Mahankali Bonalu: ఆషాడ మాసం బోనాల జాతరలో భాగంగా ఆదివారం సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల జాతర ఘనంగా, ప్రశాంతంగా జరిగింది. గత సంవత్సరం బోనాలు జాతర లో తలెత్తిన లోపాలను సరిదిద్దుకొని, ఈ సారి వివిధ ప్రభుత్వ శాఖలు విస్తృతమైన ఏర్పాట్లు చేయడంతో బోనాల జాతర సజావుగా సాగింది. ముఖ్యంగా బోనాల సమర్పించేందుకు వచ్చిన భక్తుల కోసం ఆరు లైన్లు, వికలాంగులకు, సీనియర్ సిటిజెన్ లకు ప్రత్యేక క్యూ లైన్ ఏర్పాటు చేయడంతో బోనాల జాతరలో ఎలాంటి లోపాలు కలగకుండా సజావుగా ముందుకు సాగింది. శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారికి ఆదివారం ఉదయం తెల్లవారుజామున 4 గంటల10 నిమిషాలకు ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం వివిఐపీలను, సాధారణ భక్తులను అమ్మవారి దర్శనం కోసం అనుమతించారు. శ్రీ ఉజ్జయిని మహంకాళి దేవాలయం ఆలయ కమిటీ నిర్వాహకుల ఆహ్వానం మేరకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమ్మ వారికి సాంప్రదాయ బద్ధంగా పట్టు వస్త్రాలు సమర్పించారు. అంతకన్నా ముందు ఆలయానికి విచ్చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ, హైదరాబాద్ జిల్లా ఇన్ చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్, దేవదాయ శాఖ మంత్రి కొండా సురేఖ ఘనంగా స్వాగతం పలికారు. మంత్రులతో పాటు ఎంపీ అనిల్ కుమార్ యాదవ్, ఎమ్మెల్యే దానం నాగేందర్ ఉన్నారు. అంతకుముందు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సతీసమేతంగా అమ్మవారికి బోనం సమర్పించి దర్శనం చేసుకున్నారు. లష్కర్ విధులు ఎక్కడ చూసినా అమ్మ బైలెల్లినాదో.. మాయదారి మైసమ్మ మైసమ్మ.. అంటూ అమ్మవారిని స్మరించుకునే జానపద గీతాలు వినిపించాయి. బోనాలతో వచ్చిన భక్తుల ముందు పోతురాజు విన్యాసాలు, యువకులకు కేరింతలు ఎంతగానో ఆకట్టుకున్నాయి.
Also Read: Fire Crime: నారాయణపేట జిల్లాలో దారుణం.. మంటల్లో చిక్కుకున్న బాలిక చివరికి!
మధ్యాహ్నం తర్వాత అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. సాధారణ భక్తులు దర్శనం కోసం దాదాపు క్యూలైన్ల లో రెండు గంటలు వేచి ఉండాల్సి వచ్చింది. కాగా, ఇప్పటి వరకు గోల్కొండ , లష్కర్ బోనాలు ప్రశాంతంగా జరిగిన నేపథ్యంలో వచ్చే ఆదివారం 20వ తేదీన జరగనున్న పాతబస్తీ బోనాల ఉత్సవాల పైన పోలీసులు ప్రధానంగా దృష్టి సారించారు. పాతబస్తీ బోనాలు కూడా ప్రశాంతంగా. అత్యంత భక్తిశ్రద్ధలతో ఘనంగా జరిగేందుకు వీలుగా పోలీసులు వ్యూహాన్ని రచించినట్లు సమాచారం.
సాయంత్రం నుంచి మొదలైన ఫలహారం బండ్ల ఊరేగింపులు
తెల్లవారుజామున 4 గంటల పది నిమిషాలకు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం అమ్మవారికి బోనాల సమర్పణకు ఆలయ కమిటీ అనుమతించింది. సాయంత్రం 6 గంటల వరకు సుమారు వేలాదిమంది మహిళా భక్తులు తమ బోనాలను ఘటాలను అమ్మవారికి సమర్పించారు. సాయంత్రం 6 గంటల తర్వాత సికింద్రాబాద్ లోని వివిధ ప్రాంతాల్లోని ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో ఫలహారం బండి ఊరేగింపులు ఘనంగా జరిగాయి. డబ్బు వాయిద్యాలు, యువకుల నాట్య విన్యాసాలు పోతురాజుల ఆటలతో పలహారం బండి ఊరేగింపులు విశేషంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా పాన్ బజార్. గాన్స్ మండి శివాజీ నగర్, రాణిగంజ్ ప్రాంతాల నుంచి వచ్చిన ఫలహారం బండ్ల ఊరేగింపులు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
Also Read: AP Deputy CM Pawan: కోట శ్రీనువాసరావు మరణ వార్త విని తీవ్ర ఆవేదనకు లోనయ్యా.. పవన్ కళ్యాణ్
అంబారిపై అమ్మవారి ఊరేగింపు
ఆషాడమాసపు బోనాల జాతరలో భాగంగా ఆదివారం బోనాలు, తొట్టెల సమర్పణ అనంతరం సోమవారం ఉదయం శ్రీ ఉజ్జయిని మహంకాళి ఆలయం ఆవరణలో రంగం కార్యక్రమం నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. రంగం కార్యక్రమంలో అమ్మవారు భవిష్యవాణి వినిపించిన అనంతరం శ్రీ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని అంబారిపై ఊరేగించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. అంబారీపై అమ్మవారిని ఊరేగిస్తున్న సమయంలో ఎలాంటి లోటుపాట్లు తలెత్తకుండా పగడ్బందీ చర్యలు తీసుకోవాలన్న సర్కారు ఆదేశాల మేరకు పోలీసులు, జిహెచ్ఎంసి, దేవాదాయశాఖ అధికారులు సమిష్టిగా ప్లాన్ చేసినట్లు సమాచారం. కాగా సోమవారం ఉదయం జరిగే రంగం కార్యక్రమంలో అమ్మవారు ఎలాంటి భవిష్య వాణి వినిపిస్తారని భక్తులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు