్రభాకర్ రావు మాత్రం నాకేం తెలియదు అని మాత్రమే జవాబు ఇచ్చినట్టుగా తెలిసింది. అప్పట్లో డీజీపీగా ఉన్న మహేందర్ రెడ్డితోపాటు రివ్యూ కమిటీలో సభ్యులుగా ఉన్న ఐఏఎస్ అధికారులు సోమేశ్ కుమార్, శాంతికుమారి తదితరులకు తానేం చేశానో అంతా తెలుసని మాత్రమే చెప్పినట్టుగా సమాచారం. ఇప్పటికే మహేందర్ రెడ్డి, సోమేశ్ కుమార్, శాంతికుమారి, సీఎంగా కేసీఆర్ ఉన్నపుడు ఆయన ఓస్డీగా ఉన్న రాజశేఖర్ రెడ్డి నుంచి సిట్ అధికారులు స్టేట్ మెంట్లు తీసుకున్న విషయం తెలిసిందే. విచారణలో వీళ్లంతా తమకు పంపించిన నెంబర్లు మావోయిస్టులు, వారి సానుభూతిపరుల అని చెప్పి అనుమతులు తీసుకున్నట్టుగా వెల్లడించినట్టు తెలిసింది. అదే విషయాన్ని ప్రస్తావిస్తూ మావోయిస్టులు, వారి సానుభూతిపరుల పేర కాంగ్రెస్, బీజేపీ పార్టీలకు చెందిన నాయకుల ఫోన్లను ఎందుకు ట్యాప్ చేశారు? అని కాస్త గట్టిగానే ప్రభాకర్ రావును అడిగినట్టు తెలియవచ్చింది. ఎవరు చెబితే ఈ పని చేశారని అడిగినట్టు సమాచారం. ఈ ప్రశ్నలకు ప్రభాకర్ రావు మౌనంగా ఉండిపోయినట్టుగా తెలిసింది.
అప్రూవర్ గా మారాలని ప్రపోజల్..
ఓ దశలో విచారణాధికారులు అప్రూవర్ గా మారాలని ప్రభాకర్ రావుకు సూచించినట్టుగా విశ్వసనీయ సమాచారం. ఫోన్ ట్యాపింగ్ లో అసలు సూత్రధారులు ఎవరన్నది వెల్లడిస్తే ముందు ముందు కేసులో సమస్యలు ఎదురు కాకుండా చూస్తామని కూడా అన్నట్టుగా తెలిసింది. అయినా, ప్రభాకర్ రావు మాత్రం పెదవి విప్పలేదని తెలియవచ్చింది. నాకు తెలిసిన అన్ని వివరాలు ఇంతకు ముందే చెప్పాను…ఇప్పుడు కూడా నా జవాబులు అవే అని అన్నట్టుగా తెలిసింది.
నందకుమార్ నుంచి వాంగ్మూలం..
ఇక, విచారణలో భాగంగా గురువారం సిట్ లో సభ్యునిగా ఉన్న ఐపీఎస్ అధికారి అంబర్ కిషోర్ ఝా ఎమ్మెల్యే కొనుగోలు కేసులో నిందితునిగా ఉన్న దక్కన్ కిచెన్ హోటల్ యజమాని నందకుమార్ నుంచి వాంగ్మూలాన్ని తీసుకున్నారు. నిజానికి ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించిన మొత్తం వ్వవహారంలో ఎమ్మెల్యేల కొనుగోలుకు సంబంధించి నమోదైన కేసులోనే పక్కా ఆధారాలు ఉన్నాయి. అప్పట్లో ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ స్వయంగా మీడియా సమావేశాన్నిపెట్టి మరీ బీజేపీ తమ పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయటానికి ప్రయత్నించినట్టుగా చెప్పారు. నందకుమార్ అప్పట్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్న కెప్టెన్ రోహిత్ రెడ్డి, సింహాయాజీ స్వామితో మాట్లాడిన ఫోన్ కాల్స్ కు సంబంధించిన ఆడియో టేపులను కూడా వినిపించారు. అప్పట్లోనే ఇది దుమారం రేపింది. ఆడియో టేపులు ఎలా బయటకు వచ్చాయన్న చర్చ జోరుగా సాగింది. అయితే, రోహిత్ రెడ్డి తాను నందకుమార్ తో మాట్లాడిన సంభాషణలను తన ఫోన్ ద్వారా రికార్డు చేసినట్టు చెప్పారు. ఇది నిజమే అనుకున్నా నందకుమార్ ఇదే కేసులో నిందితునిగా ఉన్న సింహయాజీ స్వామితో మాట్లాడిన సంభాషణల ఆడియో టేప్ ఎలా బయటకు వచ్చిందన్న దానిపై మాత్రం ఎవ్వరూ సమాధానం ఇవ్వలేదు. సిట్ అధికారులు గురువారం దాదాపు గంటన్నరపాటు జరిపిన విచారణలో నందకుమార్ ఇదే విషయాన్ని చెప్పినట్టుగా తెలిసింది. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో అప్రూవర్ గా మారాలని అప్పట్లో బీఆర్ఎస్ నుంచి తనపై తీవ్ర ఒత్తిడి కూడా వచ్చిందని నందకుమార్ చెప్పినట్టుగా సమాచారం.
సీపీతో సమావేశం..
ఇక, బుధవారం సాయంత్రం సిట్ బృందంలో ఉన్న అధికారులు బంజారాహిల్స్ లోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ లో హైదరాబాద్ కమిషనర్ సజ్జనార్ తో సమావేశమయ్యారు. రెండు వారాలపాటు ప్రభాకర్ రావును జరిపిన విచారణలో వెల్లడైన వివరాలు, దొరికిన పెన్ డ్రైవ్ లో దొరికిన సమాచారంపై సమీక్ష జరిపారు. కోర్టుకు సమర్పించనున్న అదనపు ఛార్జీషీట్ లో పొందు పరచాల్సిన అంశాలపై చర్చించినట్టుగా తెలిసింది. అదే సమయంలో విచారణకు సంబంధించి సుప్రీం కోర్టుకు సమర్పించనున్న నివేదికపై కూడా సమాలోచనలు చేసినట్టుగా తెలియవచ్చింది. ఇక, ప్రభాకర్ రావుకు విధించిన కస్టోడియల్ విచారణ గడువు ముగిసిన నేపథ్యంలో సిట్ అధికారులు ఆయనను నేడు విడుదల చేయనున్నారు.
Also Read: Fake Job Scam: ఉద్యోగాల పేరిట భారీ మోసం.. కలెక్టర్ సంతకం ఫోర్జరీ చేసి దందా.. !

