Phone Tapping Case: సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ (KCR)కు నోటీసులు ఇవ్వాలని సిట్ అధికారులు నిర్ణయించినట్టుగా తెలుస్తోంది. ఆయనతోపాటు మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావులను కూడా విచారించాలని నిశ్చయించినట్టుగా సమాచారం. రానున్న అసెంబ్లీ సమావేశాల తరువాత ముగ్గురినీ ప్రశ్నించాలని భావిస్తున్నట్టుగా తెలియవచ్చింది. గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కాంగ్రెస్ ప్రభుత్వంలోకి వచ్చాక వెలుగు చూసిన విషయం తెలిసిందే.
ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించి కేసులు నమోదు
ఎలాగైనా సరే ఎన్నికల్లో విజయం దక్కించుకుని హ్యాట్రిక్ సాధించాలని బీఆర్ఎస్ లోని కీలక నేతలు ప్రతిపక్ష పార్టీల్లోని కీలక నాయకుల ఫోన్లను ట్యాప్ చేయించినట్టుగా పెద్ద ఎత్తున ఆరోపణలు వచ్చాయి. అదే సమయంలో ప్రతిపక్ష పార్టీలకు అనుకూలంగా ఉన్న ఆర్థిక వనరులు సమకూరుస్తున్నారనుకున్న పారిశ్రామిక వేత్తలు, బడా వ్యాపారుల ఫోన్లను ట్యాప్ చేయించినట్టుగా వార్తలొచ్చాయి. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారంపై కాంగ్రెస్ ప్రభుత్వం సిట్ విచారణకు ఆదేశించింది. ఈ క్రమంలో ఫోన్ ట్యాపింగ్ కు సంబంధించి కేసులు నమోదు చేసిన సిట్ అధికారులు ఎస్ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు, అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న, టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావులను అరెస్ట్ చేశారు. విచారణలో ఈ నలుగురు వెల్లడించిన వివరాల ఆధారంగా బీఆర్ఎస్ హయాంలో ఎస్ఐబీ ఛీఫ్ గా పని చేసిన ప్రభాకర్ రావును కేసులో ప్రధాన నిందితునిగా చేర్చారు.
Also Read: Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో దూకుడు పెంచిన సిట్.. లేటెస్ట్ అప్‌డేట్ ఏంటంటే?
కొత్త సిట్
ఫోన్ ట్యాపింగ్ పై ప్రభుత్వం సిట్ విచారణకు ఆదేశించినపుడు దానికి ఇన్ ఛార్జ్ గా జూబ్లీహిల్స్ ఏసీపీ వెంకటగిరిని నియమించారు. కాగా, ఏసీపీ స్థాయిలో ఉన్న వెంకటగిరి ప్రశ్నలకు ఎస్ఐబీ ఛీఫ్ హోదాలో పని చేసిన ప్రభాకర్ రావు సరిగ్గా స్పందించటం లేదన్న వార్తలొచ్చయి. ప్రధానంగా ఫోన్ ట్యాపింగ్ వెనక ఉన్న సూత్రధారులు ఎవరు? అన్నదాని గురించి ఎన్ని ప్రశ్నలు వేసినా ప్రభాకర్ రావు నోరు తెరవలేదు. తాను ఏం చేశానో..పై అధికారులు, రివ్యూ కమిటీ సభ్యులకు అంతా తెలుసు అని మాత్రమే సమాధానాలు ఇస్తూ వచ్చారు.
సీపీ సజ్జనార్ నేతృత్వంలో
ఈ నేపథ్యంలో ఫోన్ ట్యాపింగ్ కేసులో పూర్తి స్థాయి విచారణ జరిపేందుకు వీలుగా డీజీపీ శివధర్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. దీంట్లో భాగంగా హైదరాబాద్ కమిషనర్ వీ.సీ.సజ్జనార్ ను సిట్ ఇన్ ఛార్జ్ గా నియమించారు. ఆయనతోపాటు మరో ముగ్గురు ఐపీఎస్ అధికారులను కూడా సిట్ లో చేర్చారు. ఇక, సిట్ ఇన్ ఛార్జ్ గా నియామకం అయిన తరువాత సజ్జనార్ ఇప్పటివరకు సిట్ జరిపిన దర్యాప్తులో వెల్లడైన వివరాలను తెలుసుకున్నారు.
రాధాకిషన్ రావు వాంగ్మూలంలో
ఈ క్రమంలో ఆయన దృష్టికి టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ రావు విచారణలో భాగంగా ఇచ్చిన వాంగ్మూలం వచ్చింది. ఎన్నికల సమయంలో పలువురు పారిశ్రామిక వేత్తలు, హవాలా వ్యాపారుల నుంచి టాస్క్ ఫోర్స్ పోలీసులు పెద్ద మొత్తాల్లో డబ్బు స్వాధీనం చేసుకున్న విషయం తెలిసిందే. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో కీలకంగా వ్యవహారించిన ఎస్ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు ఇచ్చిన సమాచారంతోనే రాధాకిషన్ రావు టాస్క్ ఫోర్స్ బృందాలతో ఈ పని చేయించినట్టుగా వార్తలొచ్చాయి. ఈ నేపథ్యంలోనే సిట్ అధికారులు రాధాకిషన్ రావును నిశితంగా విచారించారు.
బీఆర్ఎస్ సుప్రీం అంటూ
ఈ విచారణలో రాధాకిషన్ రావు బీఆర్ఎస్ సుప్రీం కోసమే ఇదంతా చేశాం అని పరోక్షంగా కేసీఆర్ పేరు చెప్పినట్టుగా సమాచారం. దాంతోపాటు బీఆర్ఎస్ లోని కొందరు ముఖ్య నేతల కోసమే ఫోన్ ట్యాపింగ్ చేశామని కూడా అన్నట్టుగా తెలిసింది. దాంతోపాటు కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నపుడు ఆయన కార్యాలయంలో ఓఎస్డీగా పని చేసిన రాజశేఖర్ రెడ్డి పేరును కూడా రాధాకిషన్ రావు ప్రస్తావించినట్టుగా సమాచారం. ఈ నేపథ్యంలోనే కొన్నిరోజుల క్రితం సిట్ అధికారులు రాజశేఖర్ రెడ్డికి నోటీసులు ఇచ్చి సిట్ కార్యాలయానికి పిలిపించి సుధీర్ఘంగా ప్రశ్నించారు. ఎవరెవరి ఫోన్లను ట్యాప్ చేయించారు? ఎవరు చెబితే ఈ పని చేశారు? అని అడిగినట్టుగా సమాచారం.
ప్రభాకర్ రావును ఎస్ఐబీకి ఛీఫ్ గా ఎందుకు నియమించాల్సి వచ్చింది?
ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ కోసం విదేశాల నుంచి పరికరాలు తెప్పించినట్టుగా నిర్ధారణ అయిన నేపథ్యంలో దీంట్లో మీ పాత్ర ఏమిటి? అని కూడా రాజశేఖర్ రెడ్డిని అడిగినట్టుగా తెలిసింది. దాంతోపాటు రిటైరైన తరువాత ప్రభాకర్ రావును ఎస్ఐబీకి ఛీఫ్ గా ఎందుకు నియమించాల్సి వచ్చింది? అని కూడా ప్రశ్నించినట్టు సమాచారం. రాధాకిషన్ రావు తన వాంగ్మూలంలో బీఆర్ఎస్ సుప్రీం కోసమే అని పలుమార్లు ప్రస్తావించటంతోపాటు రాజశేఖర్ రెడ్డిని జరిపిన విచారణలో వెల్లడైన వివరాల నేపథ్యంలోనే తాజాగా మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీశ్ రావులకు నోటీసులు ఇచ్చి ప్రశ్నించాలని సిట్ నిర్ణయించినట్టుగా తెలియవస్తోంది.
Also Read: Phone Tapping Case: లొంగిపోయిన ప్రభాకర్ రావు.. వారం రోజులపాటు కస్టడీ విచారణ!

