Phone Tapping Case: ఐఏఎస్, ఐపీఎస్ల వాంగ్మూలాల నమోదు
ప్రభాకర్ రావును ప్రశ్నించిన సిద్దిపేట సీపీ
తెలంగాణ బ్యూరో, స్వేచ్ఛ: ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దూకుడు పెంచింది. తాజాగా ముగ్గురు ఐఏఎస్ అధికారులతో పాటు ఓ ఐపీఎస్ అధికారి వాంగ్మూలాలను అధికారులు నమోదు చేశారు. మరోవైపు, ఈ కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావును సిద్దిపేట కమిషనర్ విజయ్ కుమార్ ప్రశ్నించారు. పంజాగుట్ట స్టేషన్‌లో ఫోన్ ట్యాపింగ్ కేసు నమోదైనపుడు ఆయన వెస్ట్ జోన్ డీసీపీగా ఉండటం గమనార్హం. రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ కేసులో అసలు సూత్రధారులు ఎవరన్నది నిగ్గు తేల్చటానికి హైదరాబాద్ కమిసనర్ వీసీ సజ్జనార్ నేతృత్వంలో కొత్తగా సిట్ ఏర్పాటైన విషయం తెలిసిందే. బంజారాహిల్స్‌లోని ఐసీసీసీలో ఆదివారం సిట్ బృందంలోని అధికారులతో సజ్జనార్ సమావేశమయ్యారు. ఇప్పటివరకు జరిపిన దర్యాప్తులో వెల్లడైన వివరాలను ఆయన తెలుసుకున్నారు. ఇకముందు విచారణ ఎలా జరపాలన్న దానిపై మార్గనిర్దేశనం చేశారు.
కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ప్రభాకర్ రావును దర్యాప్తు అధికారులు పలుమార్లు ప్రశ్నించిన విషయం తెలిసిందే. విచారణ జరిపిన ప్రతిసారీ, ‘‘నేనేం చేశానో నా పైఅధికారులు అందరికీ తెలుసు. రివ్యూ కమిటీ అనుమతులు కూడా ఉన్నాయి’’ అని ప్రభాకర్ రావు చెబుతూ వచ్చారు. ఈ క్రమంలోనే ప్రభాకర్ రావు ఎస్ఐబీ చీఫ్‌గా ఉన్న సమయంలో రివ్యూ కమిటీలో ఉన్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, జీఏడీ కార్యదర్శి, ఇంటెలిజెన్స్ చీఫ్ నుంచి మరోసారి స్టేట్‌మెంట్లు తీసుకోవాలని నిర్ణయించారు. ఇందులో భాగంగానే తాజాగా గతంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులుగా పని చేసిన సోమేశ్ కుమార్, శాంతికుమారి, జీఏడీ మాజీ పొలిటికల్ సెక్రటరీ రఘునందన్ రావుతో పాటు అప్పట్లో ఇంటెలిజెన్స్ చీఫ్‌గా ఉన్న నవీన్ చంద్ నుంచి వాంగ్మూలాలు తీసుకున్నారు.
ప్రభాకర్ రావును ఓఎస్డీగా ఎలా నియమించారు? ఎవరి ఆదేశాల మేరకు ఈ నియామకం జరిగింది? అన్న అంశాలపై వివరాలు తీసుకున్నారు. దాంతోపాటు ప్రభాకర్ రావు ట్యాపింగ్ కోసం పంపించిన మొబైల్ నెంబర్లు ఎవరివి? అన్న అంశాన్ని పరిశీలించారా?, లేదా? అన్న దానిపై కూడా సమాచారాన్ని తీసుకున్నారు. పరిశీలించక పోతే ఆ పని ఎందుకు చేయలేదని అడిగినట్టు తెలిసింది. నిబంధనల ప్రకారం మావోయిస్టులు, ఉగ్రవాదులు, వారి సానుభూతిపరుల ఫోన్లను మాత్రమే ట్యాప్ చేయాల్సి ఉంటుందన్న విషయం తెలిసిందే కదా…ఇటువంటి పరిస్థితుల్లో ప్రభాకర్ రావు నుంచి వచ్చిన ఫోన్ నెంబర్లను ఎందుకు వెరిఫై చేయలేదు? అని కూడా అడిగినట్టు తెలిసింది. ఎవరైనా రాజకీయ నాయకులు చెబితేనే ఈ పని చేయలేదా? అని ప్రశ్నించినట్టు సమాచారం. అయితే, వీరిని జరిపిన విచారణలో సైతం ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సూత్రధారులు ఎవరన్నది వెల్లడి కాలేదని తెలియవచ్చింది. అప్పట్లో ప్రభాకర్ రావు ఎస్ఐబీ ఛీఫ్‌గా నేపథ్యంలో ఆయనపై నమ్మకంతోనే పర్మిషన్లు ఇచ్చామని చెప్పినట్టుగా తెలిసింది.
ప్రశ్నించిన సిద్దిపేట సీపీ…
ఇక, సోమవారం జూబ్లీహిల్స్‌లోని సిట్ కార్యాలయంలో ప్రభాకర్ రావును సిద్దిపేట సీపీ విజయ్ కుమార్ సుధీర్ఘంగా ప్రశ్నించారు. నిజానికి మొట్టమొదటగా ఫోన్ ట్యాపింగ్ కేసు పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో నమోదైనపుడు వెస్ట్ జోన్ డీసీపీగా విజయ్ కుమార్ ఉన్న విషయం తెలిసిందే. ఈ కేసులో అరెస్టయిన ఎస్ఐబీ మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు, అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్న, టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావులను అరెస్ట్ చేసిన సమయంలో.. వారిని విచారించినపుడు కూడా ఆయన డీసీపీగా ఉన్నారు. ఈ నేపథ్యంలో కేసుపై ఆయనకు సంపూర్ణ అవగాహన ఉంది. ఈ క్రమంలోనే విజయ్ కుమార్ తాజాగా మరోసారి ప్రభాకర్ రావును ప్రశ్నించారు. అయితే, ప్రభాకర్ రావు మాత్రం ఎలాంటి కీలక వివరాలు వెల్లడించ లేదని సమాచారం. ఇదిలా ఉండగా ఈ కేసులో అనుబంధ ఛార్జ్‌షీట్‌ను కోర్టుకు సమర్పించే దిశగా సిట్ కసరత్తు మొదలు పెట్టింది.
Read Also- Minister Sridhar Babu: విద్యలో సమూల మార్పులే ప్రభుత్వ లక్ష్యం : టీచర్ల సమస్యలపై శ్రీధర్ బాబు భరోసా!

