AP Deputy CM Pawan: కోట శ్రీనివాసరావు మృతిపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ సంతాపం తెలియజేశారు. తెలుగు చిత్ర పరిశ్రమలో విలక్షణమైన నటనకు చిరునామాగా నిలిచిన శ్రీ కోట శ్రీనివాసరావు గారు తుది శ్వాస విడిచారని తెలిసి తీవ్ర ఆవేదనకు లోనయ్యాను. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నాను. తెలుగు తెరపై ప్రతినాయకుడిగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా విభిన్నమైన పాత్రలు పోషించారు. తెలుగు భాష.. యాసలపై ఆయనకు మంచి పట్టు ఉంది. ఓ పిసినారిగా, ఓ క్రూరమైన విలన్ గా, ఓ మధ్య తరగతి తండ్రిగా, ఓ అల్లరి తాతయ్యగా.. ఏ పాత్రలోనైనా ఒదిగిపోయారు. 1999-2004 మధ్య శాసన సభ్యుడిగా సేవలందించారు.
శ్రీ కోట శ్రీనివాసరావు గారితో మా కుటుంబానికి మంచి స్నేహ సంబంధాలు ఉన్నాయి. అన్నయ్య చిరంజీవి గారు నటించిన ప్రాణం ఖరీదుతోనే శ్రీ కోట గారు చిత్ర సీమకు పరిచయం అయ్యారు. నా మొదటి చిత్రం అక్కడ అమ్మాయి ఇక్క అబ్బాయిలో ఆయన ముఖ్యమైన పాత్రలో ప్రేక్షకులను అలరించారు. ఆ తరవాత గోకులంలో సీత, గుడుంబా శంకర్, అత్తరింటికి దారేది, గబ్బర్ సింగ్ తదితర చిత్రాల్లో కలసి నటించాము. శ్రీ కోట శ్రీనివాసరావు గారు డైలాగ్ చెప్పే విధానం, హావభావాలు ప్రేక్షకులను కట్టిపడేస్తాయి. శ్రీ కోట శ్రీనివాసరావు గారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను.